Vaccine for immigrant families coming to Pongal, it is possible to prevent the spread of Covid with the vaccine itself, District Collector Smt. Suryakumari
పండక్కి వచ్చే వలస కుటుంబాలకు వ్యాక్సిన్
50 వేల మందికి వ్యాక్సిన్ వేయాలి
15-18 వయస్సు వారికి శతశాతం వేసే ఏర్పాట్లు చేయాలి
వ్యాక్సిన్ తోనే కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యం
అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ వేయడమే లక్ష్యం కావాలి
వ్యాక్సిన్ వేయకుండా ఏ ఒక్కరూ మిగలొద్దు
జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి
విజయనగరం, జనవరి 07 :వచ్చే సంక్రాంతి పండుగ జరుపుకొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి తమ స్వగ్రామాలకు వచ్చే వారిలో వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి వారందరికీ వ్యాక్సిన్ వేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి ఆదేశించారు. 15-18 వయస్సు గల విద్యార్ధుల్లో ఎవరైనా ప్రస్తుతం వాక్సిన్ వేయించుకోనట్లయితే వారు ఎక్కడ వుంటున్నారో గుర్తించి వారు నివాసం వున్న చోటకు వెళ్లి వాక్సిన్ వేయాలని, వారికి శతశాతం వ్యాక్సిన్ వేయాలన్నారు. వచ్చే రెండు రోజుల్లో ఈ వయస్సుల వారికి శతశాతం వాక్సినేషన్ పూర్తికావాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ ద్వారానే కోవిడ్ వ్యాప్తిని నిరోధించగలమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి శతశాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా పనిచేయాలన్నారు.
జిల్లాలోని వైద్యాధికారులు, ఎంపిడిఓలు, ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి శుక్రవారం కోవిడ్ వ్యాక్సినేషన్పై కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియం నుంచి టెలికాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా ప్రాధమిక ఆరోగ్యకేంద్రం వారీగా వ్యాక్సిన్ వేయించుకొనేందుకు అర్హత గలవారి సంఖ్య, వారిలో వ్యాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య తదితర అంశాలపై సమీక్షించారు.
జిల్లాలో 15 సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవలసిందేనని కలెక్టర్ స్పష్టంచేశారు. ఇళ్లకు వెళ్లి అడిగినపుడు వ్యాక్సిన్ వేసుకున్నామని చెబితే సంతృప్తి చెంది వెళ్లిపోవద్దని, వారు వ్యాక్సిన్ వేసుకున్నదీ లేనిదీ కోవిన్ లో తనిఖీచేసి వారు వేయించుకున్నారని నిర్ధారించుకోవాలని చెప్పారు. 15-18 వయస్సుల వారికి ప్రస్తుతం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో ఆడపిల్లలు అధికంగా వేసుకోనట్టు గుర్తించామని వారికి వ్యాక్సిన్ వేయడంపై దృష్టి సారించాలన్నారు.
మునిసిపాలిటీలు, పట్టణాల్లో వివిధ దుకాణాలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే యువతను గుర్తించి వారికి వ్యాక్సిన్ వేయడంపై మునిసిపల్ అధికారులు బాధ్యత వహించాలన్నారు.
ఈ టెలికాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) డా.ఆర్.మహేష్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, ఇన్ చార్జి డి.ఎం.హెచ్.ఓ. డా.రామ్మోహన్, ప్రోగ్రాం అధికారులు డా.గోపాలకృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.నారాయణ, మెడికల్ ఆఫీసర్ డా.ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.