Close

103rd Anniversary Celebrations of the College of Music * * Collector Suryakumari who participated as a guest

Publish Date : 02/05/2022

*ఘనంగా సంగీత కళాశాల 103వ వార్షికోత్సవ వేడుకలు*
*అతిథులుగా భాగస్వామ్యమైన  కలెక్టర్ సూర్యకుమారి, నగర డిప్యూటీ మేయర్ శ్రావణి
*అలరించిన విద్యార్థుల సంగీత, నృత్య ప్రదర్శనలు
విజయనగరం, ఏప్రిల్ 30 :- విజయనగరంలోని మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల 103వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల ఆవరణలో శనివారం సాయంత్రం వివిధ విశేష కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి హాజరై వార్షికోత్సవ వేడుకలో భాగస్వామ్యమై ఉపన్యసించారు. ఈ సందర్భంగా కళాశాల సంగీత విభాగం విద్యార్థులు నాదస్వరం, వీణ వాయిద్యం, డోలు, వయోలిన్ తదితర సంగీత ప్రదర్శనలు చేయగా.. నృత్య విభాగం విద్యార్థులు భరత నాట్యం ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు మేళ తాళాలు, వాయిద్యాల నడుమ ఆత్మీయ స్వాగతం పలికారు.
ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సూర్యకుమారి విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యాసం అందించారు. ఎంతో విశిష్టత కలిగిన ఇలాంటి కళాశాలలో చదవటం నిజంగా అదృష్టమని, ఇక్కడ నేర్పించే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకొని కళా రంగంలో ఉత్తమ స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. చక్కని నడవడిక, ప్రవర్తన, వ్యవహార శైలి వంటి ఎన్నో మంచి సుగుణాలు ఇలాంటి చదవటం వల్ల విద్యార్థి జీవితంలో భాగమైపోతాయని పేర్కొన్నారు. అన్ని విద్యల్లో సంగీత, నృత్య విద్యలు ప్రత్యేకమైనవని వాటిని మనసు పెట్టి నేర్చుకోవటం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. ఈ రోజు ఈ వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.
అనంతరం నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ నా చిన్నప్పటి నుంచి ఈ కళాశాల గురించి వింటున్నానని.. ఇక్కడ ఎన్నో విశిష్టల కలబోత ఉంటుందని పేర్కొన్నారు. వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయవంతంగా ఎంతో మంది ఉత్తమ విద్యార్థులను సమాజానికి అందిస్తున్న కళాశాల కీర్తి ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
*విద్యార్థులకు బహుమతుల ప్రదానం*
కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్, నగర డిప్యూటీ మేయర్, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.ఆర్.వి. ప్రసన్న కుమారి, పూర్వ అధ్యాపకులు, ప్రస్తుత అధ్యాపకులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
103rd Anniversary Celebrations of the College of Music * * Collector Suryakumari who participated as a guest