Women should grow as entrepreneurs and reach the level of employment for ten, District Collector A. Suryakumari
Publish Date : 08/10/2021
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరుకోవాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, సెప్టెంబరు 24 ః మహిళలు చిన్నచిన్న వ్యాపారాలకే పరిమితం కాకుండా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, తామే పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి కోరారు. మహిళలల్లో ప్రేరణ కల్పించేందుకు గానూ, వివిధ ప్రాంతాల్లో మహిళలు నిర్వహిస్తున్న పరిశ్రమలకు తీసుకువెళ్లి చూపించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లా సమాఖ్య ప్రత్యేక కార్యవర్గ సమావేశం శుక్రవారం విటి అగ్రహారంలోని టిటిడిసిలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కలెక్టర్ సూర్యకుమారి, మహిళలకు స్ఫూర్తినిచ్చేలా ప్రసంగించారు. మహిళలు స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించి, ఆర్థికంగా బలపడేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అయితే అక్కడితో ఆగిపోకుండా, వ్యాపారవేత్తలుగా ఎదగాలని, పరిశ్రమలను స్థాపించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రస్తుత ప్రజల అవసరాలు, ట్రెండ్ కి అనుగుణంగా పరిశ్రమలను స్థాపించి, ప్రజల్లో డిమాండ్ ఉన్న వస్తువులను ఉత్పత్తి చేయాలని సూచించారు. వ్యక్తిగతంగా అభివృద్ది చెందేందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వపరంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతీఒక్కరూ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను అలవర్చుకోవాలని, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని సూచించారు.
వ్యక్తిగతంగా కాకుండా, మహిళలంతా కలిసికట్టుగా కృషి చేస్తే మెరుగైన ఫలితాలను సాధించవచ్చని కలెక్టర్ అన్నారు. మహిళా సంఘ సభ్యులంతా కలిసి స్వయం ఉపాధి లేదా చిన్నచిన్న పరిశ్రమలను స్థాపించాలని సూచించారు. జిల్లా సమాఖ్యలో, పట్టణ డ్వాకా మహిళా సంఘాలకు కూడా స్థానం కల్పించాలని అన్నారు. దీనివల్ల, గ్రామీణ మహిళలు చేసిన ఉత్పత్తులను పట్టణాల్లోని సంఘాల ద్వారా విక్రయించేందుకు, మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపర్చేందుకు అవకాశం కలుగుతుందని, తద్వారా రెండు ప్రాంతాల సంఘాలకూ ప్రయోజనం ఉంటుందని చెప్పారు. పాల ఉత్పత్తిని లాభసాటిగా మార్చేందుకు అమూల్ డైరీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, అందువల్ల డైరీల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యులంతా తప్పనిసరిగా తాము కోవిడ్ వేక్సిన్ వేయించుకోవడమే కాకుండా, తమ కుటుంబ సభ్యులు, బంధువులు కూడా వేక్సిన్ వేసుకొనేందుకు సహకరించాలని కలెక్టర్ కోరారు.
మహిళల స్వయం ఉపాధి యూనిట్లు, వారి ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్ ను కలెక్టర్ సందర్శించారు. వారితో మాట్లాడి, ఉత్పత్తుల గురించి, మార్కెటింగ్ సదుపాయాల గురించి ఆరా తీశారు. సమావేశంలో మండల సమాఖ్య అధ్యక్షులందరిచేతా మాట్లాడించారు. వారి వ్యక్తిగత, సామాజిక, సంఘపరమైన సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్, డిఆర్‌డిఏ, వైకెపి ఏపిడి కె.సావిత్రి, జిల్లా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్ వెంకటలక్ష్మి, కె.మేరీ, కోశాధికారి బి.సన్యాసమ్మ, ఉపాధ్యక్షులు పి.రేవతి, టిపిఎం ఏపిడి సత్యంనాయుడు, స్త్రీనిధి ఎజిఎం ఎ.ఉమామహేశ్వర్రావు, డిపిఎంలు, ఎపిఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.
………………………………………………………………………………………………………………………………..
జారీ ః సహాయ సంచాలకులు, జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయనగరం.