Joint Collector Mayur Asho said that the re-survey process is going on hopefully as part of Jagananna’s permanent land rights- land protection scheme with the aim of giving permanent rights to the farmers so that there are no land problems again and again.
Publish Date : 26/09/2022
మళ్లీ మళ్లీ సమస్యలు రాకుండా… రీ-సర్వే,
ఏళ్ల నాటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కొనసాగుతున్న ప్రక్రియ,
జిల్లాలో 125 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి.. అక్టోబర్ తొలివారంలో పత్రాల అందజేత,
భూముల రీ-సర్వే ప్రక్రియపై ప్రత్యేకంగా మాట్లాడిన జేసీ మయూర్ అశోక్
విజయనగరం, సెప్టెంబర్ 20 ః మళ్లీ మళ్లీ భూ సమస్యలు రాకుండా.. రైతులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా శాశ్వత హక్కులు కల్పించే లక్ష్యంతో జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకంలో భాగంగా జిల్లాలో రీ-సర్వే ప్రక్రియ ఆశాజనకంగా సాగుతోందని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పేర్కొన్నారు. బాడంగి, రామభద్రపురం, తెర్లాం, బొబ్బిలి, జామి, కొత్తవలస, వంగర, సంతకవిడి తదితర మండలాల పరిధిలో 125 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయిందని వివరించారు. ఇప్పటి వరకు సర్వే పూర్తయిన గ్రామాల్లో అక్టోబర్ తొలి వారం నుంచి ఎల్.పి.ఎన్.(ల్యాండ్ పార్శిల్ నెంబర్)తో కూడిన పత్రాలను అందజేస్తామని తెలిపారు. జిల్లాలో జరుగుతున్న రీ-సర్వే ప్రక్రియపై రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ.. ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియపై మంగళవారం పూర్తిస్థాయి వివరాలు అందజేశారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సులభతర విధానంలో భూ హక్కులు కల్పించాలని నిర్దేశించినట్లు జేసీ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలో వీఆర్వోలు, సర్వేయర్లు, సాంకేతిక సిబ్బంది, గ్రామ వాలంటీర్లు మొత్తం 2000 మందితో రీ-సర్వే ప్రక్రియ నిరంతరం సాగుతోందని వివరించారు. వీరందరి సాయంతో జిల్లాలో తక్కువ కాలంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలిగామని హర్షం వ్యక్తం చేశారు. రీసర్వే సజావుగా సాగేందుకు ఇప్పటికే పలు దఫాలు క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణలు ఇప్పించామని తెలిపారు. ఇప్పటికే 60 శాతం డ్రోన్ సర్వే పూర్తయిందని వెల్లడించారు.
నిబంధనల మేరకే రీ-సర్వే ప్రక్రియ
జిల్లాలో చేపడుతున్న రీ-సర్వే ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తున్నామని జేసీ అన్నారు. దీనిలో భాగంగా సర్వే చేపట్టబోయే గ్రామంలో ముందుగా సెక్షన్.13 ద్వారా సమాచారం తెలియజేస్తున్నామని, ఫారం.8 ద్వారా నోటీసులు కూడా అందజేస్తున్నామని తెలిపారు. సర్వే ప్రక్రియ మొదలైన నాటి నుంచి పత్రాలు అందజేసే వరకు ఐదు సార్లు గ్రామ సభలు నిర్వహిస్తున్నామని వివరించారు. గ్రామ సభల్లో ప్రజల ఆమోదం మేరకే ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. రీసర్వే జరిగే గ్రామాల్లో లేదా పూర్తయిన గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి అభ్యంతరాలున్నా స్థానిక సచివాలయల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని జేసీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఎలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ రీ-సర్వే ప్రక్రియ ద్వారా ఏళ్లనాటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జేసీ చెప్పారు. సాదా బై నామా భూములకు, చుక్కల భూములు అనుభవిస్తున్న వారికి, డీ-పట్టాదార్లకు, పార్టీషన్ డీడ్‌కు సంబంధించిన భూములకు రీసర్వే ద్వారా శాశ్వత పరిష్కారం దొరుకుతుందని జేసీ పేర్కొన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలకు తప్ప మిగతా అన్ని రకాల భూ సమస్యలకు సులభతరమైన విధానంలో పరిష్కారం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీషన్ డీడ్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధన ఏమీ లేదని నోటరీ ద్వారా అంగీకార పత్రం అందజేసినట్లయితే సమస్యను పరిష్కరిస్తామని జేసీ చెప్పారు. ప్రధానంగా 22ఏ భూములకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని జేసీ వివరించారు.
అక్టోబర్ తొలివారంలో భూ హక్కు పత్రాలు పంపిణీ
ఇప్పటి వరకు జిల్లాలో రీ-సర్వే పూర్తయిన 125 గ్రామాల్లో అక్టోబర్ తొలి వారం నుంచి ఎల్.పి.ఎన్.(ల్యాండ్ పార్శిల్ నెంబర్)తో కూడిన భూహక్కు పత్రాలు సుమారు 15వేల మంది రైతులకు అందజేస్తామని జేసీ మయూర్ అశోక్ పేర్కొన్నారు. అలాగే సర్వే రాళ్ల విషయంలో ప్రభుత్వం నేరుగా అందించినవి తీసుకున్నా ఫర్వాలేదు లేదా రైతులే నేరుగా రాళ్లను పాతుకోవచ్చని స్పష్టం చేశారు. నిబంధనల మేరకు సంబంధిత రైతుకు సర్వే రాళ్ల నిమిత్తం నగదు కూడా అందజేస్తామని చెప్పారు. రైతుల ప్రాథమిక సమాచారం సేకరించే పనిలో క్షేత్రస్థాయి సిబ్బంది నిమగ్నమై ఉన్నారని, వారికి రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని జేసీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక సమాచారంలో భాగంగా రైతులు వారి పూర్తి వ్యక్తిగత వివరాలు, చిరునామా, ఆధార్ కార్డు, ఫోటో, ఫోన్ నెంబర్ అందజేయాల్సి ఉంటుందని వివరించారు. రీ-సర్వే ప్రక్రియపై అపోహలు వీడి.. మరింత ఆశాజనకంగా ఈ ప్రక్రియ కొనసాగేందుకు జిల్లాలోని రైతాంగం సహకరించాలని జేసీ కోరారు.