The e-Crop verification process should be completed at the earliest *Collector directed officials of Revenue, Agriculture Department
Publish Date : 04/10/2022
ఈ-క్రాప్ ధృవీకరణ ప్రక్రియను త్వరితగతిన ముగించాలి
*రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించిన కలెక్టర్
విజయనగరం, అక్టోబర్ 04 ః ఈ-క్రాప్ లో నమోదైన వివరాల ధృవీకరణకు సంబంధించిన సాంకేతిక ప్రక్రియను సజావుగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయా గ్రామాల వీఆర్వోలు, గ్రామీణ వ్యవసాయ సహాకులు సంబంధిత వివరాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించి ధృవీకరించాలని సూచించారు. ఈ-అథెంటికేషన్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు తహశీల్దార్లు, వ్యవసాయ అధికారులు పర్యవేక్షణ బాధ్యతలు తీసుకోవాలని చెప్పారు. ఈ-క్రాప్ ధృవీకరణ ప్రక్రియను పరిశీలించే నిమిత్తం జిల్లా వ్యవసాయ అధికారితో ఆమె మంగళవారం గంట్యాడ మండలంలో పర్యటించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం పంట రైతులు చేతికి వచ్చేసరికి అన్ని రకాల సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేసుకొని సన్నద్దంగా ఉండాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాయుతంగా ఉండాలని చెప్పారు. ఈ క్రమంలో ఈ-క్రాప్ ధృవీకరణ ప్రక్రియ తక్కువగా నమోదైన ఆయా మండలాల అధికారులతో కలెక్టర్ స్వయంగా ఫోన్లో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ-కేవైసీ చేసుకుంటేనే మద్ధతు ధర
ఈ-క్రాప్ లో నమోదైన వివరాల ధృవీకరణ అనంతరం సంబంధిత రైతుల నుంచి ఈ-కేవైసీ తీసుకొనేందుకు రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని వారికి రైతులు పూర్తి స్థాయిలో సహకరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ-కేవైసీ చేయించుకోని యెడల ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు ప్రభుత్వ మద్దతు ధర లభించిదని స్పష్టం చేశారు. కావున రైతులందరూ ఈ-కేవైసీ ప్రక్రియకు సహకరించాలని సంబంధిత వివరాలను పక్కాగా నమోదు చేయించుకోవాలని సూచించారు.
పర్యటనలో ఆమె వెంట జిల్లా వ్యవసాయ అధికారి వి.టి. రామారావు, గంట్యాడ తహశీల్దార్ ప్రసన్న రాఘవ, ఇతర అధికారులు ఉన్నారు.