ZP Chairman Majji Srinivasa Rao said that only if this crop is done, grain will be purchased from them.
Publish Date : 04/10/2022
ఈ క్రాప్ చేయించుకుంటేనే ధాన్యం కొనుగోలు
జెడ్‌పి ఛైర్‌పర్సన్ మజ్జి శ్రీనివాసరావు
లంఫిస్కిన్ వ్యాధి నివారణకు విస్తృతంగా టీకా కార్యక్రమం
వ్యవసాయ సలహామండలి సమావేశంలో నిర్ణయం
విజయనగరం, అక్టోబరు 01 ః పంటను ఈ క్రాప్ చేయించుకుంటేనే, వారివద్దనుంచి ధాన్యం కొనుగోలు జరుగుతుందని జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ, పశు సంవర్థకశాఖకు చెందిన పలు అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా వ్యవసాయాధికారి తారకరామారావు ముందుగా సమావేశపు అజెండాను వివరించారు. జిల్లాలో శతశాతం ఈ క్రాప్ పూర్తి అయ్యిందని, శనివారంతో ఈ ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు.
ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రతీ పంటనూ ఈ క్రాప్ చేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ క్రాప్ నమోదు జరిగితేనే, వారి దగ్గరనుంచి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. నెల రోజులముందే జిల్లాలో ఉబాలు పూర్తి అయ్యాయని, దానికి అనుగుణంగానే ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, తగిన చర్యలను చేపట్టాలని అన్నారు. లంఫిస్కిన్ వ్యాధిపై ప్రజల్లో భయాందోళనలు తొలగించి, సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు.
కలెక్టర్ ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ, ఈ క్రాప్ చేసిన పంటల వివరాలను ప్రదర్శించడమే కాకుండా, జాబితాలను గ్రామాల్లో రైతులకు చదివి వినిపించాలని, దానిని రికార్డు చేయాలని సూచించారు. అలాగే ప్రతీ పంటకూ ఈ క్రాప్ జరిగినట్లు, రైతులకు రసీదులను అందజేయాలని ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతీ రైతుకు పంట రుణం మంజూరు చేయాలని అన్నారు. మొక్కజొన్న రైతులు, డ్రైయ్యర్స్ కొనుగోలుకు బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు ప్రయత్నించాలని సూచించారు. మిల్లర్ల కారణంగా, రైతులు నష్టపోకుండా ఉండేందుకే, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం పలు మార్పులను తీసుకువచ్చిందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఎంపి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ క్రాప్ నమోదు చేసేటప్పుడు, పక్క గ్రామంలో పొలాలు ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వీరి సమస్యలను దృష్టిలో పెట్టుకొని తగిన ఆదేశాలను ఇవ్వాలని కోరారు.
జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ గేదెల వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ, మొక్కజొన్న రైతులకు డ్రైయర్స్ సరఫరా చేయాలని కోరారు. డ్రైయ్యర్స్ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని చెప్పారు. డ్రైయర్స్‌తో బాటు ఆయిల్ ఇంజన్లను కూడా రైతు సంఘాలకు అందజేయాలని సూచించారు.
లంఫిస్కిన్ వ్యాధి నివారణకు టీకా కార్యక్రమం
లంఫిస్కిన్ వ్యాధి (ముద్ద చర్మవ్యాధి) నివారణకు జిల్లాలో టీకా కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నామని, జిల్లా పశు సంవర్థక శాఖాధికారి డాక్టర్ వైవి రమణ చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారు లక్షా,20వేల పశువులకు టీకా వేయడం జరిగిందన్నారు. విశాఖ డెయిరీ ద్వారా మరో 20వేల పశువులకు టీకా వేశారని, ఇంకో లక్షా, 20వేల డోసులను తెప్పించి, జిల్లాలోని అన్ని పశువులకు టీకాలు వేస్తామని చెప్పారు. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు జిల్లాలో ఒక్క పశువు కూడా మరణించలేదని స్పష్టం చేశారు. ఎక్కువగా తెల్ల పశువుల్లోనే ఈ వ్యాధి కనిపిస్తోందన్నారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు, పశు రవాణాను, సంతలను నిషేదించడం జరిగిందని వెళ్లడించారు. ఈ వ్యాధి సోకిన పశువుల పాలను త్రాగినప్పటికీ ఎటువంటి ప్రమాదం లేదని, పాల ద్వారా వ్యాధి సోకదని ఆయన స్పష్టం చేశారు.
సమావేశంలో ఎంఎల్సీ ఇందుకూరి రఘురాజు, డిసిఎంఎస్ ఛైర్‌పర్సన్ అవనాపు భావన, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, వివిధ శాఖల అధికారులు, సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు.