* Soldiers’ Sacrifices Immortal * * Collector Suryakumari at the Armed Forces Flag Day Celebration
Publish Date : 07/12/2021
*సైనికుల త్యాగాలు అజరామరం*
*సాయుధ దళాల పతాక దినోత్సవ సభలో కలెక్టర్ సూర్యకుమారి
*యుద్ధవీరులకు సత్కారం చేయటం నా అదృష్టం అని వ్యాఖ్య
విజయనగరం, డిసెంబర్ 07 ః దేశ రక్షణలో నిమగ్నమై ఎన్నో త్యాగాలను చేస్తున్న సైనికుల జీవితాలు, వారందిస్తున్న సేవలు అజరామరమని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి కీర్తించారు. యుద్ధవీరులకు నా చేతుల మీదుగా సత్కారం జరగటం నిజంగా నా అదృష్టమని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీనిలో భాగంగా ముందుగా ఎన్.సి.సి. క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు కలెక్టర్‌కు పతాక నిధి ఫ్లాగ్‌ను అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సైనికులు త్యాగమూర్తులని, వారి సేవలు అమోఘమని కొనియాడారు. సొంత ఊరికి.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి ప్రాణాలు పణంగా పెట్టి మనందరి ప్రాణాలను కాపాడతారని పేర్కొన్నారు. మాతృభూమి రుణం తీర్చుకొనే అవకాశం కేవలం సైనికులకు మాత్రమే ఉంటుందన్నారు. దేశరక్షణలో వారు చూపించే ధైర్య సాహసాలు, కటోర దీక్ష, శ్రమ ప్రశంసనీయమన్నారు. సైనికుల సంక్షేమమే లక్ష్యంగా సేవలందిస్తున్న సాయుధ దళాల పతాక నిధికి ఎవరికి తోచిన సాయం వారు అందించాలని కలెక్టర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అనంతరం 1971 ఇండో – పాక్ యుద్ధంలో పాల్గొని వీరోచితంగా పోరాడిన యుద్ధవీరులను కలెక్టర్ దుస్సాలువాలతో సత్కరించారు. గ్యాలెంటరీ అవార్డు గ్రహీత ఎ. సన్యాసినాయుడుని సత్కరించి సైనిక సంక్షేమ శాఖ తరఫున రూ. 10 వేలు అందజేశారు. అనంతరం ఉత్తమ సేవలందించిన మాజీ సైనికులు వై. శామ్యూల్, ఎల్. నాయక్, ఎం. సత్యం, టి. నారాయణ, బి. అప్పన్న, ఎ. రాజులను కలెక్టర్ సూర్యకుమారి, సైనిక సంక్షేమ శాఖ అధికారి కృష్ణారావులు దుస్సాలువాలతో సత్కరించారు.
కార్యక్రమంలో డీఆర్వో ఎం. గణపతిరావు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు, సైనిక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు మరడ అప్పారావు, విశ్రాంత లెఫ్టినెంట్ కల్నల్ ఎన్.ఎల్.ఎన్. మూర్తి, క్యాప్టన్ సత్యవేణి, వరలక్ష్మి, మదన్, కృష్ణవేణి, కల్యాణ్ అశోక్, కోటేశ్వరరావు, జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయ సిబ్బంది, ఎన్.సి.సి. క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు.
