Joint Collector Mayur Ashok directed that all the departments should immediately respond to the objections raised by the audit department and conduct a special drive to resolve them.
Publish Date : 14/09/2022
ఆడిట్ అభ్యంతరాలపై స్పెషల్ డ్రైవ్
జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్
విజయనగరం, సెప్టెంబరు 12 ః ఆడిట్ శాఖ లేవనెత్తిన అభ్యంతరాలపై అన్నిశాఖలు వెంటనే స్పందించి, వాటిని పరిష్కరించుకోడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆదేశించారు. నెల రోజుల్లో ఆడిట్ అభ్యంతరాలన్నీ పరిష్కారం అయిపోవాలని ఆయన స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆడిట్ అభ్యంతరాలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టరేట్ సమావేశమందిరంలో సోమవారం జరిగింది.
జిల్లా ఆడిట్ అధికారి అరుణకుమారి మాట్లాడుతూ, వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఆడిట్ అభ్యంతరాలను వివరించారు. 2019 అక్టోబరు 18 తరువాత, వివిధ కారణాల రీత్యా ఇప్పటివరకు జిల్లా స్థాయి సమావేశం జరగలేదని చెప్పారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలపై, ఆయా శాఖలు సరైన విధంగా సమాధానం ఇవ్వడమే కాకుండా, సంబంధిత వివరాలను, పత్రాలను కూడా సమర్పిస్తే, చాలావరకు పరిష్కారం అయిపోతాయని సూచించారు. నిర్ణీత తేదీలను తెలియజేస్తే, తమ అధికారులే ఆయా శాఖల కార్యాలయాలకు వచ్చి అభ్యంతరాల పరిశీలించి, పరిష్కరిస్తారని చెప్పారు.
జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ, ఆడిట్ శాఖ లేవనెత్తిన అభ్యంతరాలపై స్పందించి, వాటిని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఆయా శాఖలపైనే ఉందని స్పష్టం చేశారు. చాలా శాఖల్లో అభ్యంతరాలు పెండింగ్‌లో ఉండిపోయాయని, ఆడిట్ విషయంలో నిర్లక్ష్యాన్ని చూపవద్దని సూచించారు. ప్రభుత్వ శాఖల్లో ఆడిట్ చేయించడం ఒక కీలక అంశమని ఆయన పేర్కొన్నారు. పేరుకుపోయిన అభ్యంతరాలను పరిష్కరించుకోడానికి, ప్రతీ ప్రభుత్వ విభాగమూ ఒక కార్యాచరణను రూపొదించాలని ఆదేశించారు. త్వరలో ఎంపిడిఓలు, ఇఓపిఆర్‌డిలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, ఆడిట్ అభ్యంతరాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని, జెడ్‌పి సిఇఓను జెసి ఆదేశించారు.
సమావేశంలో జెడ్‌పి సిఇఓ డాక్టర్ ఎం.అశోక్ కుమార్, డిపిఓ ఇందిరా రమణ, ఆడిట్ అధికారులు, మండల పరిషత్, మున్సిపాల్టీలు, మార్కెటింగ్, దేవాదాయశాఖ, జిల్లా గ్రంథాలయ సంస్థ తదితర శాఖల ప్రతినిధులు, అకౌంట్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
