Linking Aadhaar to vote for transparency *JC Mayur Ashok appeals to everyone to cooperate in the process *JC held a special meeting with representatives of political parties
Publish Date : 04/10/2022
పారదర్శకత కోసమే ఓటుకు ఆధార్ అనుసంధానం
*ప్రక్రియకు అందరూ సహకరించాలని జేసీ మయూర్ అశోక్ విజ్ఞప్తి
*రాజీకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన జేసీ
విజయనగరం, అక్టోబర్ 01 ః డూప్లికేట్ ఓట్లను తొలగించేందుకు.. పూర్తిస్థాయి పారదర్శకతను కల్పించేందుకు ఓటుకు ఆధార్ కార్డును అనుసంధానం చేస్తున్నామని దీనికి అన్ని రాజకీయ పార్టీ నేతలు సహకరించాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటు కలిగిన ఉన్న ప్రతి వ్యక్తికీ ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని, ఆధార్ అనుసంధాన ప్రక్రియను పటిష్ఠంగా నిర్వహించాలని జేసీ సూచించారు. సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ ఇతర అంశాలపై చర్చించే నిమిత్తం ఆయన శనివారం వివిధ రాజకీయ ప్రార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ మీటింగ్ హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి ప్రతి 1500 మంది ఓటర్ల వరకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనికి గాను సంబంధిత విభాగ అధికారులు ప్రణాళికాయుతంగా వ్యవహరించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 300 ఓటర్లు దాటితో ఒక కొత్త పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఓటరు నివాసం ఉండే ప్రాంతానికి సమీపంలోనే బూత్‌ను కేటాయించాలని ఈ మేరకు బూత్ లెవెల్ అసిస్టెంట్ల సహాయంతో ఓటర్లు జాబితాను అనుసరించి పోలింగ్ బూత్‌లు కేటాయించాలని సూచించారు. దీనిలో రాజకీయ పార్టీల ప్రతినిధులు చొరవ చూపి అధికారులకు, సిబ్బందికి సహకరించాలని జేసీ ఈ సందర్భంగా కోరారు. అలాగే గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు తగిన చర్యలు తీసుకోవాని ఎలక్షన్ సెల్ అధికారులకు సూచించారు. నియమావళిని అనుసరించి సంబంధిత ప్రక్రియను సజావుగా నిర్వహించాలని చెప్పారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు సూర్యనారాయణ, పద్మావతి, వైకాపా నుంచి రొంగలి పోతన్న, తెదేపా నుంచి కనకాల మురళీ మోహన్, ఆప్ నుంచి కె. దయానంద్, జనసేన పార్టీ నుంచి డి. రామచంద్రరావు ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మహేశ్, ఇతర రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.