Close

The focus should be on the provision of drinking water to employed persons and the cultivation of horticultural crops.

Publish Date : 10/02/2022

ఉపాధి వేత‌న‌దారుల‌కు త్రాగునీటి స‌దుపాయం
ఉద్యాన పంట‌ల సాగుపై దృష్టిసారించాలి
మెంటాడ మండ‌లంలో క‌లెక్ట‌ర్ ప‌ర్య‌ట‌న‌
గ్రామ స‌చివాల‌యం, ఉపాధిప‌నుల‌ త‌నిఖీ

మెంటాడ (విజ‌య‌న‌గ‌రం), ఫిబ్ర‌వ‌రి 09 ః   ఉపాధి వేత‌న‌దారుల‌కు, వారు ప‌నులు నిర్వ‌హించేచోట త్రాగునీరు, షేడ్ త‌దిత‌ర మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఆమె మెంటాడ మండలంలో బుధ‌వారం ఆక‌స్మికంగా ప‌ర్య‌టించారు. ఉపాధి హామీ ప‌నుల‌ను, స‌చివాల‌యాన్ని త‌నిఖీ చేశారు. పంట‌ల ప‌రిస్థితి, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు.

      క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ముందుగా జక్కువ గ్రామ ప‌రిధిలోని క‌ర్రికిత్త‌య్య‌వాని చెరువు (బాప‌న చెరువు) వ‌ద్ద, సుమారు రూ.10ల‌క్ష‌ల అంచ‌నా వ్య‌యంతో జ‌రుగుతున్న ఉపాధిహామీ ప‌నుల‌ను  ప‌రిశీలించారు. ప‌నుల‌కు హాజ‌రైన వేత‌న‌దారుల సంఖ్య‌, వారికి క‌ల్పించిన స‌దుపాయాల‌పై ఆరా తీశారు. వేత‌న‌దారుల‌కు త్రాగునీటిని అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం వారికి త్రాగునీరు, నీడ కోసం టెంట్‌, ప్ర‌ధ‌మ‌చికిత్స స‌దుపాయాన్ని సిద్దంగా ఉంచాల‌ని స్ప‌ష్టం చేశారు. మ‌హాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని వినియోగించుకొని, ప్ర‌తీ గ్రామంలో చెరువుల‌ను బాగుచేసుకోవాల‌ని సూచించారు. రైతుల‌తో మాట్లాడి, పంట‌ల ప‌రిస్థితిని తెలుసుకున్నారు. వ‌రికి బ‌దులుగా ఉద్యాన పంట‌ల‌ను సాగు చేయాల‌ని కోరారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ప‌ద్ద‌తుల‌ను అవ‌లంబించ‌డం ద్వారా, అతిత‌క్కువ ఖ‌ర్చుతో, ఆరోగ్యానికి హితంగా, అధిక‌ దిగుబ‌డుల‌ను సాధించ‌వ‌చ్చ‌ని సూచించారు.

     జ‌క్కువ గ్రామ స‌చివాల‌యాన్ని క‌లెక్ట‌ర్ త‌నిఖీ చేశారు. సిబ్బంది హాజ‌రును, రిజిష్ట‌ర్ల‌ను ప‌రిశీలించారు.  ప్ర‌జ‌ల‌నుంచి వ‌స్తున్న విన‌తుల‌పై ప్ర‌శ్నించి, స‌కాలంలో వాటిని ప‌రిష్కరిస్తుండ‌టం ప‌ట్ల సంతృప్తిని వ్య‌క్తం చేశారు. గ్రామంలో జ‌రుగుతున్న జ‌గ‌న‌న్న గృహ‌నిర్మాణం, ఓటిఎస్ ప‌థ‌కం అమ‌లు, కోవిడ్ వేక్సినేష‌న్‌, బ‌డికి వెళ్లే విద్యార్థుల శాతం, డ్రాపౌట్స్‌, ఆరోగ్య త‌నిఖీలు, పోష‌కాహార లోపం, వ్యాధినిరోద‌క టీకా కార్య‌క్ర‌మం, సిటిజ‌న్ అవుట్‌రీచ్ స‌ర్వే, ధాన్యం సేక‌ర‌ణ‌, ఫోర్టిఫైడ్ రైస్ వినియోగం త‌దిత‌ర అంశాల‌పై ఆరా తీశారు. ఏ ఒక్క‌రినీ విడిచిపెట్ట‌కుండా, శ‌త‌శాతం వేక్సినేష‌న్ పూర్తి చేయాల‌ని ఆదేశించారు. స‌చివాల‌య సిబ్బంది ప‌నితీరుపై గ్రామ‌స్తుల‌ను వాక‌బు చేశారు. ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని మెరుగుప‌ర్చ‌డానికే ప్ర‌భుత్వం ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తోంద‌ని చెప్పారు. అందువ‌ల్ల ప్ర‌తీఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని వినియోగించాల‌ని, ఆ విధంగా ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌ర‌చాల‌ని సిబ్బందిని, వ‌లంటీర్ల‌ను ఆదేశించారు. ఈ బియ్యాన్ని వాడ‌టం ద్వారా రక్త‌హీన‌త‌ను నివారించ‌వ‌చ్చ‌ని చెప్పారు. గ్రామం గుండా నిర్మితం కానున్న‌ విశాఖ‌-రాయ‌పూర్ జాతీయ  ర‌హ‌దారి వ‌ల్ల త‌లెత్త‌బోయే ఇబ్బందుల‌ను గ్రామ‌స్తులు క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకురాగా, వాటిని ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు.
ఈ ప‌ర్య‌ట‌న‌లో తాశీల్దార్ దూసి ర‌వి, ఎంపిడిఓ భానుమూర్తి, ఎపిఓ ఆర్‌.హ‌ర‌నాధ‌రావు, ఏఓ మ‌ల్లిఖార్జున‌రావు, మండ‌ల వ్య‌వ‌సాయ స‌ల‌హాక‌మిటీ ఛైర్మ‌న్ ల‌చ్చిరెడ్డి అప్ప‌ల‌నాయుడు, స్థానిక నాయ‌కులు పాల్గొన్నారు.

The focus should be on the provision of drinking water to employed persons and the cultivation of horticultural crops.