Close

Raise awareness on organic farming: District Collector Surya Kumari

Publish Date : 20/12/2021

రబీ లో ఆరుతడి పంటల పైనే దృష్టి పెట్టాలి: జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు

పండగ ముందే ధాన్యం డబ్బులు చెల్లించాలి:  ఎ ఎ బి చైర్మన్ వాకాడ నాగేశ్వర రావు

సేంద్రియ వ్యవసాయం  పై అవగాహన పెంచాలి: జిల్లా కలెక్టర్ సూర్య కుమారి

నూర్చే  సమయానికి గన్నీలు అందజేస్తాం: సంయుక్త కలెక్టర్  డా.జి.సి.కిషోర్

జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం  లో పలు అంశాల పై చర్చ

విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌ర్ 18 :  జైకా ప్రాజెక్ట్ క్రింద జిల్లాలో ఉన్న జలాశయాలన్నిటిని అభివృద్ధి చేయడానికి ఇప్పటికే టెండర్లు పిలిచినందున ఈ ఏడాది  రబీ సీజన్  కు నీటి విడుదల సాధ్యం కాదని, చెరువుల్లో నీటి నిల్వలు ఉన్న చోట, బోరు బావులు అందుబాటు లో ఉన్న చోట ఆరు తడి పంటలను రైతులు వేసుకునేలా వ్యవసాయాధికారులు అవగాహన కలిగించాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు అధికారులకు ఆదేశించారు.  శనివారం కలక్టరేట్  సమావేశ మందిరం లో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు.  ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ  వెంగలరాయ సాగర్, తాటిపూడి, ఆండ్ర, వట్టిగెడ్డ, పెద్ద గెడ్డ , తోటపల్లి  జలాశయాల పరిధి  లో నున్న రైతులకు రబీలో నీరు అందించలేమనే  విషయాన్ని   రైతు భరోసా కేంద్రాల ద్వారా ముందే సమాచారం అందించాలని సూచించారు. ప్రత్యామ్నాయంగా నీటి వనరులను, అందుకు తగ్గ పంటలను వేసుకునేలా అవగాహన కలిగించాలని అన్నారు.

       బీమసింగి కర్మాగారం పరిధి లో నున్న చెరకు రైతుల నుండి వారంలోగా చెరకును తీసుకోవాలని సూచిస్తూ,  ఎన్.సి.ఎస్ రైతులకు  కూడా చెల్లింపులు వేగంగా చేయాలన్నారు.  కేన్ సహాయ కమీషనర్ లోకేష్ మాట్లాడుతూ  ఎన్.సి.ఎస్ పరిధి లో ఇప్పటికే 8400 టన్నుల ను తీసుకొని సుమారు కోటి రూపాయలను చెల్లించడం జరిగిందని వివరించారు.

       జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వాకాడ నాగేశ్వర రావు మాట్లాడుతూ  రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నందుకు రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. గన్నీ సంచులు సరఫరా కాని చోట ప్లాస్టిక్ సంచులు కొనుగోలు చేసే రైతులకు వాటి ఖరీదును  చెల్లించాలని  కోరారు. ధాన్యం డబ్బులన్నీ రైతులకు పండగ ముందే అందితే సంతోషంగా పండగ జరుపుకుంటారని కోరారు. రైతు నుండి మిల్లు కు ధాన్యం చేరే వరకు అధికారుల పర్యవేక్షణ ఉండాలని అన్నారు.

సేంద్రియ వ్యవసాయం  పై అవగాహన పెంచాలి: జిల్లా కలెక్టర్ సూర్య కుమారి

       జిల్లా కలెక్టర్ సూర్య కుమారి మాట్లాడుతూ  సేంద్రియ వ్యవసాయానికి భవిష్యతు లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని,  మండలాల్లో దీని పై ఎక్కువగా ప్రచారం, అవగాహన పెంచాలని కలెక్టర్ సూచించారు.  సేంద్రియ వ్యవసాయం వలన ఖర్చు తగ్గుతుందని, దిగుబడి ఎక్కువ వస్తుందని, మద్దతు ధర కూడా బాగా వస్తుందని  తెలిపారు. ఇప్పటికే  జిల్లాలో 900 గ్రామాలను సేంద్రియ వ్యవసాయం కోసం ఎంపిక చేయడం జరిగిందని, ఊరంతా ఈ వ్యవసాయాన్ని చేసేలా చైతన్యం చేయాలనీ అన్నారు.  సేంద్రియ ఉత్పతులు అనే బోర్డు తో రోడ్ పక్కన అమ్మకాలు చేసే వారి సర్టిఫికేట్లను తనిఖీ చేయాలనీ అన్నారు.

నూర్చే  సమయానికి గన్నీలు అందజేస్తాం:  సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్  

 ధాన్యం  నూర్చడానికి ముందే రైతుకు గన్నీ సంచులు అందజేయాలని  శాసన మండలి సభ్యులు డా.సురేష్ బాబు, ఇందుకూరి రఘు రాజు,  పలువురు సభ్యులు సూచించగా సంయుక్త కలెక్టర్ కిశోర్ స్పందిస్తూ  జిల్లాలో నున్న 634 రైతు భరోసా కేంద్రాల్లో 6 లక్షల గన్నీ సంచులను సిద్ధం చేసామని, రైతులు నూర్చే సమయానికి వారికీ అందజేయడం జరుగుతుందని స్పష్టం చేసారు.  మిల్లర్స్  మాపింగ్ పూర్తయ్యిందని, 80  దరఖాస్తులు బ్యాంకు గ్యారంటీ ల కోసం అందాయని, సోమవారం నాటికి పరిష్కరించడం జరుగుతుందని ఎల్.డి.ఎం శ్రీనివాస రావు తెలిపారు.   ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాయని జే.సి అన్నారు.

        ఈ సమావేశం లో  వ్యవసాయ శాఖ జే.డి తారక రామా రావు,  పౌర సరఫరాల,  వ్యవసాయ సంబంధ అధికారులు పాల్గొన్నారు.

        అనంతరం వ్యవసాయ శాఖ ముద్రించిన వరి మాగాణిల్లో  అపరాలు-  రైతుల పాలిట వరాలు అనే పోస్టర్ ను  ఆవిష్కరించారు.

Raise awareness on organic farming: District Collector Surya Kumari