Close

* Let’s work together in coordination * Collector Suryakumari meets Rajam Division officers * Collector visits Rajam for the first time after redistricting

Publish Date : 11/04/2022

*స‌మ‌న్వ‌యంతో… క‌లిసి ప‌ని చేద్దాం*
*రాజాం డివిజ‌న్ అధికారుల‌తో స‌మావేశ‌మైన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి
*జిల్లాల పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత తొలిసారి రాజాంలో క‌లెక్ట‌ర్ ప‌ర్య‌ట‌న‌

జిల్లాల పున‌ర్విభజ‌న ప్ర‌క్రియలో భాగంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో క‌లిసిన రాజాం డివిజ‌న్ ప‌రిధిలో క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి తొలిసారిగా శ‌నివారం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు చీపురుప‌ల్లి ఆర్డీవో అప్పారావు, త‌హ‌శీల్దార్లు, ఎంపీడీవోలు, ఇత‌ర అధికారులు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముందుగా రాజాం త‌హశీల్దార్ కార్యాల‌యానికి చేరుకొని చీపురుప‌ల్లి ఆర్డీవో అప్పారావుతో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. జిల్లాలో క‌లిసిన నాలుగు మండ‌లాల విస్తీర్ణం, ప‌రిధి ఇత‌ర వివ‌రాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా మండ‌లాల‌కు సంబంధించి మ్యాప్‌ను ప‌రిశీలించారు.

అనంత‌రం త‌హశీల్దార్ కార్యాల‌య స‌మావేశ మందిరంలో నాలుగు మండ‌లాల త‌హ‌శీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, వైద్య‌, వ్య‌వ‌సాయ‌, పశు సంవ‌ర్ధ‌క‌, తాగునీటి స‌ర‌ఫ‌రా, పంచాయ‌తీ రాజ్ త‌దిత‌ర శాఖ‌ల మండ‌ల స్థాయి అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ప‌రిపాల‌నా ప‌ర‌మైన ప‌లు అంశాల‌పై మార్గ‌నిర్దేశ‌కాలు జారీ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీ‌కాకుళం జిల్లా ప‌రిధిలో ఉన్న మీరంతా… ఇక నుంచి విజ‌య‌న‌గ‌రం ప‌రిధిలో ప‌ని చేయాల్సి వ‌స్తుందని గుర్తు చేశారు. మ‌నమంతా స‌మ‌న్వ‌యంతో క‌లిసి ప‌ని చేద్దామ‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లందించేందుకు స‌మ‌ష్టి కృషి చేద్దామ‌ని పిలుపునిచ్చారు. ఒక్కో మండ‌లం నుంచి వ‌చ్చిన అధికారుల‌ను ఆయా మండలాల ప‌రిధిలో ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్టిన చ‌ర్య‌ల గురించి క‌లెక్ట‌ర్ ముందుగా తెలుసుకున్నారు. కొత్త ల‌క్ష్యాల‌ను ఏర్పాటు చేసుకొని వాటిని సాధించేందుకు ప్ర‌ణాళికాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ప‌నుల ప్ర‌గ‌తిలో మెరుగైన ఫ‌లితాలు సాధించాల‌ని, త‌ప్పుడు నివేదికలు పంపించి త‌ప్పుదారి ప‌ట్టించవ‌ద్దని హెచ్చ‌రించారు. సాధ్య‌మైన మేర‌కు అంద‌రూ హెడ్ క్వార్ట‌ర్‌లో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్‌ సూచించారు.

*నిర్మాణ ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయండి*

స‌చివాల‌యాలు, రైతు భ‌రోసా కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాలు త్వ‌రిత‌గ‌తిన నిర్మించి అందుబాటులోకి తీసుకురావాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఉపాధి హామీ ప‌థ‌కంలో భాగంగా సాధ్య‌మైనంత ఎక్కువ మందికి ప‌నులు క‌ల్పించాల‌ని ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. అలాగే వేస‌విని దృష్టిలో పెట్టుకొని తాగునీటి స‌దుపాయాలు క‌ల్పించాల‌ని చెప్పారు. రీ స‌ర్వే ప్ర‌క్రియలో వేగం పెంచాల‌ని, సంప‌ద త‌యారీ కేంద్రాల‌ను వీలైనంత త్వ‌ర‌గా వినియోగంలోకి తీసుకు రావాల‌ని సూచించారు. కంచ‌రం ప‌రిధిలో చేప‌ట్టిన రోడ్డు నిర్మాణ ప‌నులు, తునివాడ‌, కందివ‌ల‌స ఇసుక రీచ్ ల నుంచి ఇసుక స‌ర‌ఫ‌రా, జ‌గ‌నన్న కాల‌నీల్లో నిర్మాణ ప‌నులు త‌దిత‌ర అంశాల‌పై ఆయా మండ‌లాల అధికారులు క‌లెక్ట‌ర్ కు వివ‌రించారు. క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న‌లు చేసి స‌మ‌స్య‌ల‌ను ప‌రిశీలించి త‌దుపరి చ‌ర్యలు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ అధికారుల‌కు సూచించారు.

*ఫోర్టిఫైడ్ రైస్‌పై అవ‌గాహ‌న క‌ల్పించండి*

విజ‌య‌న‌గ‌రం జిల్లా అంతా ఫోర్టిఫైడ్ రైస్ స‌ర‌ఫ‌రా చేశామ‌ని, ఇక నుంచి రాజాం డివిజ‌న్ ప‌రిధిలో కూడా ఫోర్టిఫైడ్ రైస్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. ఈ రైస్ వినియోగంపై ఇప్ప‌టి నుంచే ప్ర‌జ‌ల్లో విరివిగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని అధికారుల‌కు సూచించారు. ప్ర‌జ‌లు ర‌క్త‌హీన‌త స‌మస్యకు గురికాకుండా బ‌ల‌వ‌ర్ధ‌క బియ్యం ఎంతో ఉప‌క‌రిస్తాయని, అంద‌రూ వినియోగించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె చెప్పారు.

స‌మావేశంలో రాజాం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ కృష్ణారావు, త‌హశీల్దార్ వేణుగోపాలరావు, బి. శంక‌ర్ రావు, సంత‌క‌విటి, వంగ‌ర‌, రేగ‌డి ఆముదాలవ‌ల‌స మండ‌లాల‌ త‌హ‌శీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయ‌తీ రాజ్‌, తాగునీటి స‌ర‌ఫ‌రా, విద్యా, వైద్య, వ్య‌వసాయ, ప‌శుసంవ‌ర్ధ‌క త‌దిత‌ర‌ శాఖల మండ‌ల స్థాయి అధికారులు, ఇత‌ర ఉద్యోగులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

* Let's work together in coordination * Collector Suryakumari meets Rajam Division officers * Collector visits Rajam for the first time after redistricting