Land registration services in two villages, secretariats to make arrangements to start –J.C. Dr. Kishore Kumar
Publish Date : 09/12/2021
రెండు గ్రామ సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ సేవలు
ప్రారంభించే ఏర్పాట్లు చేయాలన్న జె.సి. డా.కిషోర్ కుమార్
లాండ్ పార్శిల్ వారీగా భూముల మార్కెట్ ధరలు నిర్ధారణ
విజయనగరం, డిసెంబరు 09; జిల్లాలోని రెండు గ్రామ సచివాలయాల్లో తొలి దశలో భూముల రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్(రెవిన్యూ, రైతుభరోసా) డా.జి.సి.కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వై.ఎస్.ఆర్., జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష కార్యక్రమంలో చేపట్టిన భూముల సమగ్ర రీసర్వే తొలి విడతగా రెండు గ్రామాల్లో పూర్తయ్యిందని ఆ రెండు గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్ సచివాలయాల ద్వారా చేపట్టేందుకు సన్నద్ధం కావాలని రెవిన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులను ఆదేశించారు. రామభద్రపురం మండలం మర్రివలస గ్రామానికి సంబంధించి సోంపురం సచివాలయంలో, బొండపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి సంబందించి ముద్దూరు సచివాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ రెండు గ్రామాల్లో సమీకృత భూసర్వే పూర్తయినందున ఆయా గ్రామ సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ సహాయకులకు రిజిస్ట్రేషన్లపై ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా రిజిష్ట్రార్, రామభద్రపురం, బొండపల్లి మండలాల రెవిన్యూ అధికారులు, సర్వేయర్లు తదితర సిబ్బందితో జాయింట్ కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఇకపై సర్వే నెంబరు వారీగా కాకుండా సమీకృత భూసర్వే ప్రకారం ల్యాండ్ పార్శిల్ వారీగా భూములకు మార్కెట్ ధరలు నిర్ణయించాలని చెప్పారు. సర్వే నెంబరు వారీగా వుండే భూముల మార్కెట్ ధరలకు, ల్యాండ్ పార్శిల్ వారీగా మార్పుచేసి రెండింటి మధ్య సామీప్యత తీసుకురావాలన్నారు. పార్శిల్ వారీగా ధరలు నిర్ణయించిన తర్వాత జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో భూముల విలువలను నిర్ధారిస్తూ నిర్ణయం తీసుకుంటామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 51 గ్రామ సచివాలయాల ద్వారా తొలివిడతగా భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభించనుందని, మన జిల్లాకు సంబంధించి రెండు సచివాలయాల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.
సమావేశంలో జిల్లా రిజిష్ట్రార్ సృజన, రెవిన్యూ, సర్వే అధికారులు పాల్గొన్నారు.