The re-dedication ceremony of Sri Kodandaramaswamy Temple was held on Monday at Bodikonda (Neelachalam) in Rama Tirtha.
Publish Date : 26/04/2022
ఘనంగా కోదండరామాలయ పునఃప్రతిష్టా మహోత్సవం
తరలివచ్చిన నేతలు, ఉన్నతాధికారులు
ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం ః
ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తాం ః మంత్రి బొత్స
నెల్లిమర్ల (విజయనగరం), ఏప్రెల్ 25 : శ్రీ కోదండరామస్వామి ఆలయ పునఃప్రతిష్టా మహోత్సవం రామతీర్ధంలోని బోడికొండ (నీలాచలం)పై సోమవారం అత్యంత ఘనంగా జరిగింది. ఆగమ శాస్త్ర పండితుల పర్యవేక్షణలో, సంప్రదాయబద్దంగా జరిగిన ఈ ఉత్సవంలో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొని, హనుమస్సమేత శ్రీ సీతారామలక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించారు.
వేదపండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం, ఉదయం 7 గంటల 37 నిమిషాలకు విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉదయం రుష్యక్సేన ఆరాధనతో ప్రతిష్టా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనుంతరం శాస్త్రబద్దంగా పుణ్యావహచనం, అగ్ని ప్రజ్వళన, రత్నాన్యాసం, యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్ట, ద్వజస్థంబ ప్రతిష్ట, కలశ శిఖర ప్రతిష్ట, ఏకశాల పూర్ణాహుతి, తదితర కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేశారు. రామతీర్ధం శ్రీ సీతారామస్వామి ఆలయ ప్రధానార్చకులు ఖండవల్లి సాయిరామాచార్యుల పర్యవేక్షణలో, తిరుమల తిరుపతి దేవస్థానం, ద్వారకా తిరుమల దేవస్థానం ఆగమ పండితుల నేతృత్వంలో, శుక్రవారం నుంచే వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీకారం చుట్టిన ఆలయ పునఃప్రతిష్టా మహోత్సవాలు, సోమవారం నిర్వహించిన శాంతి కల్యాణంతో ముగిశాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంఎల్‌సిలు డాక్టర్ సురేష్‌బాబు, ఇందుకూరి రఘురాజు, ఎంఎల్ఏలు బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, శంబంగి వెంకట చినప్పలనాయుడు, ఎంపిపి అంబళ్ల సుధారాణి, ఆర్‌డిఓ అప్పారావు, దేవాదాయశాఖ డిప్యుటీ కమిషనర్ వి.శ్రీనివాసరెడ్డి, దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ఈఓ బ్రమరాంభ, జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ జె.వినోద్ కుమార్, రామతీర్ధం ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డివివి ప్రసాదరావు, తాశీల్దార్ రమణరాజు, ఎంపిడిఓ రాజ్‌కుమార్, టూరిజం డైరెక్టర్ రేగాన శ్రీనివాసరావు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం ః
ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
శ్రీ కోదండరామస్వామి ఆలయ పునః ప్రతిష్ట అనంతరం, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు, కొండ దిగువనున్న శ్రీ సీతారామస్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, అతి తక్కువ కాలంలోనే ఆలయాన్ని పునర్‌నిర్మించి, విగ్రహాలను పునఃప్రతిష్ట చేయడం, ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం రాష్ట్రంలో వివిధ చోట్ల ఆలయాలను ద్వంసం చేసి, ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నించారని, అటువంటి వారికి ఆ దేవుడే తగిన శాస్తి చేస్తాడని అన్నారు. దేవుడిపై ఎంతో విశ్వాసం ఉన్న ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి, చిత్తశుద్దితో కృషి చేసి, సుమారు రూ.3కోట్ల వ్యయంతో ఆలయాన్ని కొద్ది కాలంలోనే పునర్‌నిర్మించారని చెప్పారు. బోడికొండపై విగ్రహాలను ద్వంసం చేసిన దుశ్చర్యకు సంబంధించి, కేసు దర్యాప్తు జరుగుతోందని, దోషులను పట్టుకొని తీరతామని మంత్రి చెప్పారు.
రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించేందుకు ప్రతిపాదనలు
విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ
రామతీర్ధంలో శ్రీరామ నవమి వేడుకలను రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించే ప్రతిపాదన ముఖ్యమంత్రి వద్ద పరిశీలనలో ఉందని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఉత్తరాంధ్రలో రామతీర్ధం శ్రీ సీతారామస్వామి ఆలయ ఎంతో ప్రసిద్ది అని, భద్రచలంలో శ్రీరామ నవమి రోజు జరిగినట్టే, ఇక్కడ కూడా అదే సంప్రదాయంలో వేడుకలు జరుగుతాయని అన్నారు. ఆగమ పండితులు, చిన జీయర్ స్వామివారు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం, సంప్రదాయబద్దంగా, శాస్త్రోక్తంగా ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమం జరిగిందని చెప్పారు. శ్రీ సీతారాముల దయతో ఈ ప్రాంతం శుభిక్షంగా ఉండాలని బొత్స ఆకాంక్షించారు.
దేవాదాయశాఖ ఇంజనీర్లకు సన్మానం
కేవలం 110 రోజుల్లోనే కొండపై ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసిన దేవాదాయశాఖకు చెందిన పలువురు ఇంజనీర్లను మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ చేతులమీదుగా, దేవాదాయశాఖ కమిషనర్ ఎం.హరి జవహర్‌లాల్ సన్మానించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దుర్గేష్‌కుమార్, డిఇఇలు కెవిసి కృష్ణ, ఎఇ భానుచంద్, సైదా, ఎఇ భానుచంద్ సన్మానాన్ని అందుకున్నారు.
