Union Health Minister Dr. Main Sukh Mandvi visited stalls and photo exhibitions on the development programs of the two districts.
Publish Date : 27/04/2022
రెండు జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలపై స్టాళ్లు, ఫోటో ప్రదర్శనలు
తిలకించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డా.మన్ సుఖ్ మాండవీయ
విజయనగరం, ఏప్రిల్ 26 :పలు సామాజిక, ఆర్ధిక అభివృద్ధి సూచికల ఆధారంగా దేశంలోని 112 ఆకాంక్షల జిల్లాల్లో ఒకటిగా పూర్వపు ఉమ్మడి విజయనగరం జిల్లాను కేంద్ర ప్రభుత్వం నీతిఆయోగ్ ద్వారా ఆకాంక్షల జిల్లాగా గుర్తించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డా.మన్ సుఖ్ మాండవీయ పర్యటన సందర్భంగా ఉమ్మడి జిల్లాలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలపై ప్రదర్శనలను రెండు జిల్లా యంత్రాంగాలు కలసి ఏర్పాటు చేశాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ఫోర్టిఫైడ్ రైస్ పై పౌరసరఫరాల శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్టార్టప్ విలేజ్, సీడాప్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, చేనేత జౌళి శాఖ, వై.ఎస్.ఆర్. జగనన్న సమగ్ర భూహక్కు భూరక్ష కార్యక్రమంపై సర్వే భూరికార్డుల శాఖ, పోషక విలువలతో కూడిన ఆహార పదార్ధాలపై మహిళా శిశు అభివృద్ధి శాఖ, మత్స్యశాఖ, ఆయుష్మాన్ భవ కార్యక్రమంపై వైద్య ఆరోగ్యశాఖ, ఉద్యానశాఖ స్టాళ్లు ఏర్పాటుచేసి తమ శాఖల ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను తెలియజేసేలా ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి. కేంద్ర మంత్రికి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి ఆయా ప్రదర్శనల గురించి, ఆయా శాఖల ద్వారా జరుగుతున్న కార్యక్రమాలపై వివరించారు.
పలు ప్రభుత్వ శాఖలు తమ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలపై ఫోటో ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశాయి.ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆయా ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, కార్యక్రమాల అమలు ఏవిధంగా జరుగుతున్నదీ వివరించే ప్రయత్నం చేశాయి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో చేపట్టిన పనులపై, ఏపి వైద్య మౌళిక సదుపాయాల సంస్థ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, పార్వతీపురంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల నిర్మాణం, వైద్య ఆరోగ్య రంగంలో మౌళిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో చేపట్టిన పనులపై ప్రదర్శన నిర్వహించింది. జాతీయ రహదారుల సంస్థ, జాతీయ రైల్వే నిర్మాణ సంస్థ కూడా తమ ద్వారా రెండు జిల్లాల్లో చేపట్టిన పనులపై ఫోటోల ప్రదర్శన ఏర్పాటు చేశారు. గ్రామీణ నీటిసరఫరా విభాగం విభాగం జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన గ్రామీణ నీటిసరఫరా పథకాలపై, పి.ఎం.జి.ఎస్.వై. కింద రోడ్ల నిర్మాణంపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఏనుగుల గుంపు సంచారం కట్టడికి చేపట్టిన చర్యలపై అటవీశాఖ, పోషన్ అభియాన్‌పై మహిళా శిశు సంక్షేమశాఖ, పడనా లిఖనా కార్యక్రమంపై వయోజన విద్యాశాఖ ఫోటో ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై విద్యాశాఖ, గృహనిర్మాణంపై హౌసింగ్ శాఖ ఫోటో ప్రదర్శనలు నిర్వహించాయి. జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, సంబంధిత శాఖల అధికారులు తమ శాఖల ద్వారా జరుగుతున్న ప్రగతిని కేంద్ర మంత్రికి వివరించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజనాభివృద్ధి కార్యక్రమాలపై పార్వతీపురం, సీతంపేట ఐ.టి.డి.ఏ.ల ఆధ్వర్యంలో ఫోటో ప్రదర్శనలు నిర్వహించారు. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏకలవ్య పాఠశాలల నిర్మాణం, గిరిసీమలకు రోడ్ల నిర్మాణం వంటి అంశాలపై ఫోటో ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి. ఈ జిల్లా పనులపై జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్, పార్వతీపురం, సీతంపేట పి.ఓ.లు ఆర్.కూర్మనాథ్, నవ్యలు కేంద్ర మంత్రికి వివరించారు.
లబ్దిదారులకు పత్రాలు పంపిణీ
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గరీబ్ కళ్యాణ్ యోజన పథకంలో ఇద్దరు నిరుద్యోగ యువతకు మ్యాక్స్ షాపింగ్ మాల్ లో ఉద్యోగాలు కల్పిస్తూ కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు.
ప్రధానమంత్రి వీవర్స్ ముద్ర పథకంలో ఇరవై మంది నేత కార్మికులకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డిసిసిబి) ద్వారా రూ.10 లక్షల ఆర్ధిక సహాయం అందించేలా ఒక చెక్కును కూడా కేంద్ర మంత్రి అందజేశారు. ఒక్కో నేత కార్మికునికి రూ.50 వేలు వంతున ఆర్ధిక సహాయం అందిస్తున్నట్టు చేనేత జౌళి శాఖ ఏ.డి. పెద్దిరాజు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, జిల్లాపరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, శంబంగి వెంకట చినప్పల నాయుడు, కంబాల జోగులు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్, బిజెపి నాయకులు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
