Close

Invitation to all devotees for the welfare of Sitarams, extensive arrangements for devotees to come and see Sri Ramanavami celebrations at Rama Tirtha: District Collector A. Suryakumari,. District Collector visits Rama Tirtha and reviews arrangements with officials

Publish Date : 08/04/2022

సీతారాముల క‌ళ్యాణానికి భ‌క్తులంద‌రికీ ఆహ్వానం
రామ‌తీర్ధంలో శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌లు
ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్న శ్రీ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌
ద‌ర్శనానికి వ‌చ్చే భ‌క్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు :జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి
రామ‌తీర్ధంలో జిల్లా క‌లెక్ట‌ర్ ప‌ర్య‌ట‌న‌, అధికారుల‌తో ఏర్పాట్ల‌పై స‌మీక్ష‌

విజ‌య‌న‌గ‌రం(రామ‌తీర్ధం), ఏప్రిల్ 08 : ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన రామ‌తీర్ధంలో శ్రీ‌రామ‌న‌వమి సంద‌ర్భంగా సీతారాముల క‌ళ్యాణాన్ని ఈ ఏడాది అంగ‌రంగ వైభవంగా నిర్వ‌హించేందుకు విస్తృత‌ ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి వెల్ల‌డించారు. కోవిడ్ కార‌ణంగా గ‌త రెండేళ్లుగా సీతారాముల క‌ళ్యాణాన్ని భ‌క్తులు తిల‌కించేందుకు అవ‌కాశం లేకుండా పోయింద‌ని, అందువ‌ల్ల ఈ ఏడాది జ‌రుగుతున్న క‌ళ్యాణోత్స‌వానికి భ‌క్తులంద‌రినీ ఆహ్వానిస్తున్న‌ట్టు చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున సీతారాముల వారి క‌ళ్యాణానికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఈ మేర‌కు దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఉత్త‌ర్వులు జారీచేసిన‌ట్లు పేర్కొన్నారు. స్వామి వారి క‌ళ్యాణానికి రామ‌తీర్ధం వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్ధం ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలిపారు. భ‌క్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ద‌ర్శ‌నం చేసుకొనేందుకు అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల ద్వారా తాగునీరు, అత్య‌వ‌స‌ర వైద్య స‌హాయం వంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి శుక్ర‌వారం రామ‌తీర్ధంలో ప‌ర్య‌టించి సీతారాముల క‌ళ్యాణానికి చేస్తున్న ఏర్పాట్ల‌పై రెవిన్యూ అధికారులు, ఆల‌య అధికారుల‌తో స‌మీక్షించారు. తొలుత క‌ళ్యాణం జ‌రిగే మండ‌పంలో ఏర్పాట్ల‌ను క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు.

రెండేళ్ల త‌ర్వాత ప్ర‌జ‌లు తిల‌కించేందుకు వీలుగా సీతారాముల క‌ళ్యాణాన్ని ఆల‌యం వెలుప‌ల నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నందున భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తార‌ని అందుకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని ఇ.ఓ. డి.వి.వి. ప్ర‌సాద‌రావును ఆదేశించారు. భ‌క్తుల కోసం తాత్కాలిక మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. అత్య‌వ‌స‌ర వైద్యం అందించేందుకు 108, 104 అంబులెన్సులు సిద్ధంగా వుంచాల‌ని, వైద్య శిబిరం ఏర్పాటుచేసి ఓ.ఆర్‌.ఎస్‌. ప్యాకెట్లు త‌గిన‌న్ని అందుబాటులో వుంచాల‌ని వైద్య ఆరోగ్య‌శాఖ అధికారుల‌ను ఆదేశించారు. భ‌క్తుల‌కు త‌లంబ్రాలు, పాన‌కం అందించేదుకు రెండు కౌంట‌ర్లు ఏర్పాటు చేయాల‌న్నారు. భ‌క్తులు చెప్పులు విడిచిన చోటు నుంచి క‌ళ్యాణం జ‌రిగే ప్ర‌దేశానికి వ‌చ్చేట‌పుడు ఎండ తీవ్ర‌త‌కు ఇబ్బంది ప‌డ‌కుండా ఆ ప్రాంతాన్ని కార్పెట్ వేసి నీటితో త‌డ‌పి వుంచాల‌న్నారు. స్వామి వారి క‌ళ్యాణానికి హాజ‌ర‌య్యే ప‌ది వేల మంది భ‌క్తుల‌కు అన్న‌దానం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు ఆల‌య అధికారులు జిల్లా క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు.

భ‌క్తులు వివిధ ప్రాంతాల నుంచి సొంత వాహ‌నాల్లో వ‌చ్చే అవ‌కాశం వున్నందున ఆయా వాహ‌నాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ పోలీసుల‌ను ఆదేశించారు. పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నందున ట్రాఫిక్ ప‌ర‌మైన ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌న్నారు. క‌ళ్యాణం జ‌రిగే ప్ర‌దేశంలో, ఆల‌యం వ‌ద్ద రెండు ఫైర్ ఇంజ‌న్ల‌ను సిద్దంగా వుంచాల‌ని విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ అధికారుల‌ను ఆదేశించారు.

స్వామి వారి క‌ళ్యాణానికి వ‌చ్చే ప్ర‌ముఖుల ద‌ర్శ‌నానికి ప్రోటోకాల్ ప్ర‌కారం ఏర్పాట్లు చేయాల‌ని విజ‌య‌న‌గ‌రం, చీపురుప‌ల్లి ఆర్‌.డి.ఓ.లు భ‌వానీ శంక‌ర్‌, ఎం.అప్పారావు, నెల్లిమ‌ర్ల‌ త‌హ‌శీల్దార్ సీతారామ‌రాజుల‌ను ఆదేశించారు. ఉత్స‌వ ఏర్పాట్ల‌న్నింటినీ ప‌ర్య‌వేక్షించాల‌ని ఆర్‌.డి.ఓ. భ‌వానీశంక‌ర్‌కు సూచించారు. పారిశుద్ద్య నిర్వ‌హ‌ణ‌ను పంచాయ‌తీరాజ్ శాఖ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టేలా ఏర్పాట్లు చేయాల‌ని ఎంపిడిఓ రాజ్‌కుమార్‌ను ఆదేశించారు.

సీనియ‌ర్ శాస‌న‌స‌భ్యులు శ్రీ బొత్స స‌త్య‌నారాయ‌ణ స్వామి వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున‌ ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నార‌ని, శ్రీ‌వ‌రాహ ల‌క్ష్మీ నృసింహ‌స్వామి వారి దేవ‌స్థానం, సింహాచ‌లం వారు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌కూరుస్తార‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.

అనంత‌రం రామ‌స్వామి వారి ఆల‌యంలో స్వామి వారిని క‌లెక్ట‌ర్ ద‌ర్శించుకొన్నారు. ఆల‌య అధికారులు, అర్చ‌కులు జిల్లా క‌లెక్ట‌ర్‌కు సంప్ర‌దాయ బ‌ద్దంగా స్వాగ‌తం ప‌లికి స్వామి వారి ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

జారీ స‌హాయ సంచాల‌కులు, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ‌, విజ‌య‌న‌గ‌రం

Invitation to all devotees for the welfare of Sitarams, extensive arrangements for devotees to come and see Sri Ramanavami celebrations at Rama Tirtha: District Collector A. Suryakumari,. District Collector visits Rama Tirtha and reviews arrangements with officials