Malaria, Dengue should be prevented, special focus on sanitation, District Collector A. Suryakumari congratulates ITDA PO
Publish Date : 31/01/2022
మలేరియా, డెంగ్యూ నివారించాలి
పారిశుధ్యంపై ప్రత్యేకదృష్టి సారించాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
ఐటిడిఏ పీఓను అభినందించిన కలెక్టర్
విజయనగరం, జనవరి 29 ః జిల్లాలో మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా తదితర దోమకాటువల్ల వ్యాప్తి చెందే వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ముఖ్యంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిర్లక్ష్యం చేయబడిన ఉష్టమండల వ్యాధుల నియంత్రణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం వర్చువల్గా జరిగింది.
ఈ సమావేశంలో కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, జ్వరాల నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించారు. పారిశుధ్యాన్ని మెరుగు పర్చడం ద్వారా చాలావరకు మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులను అదుపుచేయవచ్చని సూచించారు. దీనికోసం ముందుగా పరిశరాల పరిశుభ్రతను పాటించడంతోపాటుగా, దోమల నివారణకు అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని అన్నారు. ఇటువంటి వ్యాధులను నివారించాలంటే, ప్రజల్లో ముందుగా సరైన అవగాహన కల్పించడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. దీనికోసం విస్తృత స్థాయిలో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. కళాజాతాల నిర్వహణతోపాటుగా, ఇంటింటి ప్రచార కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఏయే ప్రాంతాల్లో ఇటువంటి వ్యాధులు తరచూ విజృంభిస్తున్నాయో గుర్తించి, అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. అవసరమైతే ఆయా ప్రాంతాల కుల పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులను కూడా ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలన్నారు. సాధారణంగా ఇటువంటి వ్యాధులు, జ్వరాలు ఎక్కువగా జూన్ నుంచి మొదలవుతాయని, అందువల్ల ఫిబ్రవరి నుంచి మే వరకు కనీసం మూడు దఫాలుగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు.
నీరు నిల్వ ఉండే లోతట్టు ప్రాంతాల్లో డెబ్రిస్ ని వేయడం ద్వారా, దోమల వ్యాప్తిని నివారించడంతోపాటుగా, డెబ్రిస్ సమస్యకు కూడా ఒక పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ అన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను, జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు. అన్ని సంక్షేమ వసతి గృహాల్లో దోమలు రాకుండా కిటీకీలకు మెష్లను ఏర్పాటు చేయాలని సూచించారు. దోమల నివారణకు మురికిగుంటల్లో గంబూషియా చేప పిల్లలను విడిచిపెట్టాలని చెప్పారు. ఫీవర్ సర్వేలను తరచూ నిర్వహించి, కేసులు నమోదు అయినచోట వెంటనే చర్యలను ప్రారంభించాలని సూచించారు. మలేరియా వ్యాధి ఇటీవల కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో గణనీయంగా తగ్గడం పట్ల, ఐటిడిఏ పీఓ ఆర్.కూర్మనాధ్ను అభినందించారు. మైదాన ప్రాంతాలు, పట్టణాల్లో ఎక్కువగా కేసులు నమోదు అవుతుండటం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని, వ్యాధుల నివారణపై ప్రత్యేక శ్రద్ద చూపాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో ఐటిడిఏ పిఓ ఆర్.కూర్మనాధ్, డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ ఎస్వి రమణకుమారి, డిపిఓ సుభాషిణి, జిల్లా మలేరియా అధికారి ఎం.తులసి, విజయనగరం మున్సిపల్ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ మాట్లాడగా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
