Close

State Education Minister Botsa Satyanarayana unveiled the statue of Alluri Sitaramaraj, a veteran and freedom fighter.

Publish Date : 09/05/2022

*అల్లూరి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన మంత్రి బొత్స‌*
*అల్లూరి సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో దాస‌న్న‌పేట కూడ‌లిలో ఏర్పాటు
*భాగ‌స్వామ్య‌మైన ఎమ్మెల్సీలు, స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు
విజ‌య‌న‌గ‌రం, మే 07 ః మ‌న్యంవీరుడు, స్వాతంత్య్ర పోరాట స‌మ‌రయోధుడు అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆవిష్క‌రించారు. ఆయ‌న వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని స్థానిక దాస‌న్నపేట రైతు బ‌జార్ కూడలిలో క్ష‌త్రియ సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన విగ్ర‌హాన్ని మంత్రి బొత్స‌, స్థానిక ఎమ్మెల్యే వీర‌భ‌ద్ర స్వామి, ఎమ్మెల్సీ ర‌ఘురాజు, క్ష‌త్రియ సేవా స‌మితి స‌భ్యుల‌తో క‌లిసి శ‌నివారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. విగ్ర‌హ ఏర్పాటుకు అల్లూరి సీతారామరాజు సేవా స‌మితి స‌భ్యులు రూ.10 ల‌క్ష‌లు వెచ్చించ‌గా చుట్టూ ర‌క్ష‌ణ క‌వ‌చం, ఫౌంటేన్ ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీ రూ.15 ల‌క్ష‌లు కేటాయించ‌టం ద్వారా ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టింది. విగ్ర‌హావిష్క‌ర‌ణ అనంత‌రం మంత్రి బొత్స‌, ఇత‌ర నేత‌లు, అధికారులు అల్లూరి విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ ఎంతోమంది స్వాతంత్ర్య సమర యోధుల్లో స్ఫూర్తి నింపిందని పేర్కొన్నారు. ఆయన త్యాగం మరువలేనిదని ఆయన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి అన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు సేవలను, త్యాగాలను కొనియాడారు.
కార్య‌క్ర‌మంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, పాకలపాటి రఘువర్మ, ఇందుకూరి ర‌ఘురాజు, స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, అల్లూరి సీతారామరాజు సేవా స‌మితి స‌భ్యులు కేఏసీ రాజు, ఎస్‌.ఎస్‌.ఎస్‌.ఎస్‌. రాజు, స్థానిక కార్పొరేట‌ర్లు, మున్సిపాలిటీ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.
State Education Minister Botsa Satyanarayana unveiled the statue of Alluri Sitaramaraj, a veteran and freedom fighter.