Close

Zero Accidents – Zero Deaths Should Be Targeted :: District Collector Surya Kumari * Youth Awareness on Safe Driving – MP Bellana

Publish Date : 12/04/2022

*సున్నా ప్రమాదాలు – సున్నా మరణాలే లక్ష్యం కావాలి:: జిల్లా కలెక్టర్ సూర్య కుమారి

*సురక్షిత డ్రైవింగ్ పై యువతకు అవగాహన కలిగించాలి – ఎం.పి. బెల్లాన

* జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం లో పలు నిర్ణయాలు

విజయనగరం, ఏప్రిల్ 12 : రహదారి ప్రమాదాలను పూర్తిగా తగ్గేలా చేయడమే కాక మరణాలను కూడా సున్నాకు తగ్గేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. ముఖ్యంగా హెల్మెట్లు వినియోగించక పోవడం , మద్యం సేవించి వాహనాలు నడపడం, పరిమితికి మించి లోడ్ పెరగడం, అతి వేగంగా నడపడం, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ నడపడం, రాంగ్ రూట్ లో వెళ్ళడం తదితర కారణాలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయని తెలిపారు. నిబంధనలు పాటించకపోవడం వలన అనేక కుటుంభాలు రోడ్డు న పడుతున్నాయని ఈ ప్రమాదాలను అరికట్టడానికి తగు చర్యలు తీస్కోవాలని అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎం.పి బెల్లాన చంద్ర శేఖర్ కూడా హాజరై పలు సూచనలు చేసారు.

సమావేశం లో జనవరి నుండి మార్చి నెల వరకు గత మూడు నెలలో జరిగిన ప్రమాదాలను , వాటికి గల కారణాలను విశ్లేషిస్తూ జిల్లా రవాణా కమీషనర్ శ్రీదేవి వివరించారు. అదే విధంగా వచ్చే మూడు నెలలకు ప్రమాదాలను తగ్గించడానికి అమలు చేయనున్న కార్యాచరణ ప్రణాళిక పై వివరించారు. ఈ మూడు నెలల్లో జిల్లాలో మొత్తం 224 ప్రమాదాలు సంభవించాయని, ఇందులో 67 మంది మరణించారని, మిగిలిన వారు క్షతగాత్రులైనారని వివరించారు. ముఖ్యంగా మార్చ్ నెలలో ఎక్కువగా జాతరలు, ఉత్సవాలు జరగడం తో ప్రజలు ఎక్కువగా రహదారుల పై కి రావడం వలన ఎక్కువగా ప్రమాదాలకు కారణాలయ్యయని అదనపు ఎస్.పి. తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూర్య కుమారి మాట్లాడుతూ ప్రమాదాలను తగ్గించడానికి హెల్మెట్ వాడకాన్ని తప్పని సరి చేయాలనీ సూచించారు. రహదారి పనుల వద్దా, ప్రమాదాలకు అవకాశం ఉన్న రహదారుల వద్ద తప్పకుండా సైన్ బోర్డు లను పెట్టాలని ఆర్ అండ్ బి అధికారులకు, మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. అతి వేగంగా వెళ్ళే వాహనాలు, ఆటో లలో పరిమితికి మించి ప్రయాణీకులను, విద్యార్ధులను ఎక్కించడం నేరమని, అలాంటి వారి పై కేసు లను బుక్ చేయాలనీ, వారికీ ప్రమాదాల పై అవగాహన కలిగించాలని అన్నారు. ప్రమాదాలు జరిగి బాగా దెబ్బతిన్న వాహనాలను రహదారి కూడళ్ళలో డిస్ప్లే చేయడం ద్వారా ప్రయాణీకులలో భయం కలిగి వేగానికి అడ్డుకట్ట వేయగలమని అన్నారు. రోడ్డ్ల పై బ్లాకు స్పాట్స్ ను గిర్తించి ఆర్ అండ్ బి, మున్సిపల్, నేషనల్ హై వేస్ , పంచాయతి రాజ్ అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించాలన్నారు. ట్రాఫిక్ డి.ఎస్.పి మోహన్ రావు సూచనల మేరకు ఎత్తు బ్రిడ్జి పై విశాఖ వైపు వెళ్ళే వాహనాల కోసం స్పష్టంగా తెలుగు, ఇంగ్లీష్, ఒరియా భాషల్లో రాసి సైన్ బోర్డు ను పెట్టాలని అన్నారు. కే.ఎల్.పురం, ఆర్.టి.ఓ కార్యాలయాల వైపు వెళ్ళే రహదారుల్లో లైటింగ్ తక్కువగా ఉన్నందున ప్రమాదాలకు అవకాశం ఉన్నదని డి.ఎస్.పి చెప్పగా ఆ మార్గం లో లైటింగ్ ఏర్పాటు చేయాలనీ మున్సిపల్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఆర్.టి.సి బస్సు లను ఎక్కడ బడితే అక్కడ ఆప కూడదని ఆర్.టి.సి అధికారులకు సూచించారు.

పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్ మాట్లాడుతూ డిగ్రీ కళాశాలల్లో, యూనివర్సిటీ లలో యువతకు రహదారి భద్రత పై అవగాహన కలిగించాలన్నారు. ఆటో లలో పాటలు వేయడం వలన వెనుక వచ్చే వాహనాల హార్న్ వినబడక కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని, పాటలు వేయకుండా చూడాలని అన్నారు. రోడ్లను ఆక్రమించి కూరగాయలు అమ్మకం , ఆటో స్టాండ్ లు గా చేయడాన్ని అరికట్టాలన్నారు. సురక్షిత డ్రైవింగ్ పై పోస్టర్స్ తయారు చేసి అన్ని కళాశాలల్లో డిస్ప్లే చేయాలనీ సూచించారు. ఆటో డ్రైవర్స్ కు కూడా కౌన్సిలింగ్ చేయాలన్నారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్న రహదారి పాయింట్స్ ను గుర్తించి ప్రత్యెక బోర్డు లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాకు రెండు ట్రామా కేర్ సెంటర్ లను ప్రతిపాదించామని, కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉందని, వాటిని మంజూరు చేయించాలని కలెక్టర్ ఎం.పి ను కోరగా సమావేశం లో తీర్మానం చేసి కాపీ ఇస్తే తన వంతుగా కృషి చేస్తానన్నారు.

ఈ సమావేశం లో ఆర్ అండ్ బి ఎస్.ఈ విజయ శ్రీ, డి.ఎం.హెచ్.ఓ డా. రమణ కుమారి, సూపరింటెండెంట్ డా. సీతారామ రాజు, డి.పి.ఓ సుభాషిని, ఎం.వి.ఐ , లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Zero Accidents - Zero Deaths Should Be Targeted :: District Collector Surya Kumari * Youth Awareness on Safe Driving - MP Bellana