75th independence celebrations should be celebrated in a grand manner, national flag should be hoisted all over the district on 14th, all the people of the district should participate in it, historical buildings and places should be decorated with electricity, District Collector Smt. A. Suryakumari
Publish Date : 30/07/2022
ఘనంగా 75వ స్వాతంత్య్ర వేడుకలు జరపాలి
14న జిల్లా వ్యాప్తంగా జాతీయ పతాకం ఎగురవేయాలి
జిల్లా ప్రజలంతా ఇందులో పాల్గొనాలి
చారిత్రక భవనాలు, ప్రదేశాలను విద్యుద్దీపాలంతో అలంకరించాలి
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి
విజయనగరం, జూలై 29 : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఆజాది కా అమృత్ మహోత్సవ్ పేరుతో జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకలను, హర్ ఘర్ తిరంగా వేడుకలను ఘనంగా, భావితరాల వారిలో స్ఫూర్తి నింపేలా నిర్వహించాల్సి వుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి పేర్కొన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఆగష్టు 13 నుంచి 15 వరకు నిర్వహిస్తున్నందున 14న జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ పతాకాన్ని ఎగురవేసే కార్యక్రమంలో పాల్గొనేలా అన్ని ప్రభుత్వ శాఖలు కృషిచేయాలన్నారు. ఈ నెల 13 నుంచి జిల్లాలోని చారిత్రక భవనాలు, ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించాలన్నారు. అన్ని వ్యాపార, వాణిజ్య సముదాయాలు, సంస్థలు తమ భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించుకోవాలని సూచించారు. ప్రభుత్వంతో పాటు పారిశ్రామిక యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలను కూడా 75వ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు.
ఆగష్టు 15వ తేదీన జిల్లా స్థాయిలో స్వాతంత్య్ర వేడుకల నిర్వహణపై జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక పోలీసు పెరేడ్ మైదానంలో జరిగే వేడుకలను కనుల పండువగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలన్నారు.
సమాచార శాఖ ఆధ్వర్యంలో ప్రాచీన చారిత్రక ఫోటోలు, స్వాతంత్య్ర సమరయోధుల ఫోటోలతో ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచించారు.
అటవీ, వ్యవసాయ, పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య, మహిళాశిశు సంక్షేమ, పరిశ్రమలు, గృహనిర్మాణం, బ్యాంకింగ్, వైద్య ఆరోగ్య, విద్యాశాఖలు తమ శాఖల కార్యక్రమాలను తెలిపే విధంగా శకటాలను ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. స్టాల్స్ ఏయే శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలనే అంశంపై జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకొని తెలియజేస్తారని పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆగష్టు 1వ తేదీ నుంచి 10 రోజుల పాటు రోజుకు 100 గ్రామాల్లో మహిళా స్వయంశక్తి సంఘాలతో హర్ ఘర్ తిరంగా లో భాగంగా ర్యాలీలు నిర్వహిస్తామని ఆ సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ కళ్యాణ చక్రవర్తి చెప్పారు.
విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్ధులతో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. నగరంలోని ప్రముఖ భవనాలను, ప్రముఖ కూడళ్లను విద్యుద్దీపాలతో అలంకరిస్తామని కమిషనర్ ఆర్.శ్రీరాములు నాయుడు చెప్పారు. రెవిన్యూ డివిజనల్ అధికారి బదిలీపై వెళ్తున్న కారణంగా స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించాలని కమిషనర్‌కు కలెక్టర్ సూచించారు. ఉద్యోగులకు ప్రశంసాపత్రాల బహూకరణకు సంబంధించి ఎంపిక బాధ్యతను డి.ఆర్.ఓ. నిర్వహించాలని పేర్కొన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అదికారి ఎం.గణపతిరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
