With full understanding… everyone should give priority to healthy society and health care, said Deputy Speaker, ZP Chairman, Collector, Poshan Abhiyan 2K Rally from Complex to Collectorate
Publish Date : 01/10/2022
సంపూర్ణ అవగాహనతోనే… ఆరోగ్యకర సమాజం
ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలి
సూచన చేసిన డిప్యూటీ స్పీకర్, జడ్పీ ఛైర్మన్, కలెక్టర్
కాంప్లెక్సు నుంచి కలెక్టరేట్ వరకు సాగిన పోషణ్ అభియాన్ 2కె ర్యాలీ
విజయనగరం, సెప్టెంబర్ 30 ః ఆరోగ్య సూత్రాలపై, ఆహార నియమావళిపై సంపూర్ణ అవగాహనతోనే ఆరోగ్యకర సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని.. ఆ దిశగా ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలని, తగిన జాగ్రత్త వహించాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పోషణ్ అభియాన్ మహా కార్యక్రమంలో భాగంగా మాసోత్సవాల ముగింపును పురస్కరించుకొని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పోషణ్ 2కె ర్యాలీలో డిప్యూటీ స్పీకర్, జడ్పీ ఛైర్మన్, కలెక్టర్ పాల్గొని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున అంగన్ వాడీ కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థిణులు పాల్గొని నినాదాలు చేశారు. కాంప్లెక్సు వద్ద మొదలైన ర్యాలీ స్థానిక కలెక్టరేట్ వరకు ఉత్సాహంగా సాగింది.
రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి ర్యాలీని ఉద్దేశించి ప్రారంభోపాన్యాసం చేశారు. మహిళల, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. దానిలో ప్రత్యేక మెనూ అమలు చేస్తూ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో అందుబాటులో ఉంచడటం ద్వారా మహిళలకు, చిన్నారులకు క్రమం తప్పకుండా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోందని గుర్తు చేశారు. పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతో ముందస్తు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అవగాహనతోనే సంపూర్ణ ఆరోగ్య సిద్ధిస్తుందని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలని, ఎలాంటి సమయాల్లో తీసుకోవాలి అనే ప్రాథమిక అంశాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్లో నిర్వహించిన మాసోత్సవాలు క్షేత్రస్థాయిలో అందరిలో అవగాహన కల్పించాయనే ఆశిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారుల, సిబ్బంది మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చి సంబంధిత పథకాలను వారికి అందేలా బాధ్యత తీసుకోవాలని సూచించారు.
అపోహలు వీడి అందరూ పోర్టిఫైడ్ రైస్‌ను వినియోగించాలని తద్వారా రక్త హీనత సమస్యను అధిగమించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి హితవు పలికారు. పట్టణ, గ్రామీణ ప్రాంతంలో ఉండే మహిళలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలను చేపడుతోందని పేర్కొన్నారు. అంగన్ వాడీల ద్వారా గర్భిణులకు, చిన్నారులకు పాలు, గుడ్లు, ఇతర నాణ్యమైన ఆహార పదార్థాలను అందిస్తోందని గుర్తు చేశారు. గర్భిణుల సౌకర్యార్థం అంగన్ వాడీ కేంద్రాల్లోనే వండిన ఆహారాన్ని అందిస్తున్నామని దీన్ని అందరూ వచ్చి తప్పకుండా తీసుకోవాలని ఈ సందర్బంగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పోషణ్ అభియాన్ మాసోత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సహాయ సహకారాలు అందించటం హర్షణీయమన్నారు. ఈ అవగాహన ర్యాలీని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు బాధ్యత తీసుకోవాలని, ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బాలల హక్కుల రాష్ట్ర పరిరక్షణ సమితి ఛైర్మన్ కేసలి అప్పారావు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ బి. శాంతకుమారి, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, మహిళా శిశు సంక్షేమ కమిషన్ల ప్రతినిధులు, అంగన్‌వాడీ సూపర్ వైజర్లు, సీడీపీవోలు, కార్యకర్తలు, ఆశాలు, ఏఎన్ఎంలు, అధిక సంఖ్యలో విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.