Road safety rules should be strictly enforced: MP Bellana Chandrasekhar, Joint inspection of high risk areas: District Collector Suryakumari
Publish Date : 29/12/2021
జిల్లాలో రెండు ట్రౌమా కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదన
తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
రోడ్డు భద్రతా నిబంధనలు కఠినంగా అమలు చేయాలి: ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్
ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో ఉమ్మడి తనిఖీ: జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
నిర్ణీత ప్రదేశాల్లోనే వాహనాలు నిలిపేలా చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్
జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో నిర్ణయాలు
విజయనగరం, డిసెంబరు 27: రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ చికిత్స అందించేందుకు జిల్లాలో రెండు ట్రౌమా కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదించాలని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో నిర్ణయించారు. జాతీయ రహదారిపై పూసపాటిరేగ ప్రాంతంలో, మరొకటి రామభద్రపురం, బొబ్బిలి ప్రాంతంలో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని సమావేశంలో తీర్మానించారు.
పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ అధ్యక్షతన జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశం సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి, రవాణాశాఖ ఉప కమిషనర్ శ్రీదేవి, సబ్ కలెక్టర్ భావ్నా, రవాణా, పోలీసు, రోడ్లు భవనాలు, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో జిల్లాలో ఈ క్యాలెండర్ సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, భవిష్యత్తులో జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించి పలు ప్రతిపాదనలు చేశారు. నగరానికి సమీపంలో వున్న సుంకరిపేట, పార్వతీపురంలోని మరో ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నందున ఆయా ప్రాంతాల్లో వెంటనే అధికారుల బృందాలు ఉమ్మడి తనిఖీలు నిర్వహించి తగిన నివేదికలు రూపొందించేలా నిర్ణయించారు. రహదారి భద్రత కమిటీ సమావేశంలో నిర్ణయించిన మేరకు పనులు చేపట్టేందుకు తగిన బడ్జెట్ను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరేందుకు కూడా తీర్మానించారు.
పార్లమెంటు సభ్యుడు అధ్యక్షులుగా జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీని ఏర్పాటుచేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక జి.ఓ.ను జారీచేసిన నేపథ్యంలో తొలిసారిగా ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎం.పి. మాట్లాడుతూ రహదారి భద్రత నిబంధనలు కఠినంగా అమలు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గించగలమని ఈ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ఆటోలను లైసెన్సు లేకుండా నడపడం, ద్విచక్ర వాహనాలను యువత నిబంధనలకు విరుద్ధంగా నడపడం వంటి వాటిపై పోలీసు, రవాణా అధికారులు దృష్టి సారించాలన్నారు. కార్లలో తప్పనిసరిగా సీటు బెల్టు ధరించేలా చర్యలు చేపట్టడం, ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో యువత అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది ఎంతో ఆందోళనకరమని పేర్కొంటూ యువతలో ముందు అవగాహన కల్పించాలని, వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. ప్రమాదాలకు తరచు కారణమవుతున్న ప్రదేశాలను గుర్తించారని, ఆయా ప్రదేశాల్లో లోపాలను సరిచేసేందుకు శాఖల వారీగా చేపట్టాల్సిన పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం రోడ్డు భద్రత కోసం చేపట్టే చర్యలకు ప్రజల నుంచి కూడా పూర్తి సహకారం వుండేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి మాట్లాడుతూ రోడ్లపై నిర్ణీత ప్రదేశాల్లోనే బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు నిలుపుదల చేసేలా నిబంధనలు రూపొందించి వాటిని ఖచ్చితంగా అమలు చేయాల్సి వుందని చెప్పారు.ముఖ్యమైన రహదారులు, రద్దీగా వుండే ప్రాంతాల్లో రోడ్లపై ఉన్న ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ సాఫీగా జరిగేందుకు రెవిన్యూ, పోలీసు విభాగాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆటోల్లో పెద్ద శబ్దంతో స్పీకర్లు ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా రోడ్లపై సూచికలు తెలియజేసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలు కొంతమేరకు తగ్గించవచ్చన్నారు. రవాణా శాఖ అధికారులు డ్రైవింగ్ లైసెన్సులు మంజూరుచేసే స్కూళ్లను తనిఖీలు చేస్తూ పూర్తిస్థాయి శిక్షణ పొందిన వారికే లైసెన్సులు మంజూరయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఉప రవాణా కమిషనర్ శ్రీదేవి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, వాటి నివారణకు యంత్రాంగం చేపట్టిన చర్యలపై ప్రజంటేషన్ ఇచ్చారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాలు కొంత తగ్గాయన్నారు. గత ఏడాది ప్రమాదాల్లో 274 మంది మరణించగా, ఈ ఏడాది 271 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. జిల్లాలో పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ పోలీసు స్టేషన్ల పరిధిలోనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు నమోదైన కేసుల ద్వారా తెలుస్తోందన్నారు. జిల్లాలో జాతీయ రహదారులపైనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలే అధికంగా ప్రమాదాలకు గురవుతున్నట్టు పేర్కొన్నారు. 25 నుంచి 35 ఏళ్ల వయస్సు వారే ఈ రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా వున్నారని చెప్పారు. సాయంత్రం 3 నుంచి 6 గంటల మధ్య కాలంలోనే అధికంగా ప్రమాదాలు సంభవించినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా గత కొద్దిరోజులుగా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు.
జిల్లాలో పలు రోడ్లు ప్రమాదకారకంగా వున్నాయని వాటిని తక్షణం మరమ్మత్తు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చన్నారు. సాలూరులో జీగిరాం వద్ద, రామభద్రపురంలో రొంపివలస, ఆరికతోటల సమీపంలో, పార్వతీపురం – వీరఘట్టాం రోడ్డులో ఉల్లిభద్ర వద్ద, బొబ్బిలికి సమీపంలోని లచ్చయ్యపేట వద్ద, పార్వతీపురం – కొమరాడ రోడ్డులో శివిని వద్ద రోడ్లను వెంటనే మరమ్మత్తులు చేయాల్సి వుందని రవాణా ఉప కమిషనర్ శ్రీదేవి పేర్కొన్నారు. పార్వతీపురం – రాయగడ రోడ్డును రూ.5 కోట్లతో మంజూరు చేశారని, జనవరిలో పనులు మొదలు పెడతారని రోడ్లు భవనాల శాఖ ఎస్.ఇ. విజయశ్రీ పేర్కొన్నారు.
స్వచ్చంద సంస్థల ప్రతినిధులు మజ్జి అప్పారావు తదితరులు రోడ్డు భద్రతకు సంబంధించి పలు సూచనలు చేశారు. స్వచ్చంద సంస్థల తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు.
సమావేశంలో సబ్ కలెక్టర్ భావ్నా, పోలీసు శాఖ అదనపు ఎస్.పి. సత్యనారాయణ, ట్రాఫిక్ డి.ఎస్.పి. మోహనరావు, ప్రాంతీయ రవాణా అధికారి రాంకుమార్, రవాణాశాఖ అధికారులు గంగాధర్, దుర్గాప్రసాద్, ఆర్టీసీ డి.ఎం. బాపిరాజు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజల్లో రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించేందుకు రవాణాశాఖ రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆవిష్కరించారు.
