* Volunteers … true public servants * Their services at the field level are commendable Collector Suryakumari
Publish Date : 07/04/2022
*వాలంటీర్లు… నిజమైన ప్రజా సేవకులు*
*సత్కార సభలో జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కితాబు
*క్షేత్రస్థాయిలో వారి సేవలు ప్రశంసనీయం ః కలెక్టర్ సూర్యకుమారి
*అయోధ్య మైదానంలో అట్టహాసంగా అవార్డుల ప్రదానోత్సవం
*హాజరైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి అధికారులు
విజయనగరం, ఏప్రిల్ 07 ః రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, సంక్షేమ ఫలాలను పేదలకు చేర్చటంలో కీలకపాత్ర పోషిస్తున్న వాలంటీర్లు నిజమైన ప్రజా సేవలకులని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అభివర్ణించారు. పొద్దుపొద్దున్నే గడపగడపకూ వెళ్లి తలపు తట్టి అవ్వాతాతలకు ఠంచనుగా పింఛను అందిస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారని కితాబిచ్చారు. అవినీతి రహిత పాలనలో భాగస్వామ్యమై మేమున్నామంటూ నిజమైన అర్హులకు అండగా నిలుస్తూ ఉత్తమ సేవలందిస్తున్నారని ప్రశంసించారు. జిల్లాలోని ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను సత్కరించేందుకు అయోధ్యా మైదానంలో స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఆధ్వర్యంలో గురువారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నాడు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రజల కష్టాలను తెలుసుకున్నారని, ఇప్పుడు సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల కష్టాలను తీర్చుతున్నారని పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా క్షేత్ర స్థాయిలోని ప్రజలకు సేవలు ఎంతో చేరువయ్యాయని అన్నారు. అలాంటి అద్భుతమైన వ్యవస్థలో భాగస్వామ్యం చేసి వాలంటీర్లందరకూ ముఖ్యమంత్రి సేవాభాగ్యం కల్పించారన్నారు. కావున ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ నిజమైన అర్హులను గుర్తించి మరిన్ని ప్రశంసనీయమైన సేవలందించాలని వాలంటీర్లకు సూచించారు.
కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే వీరభద్ర స్వామి, కలెక్టర్ ఎ. సూర్యకుమారి, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రావణి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తదితర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విశిష్ట అతిథిగా పాల్గొన్న కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ శక్తివంచన లేకుండా అందిస్తున్న వాలంటీర్ల సేవలు ప్రశంసనీయమన్నారు. గ్రామసేవ… మాతృసేవతో సమానమని అలాంటి అదృష్టం వాలంటీర్లకు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు వారి పనితీరును గమనిస్తుంటానని.. కొంతమంది శక్తివంచన లేకుండా కృషి చేస్తారని.. కొంతమంది ఏవేవో కారణాలు చెబుతారని గుర్తు చేశారు. బాగా పని చేసేవారిని ఆదర్శంగా తీసుకొని మిగిలిన వారు కూడా ఉత్తమ పనితీరు కనబరచాలని సూచించారు. వచ్చే ఏడాది మేం కూడా పురస్కారాలు అందుకోవాలనే తపనతో అందరూ పని చేయాలని హితవు పలికారు.
స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, ఎస్. కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, బొబ్బిలి, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు శంబంగి చినవెంకట అప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల కష్టాలను తెలుసుకున్న ప్రభుత్వం కాబట్టే ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటున్న వాలంటీర్లను ఇలాంటి సమున్నతమైన స్థానం కల్పిస్తూ గౌరవిస్తుందని పేర్కొన్నారు. ఇది చాలా సంతోషదాయకమైన కార్యక్రమమని, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలోని వాలంటీర్ల మరింత కష్టపడి ప్రజలకు మరిన్ని సేవలందించాలని సూచించారు.
అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలందించిన 9,659 మంది గ్రామ, వార్డు వాలంటీర్లను సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులకు ఎంపిక చేయగా గురువారం జరిగిన వేడుకలో సేవా వజ్ర, సేవా రత్నకు ఎంపికైన 195 మందికి జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ సూర్యకుమారి, ఎమ్మెల్యేలు వీరభద్ర స్వామి, కడుబండి, బడ్డుకొండ, శంబంగి, రాజన్నదొర, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులు ప్రదానోత్సవం జరిగింది. సేవామిత్ర అవార్డులకు ఎంపికైన మిగిలిన వారికి నియోజకవర్గ స్థాయిల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయటం ద్వారా పురస్కారాలు అందజేయనున్నారు.
కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, శాసన మండలి సభ్యులు సురేశ్ బాబు, రఘురాజు, విజయనగరం, బొబ్బిలి, ఎస్. కోట, నెల్లిమర్ల, సాలూరు, రాజాం శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి, శంబంగి చినవెంకట అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, బడ్డుకొండ అప్పలనాయుడు, పీడిక రాజన్నదొర, కంబాల జోగులు, కొప్పుల వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ నెక్కల నాయుడు బాబు, డీసీసీబీ ఛైర్మన్ చిన రామునాయుడు, డీసీఎంఎస్ ఛైర్పర్శన్ అవనాపు భావన, అవనాపు విక్రమ్, నెడ్ క్యాప్ ఛైర్మన్ సూర్యనారాయణరాజు, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్ ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధిక సంఖ్యలో వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
*సమున్నత గౌరవం లభించింది*
ః ఎన్. లీలారాణి, ఆర్. శశిభూషణ్, వాలంటీర్లు, ఎస్.ఎస్.ఆర్. పేట సచివాలయం, గుర్ల మండలం.
నిజంగా మేం పడిన కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ఈ రోజు ఈ వేదిక ద్వారా మాకు సమున్నత గౌరవం లభించింది. చాలా సంతోషం అనిపించింది. ప్రధానం పింఛన్ల పంపిణీలో, ఫీవర్ సర్వేలో ఉత్తమ సేవలందించినందుకు గాను మాకీ గౌరవం దక్కిందని భావిస్తున్నాం.
*చాలా ఆనందంగా ఉంది*
ః పి. గౌరినాయుడు, వాలంటీర్, లక్ష్మీపురం సచివాలయం, రేగడి ఆముదాలవలస మండలం.
మేం చేస్తున్న పనికి ఎక్కువ జీతమేమీ రాకపోయినప్పటికీ ప్రజలకు సేవలందించటంలో ఏదో తెలియని సంతృప్తి కలుగుతుంది. మా పరిధిలో మాకు సాధ్యమైన పని మేం చేశాం. మాకు అప్పగించిన బాధ్యతలను తు.చ. తప్పకుండా నిర్వర్తించాం. ఈ రోజు ఇక్కడ అవార్డు ఈ వేదిక నుంచి పెద్దల చేతుల మీదుగా అవార్డు తీసుకోవటం చాలా ఆనందంగా ఉంది.
