Maternal deaths should be prevented and delivery should take place in a hospital. Vaccination process is commendable. District Collector A. Suryakumari
Publish Date : 18/10/2021
మాతృమరణాలను అరికట్టాలి
ఆసుపత్రిలోనే ప్రసవం జరిగేలా చూడాలి
వేక్సినేషన్ ప్రక్రియ అభినందనీయం
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, అక్టోబరు 12 ః మాతృమరణాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి అధికారులను కోరారు. గర్భం దాల్చిన తరువాత త్వరగా వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చవచ్చని సూచించారు. ఈ ఏడాది ఏప్రెల్ నుంచీ జిల్లాలో వివిధ కారణాలతో జరిగిన మాతృమరణాలపై కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ఆడిట్ నిర్వహించారు. మరణాలకు కారణాలపై సంబంధిత వైద్యాధికారులను, ఇతర సిబ్బందిని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, మహిళల్లో అవగాహన కల్పించడం ద్వారా మాతృమరణాలను చాలావరకూ అరికట్టవచ్చని అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే అశా కార్యకర్తలు, అంగన్‌వాడీలు, ఎఎన్ఎంలు మహిళలకు వివిధ ఆరోగ్య అంశాలపట్ల అవగాహన కల్పించాలని సూచించారు. గర్భం దాల్చిన మూడునెలల లోపే, వారి పేర్లను రిజష్టర్ చేసుకొని, వారికి వైద్య సహాయాన్ని అందించాలన్నారు. ప్రసవం ఖచ్చితంగా ఆసుపత్రిలోనే జరగాలని, అవసరమైతే డెలివరీకి ముందుగానే వారిని ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ప్రసవం జరిగిన గంటలోగా, పుట్టిన బిడ్డకు తల్లిపాలను తప్పనిసరిగా ఇచ్చేలా చూడాలన్నారు. వారికి ఇవ్వాల్సిన వివిధ రకాల టీకాలను సకాలంలో ఇవ్వాలని కోరారు.
జిల్లాలో నిర్వహిస్తున్న కోవిడ్ వేక్సినేషన్ ప్రక్రియ పట్ల కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లు తదితర క్షేత్రస్థాయి సిబ్బంది పట్టుదలతో, అంకితభావంతో పనిచేస్తూ, వేక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారని అభినందించారు. అయితే కొన్నిచోట్ల అవగాహనా లోపం, ప్రజలనుంచి తగిన సహకారం లేకపోవడం వల్ల, ప్రక్రియ మందకొడిగా జరుగుతోందన్నారు. అలాంటి వాటిపై దృష్టిపెట్టి, అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని, శతశాతం పూర్తి చేయాలని సూచించారు. వేక్సినేషన్‌కు తగిన స్టాకును ముందుగానే సిద్దం చేసుకోవాలని, ఆన్‌లైన్ చేసే ప్రక్రియలో లోపాలను తొలగించుకోవాలని చెప్పారు. ఇటీవల కొన్ని జిల్లాల్లో కోవిడ్ పాజిటివ్ రేటు పెరుగుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని, తమ పరిధిలోని ప్రతీఒక్కరికీ వేక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, అడిషనల్ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎల్.రామ్మోహన్, సిపిఓ జె.విజయలక్ష్మి, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వరి, వైద్యాధికారులు, ఎఎన్ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.