Full Co-operation for Establishment of Industries, Incentives with PMEGP, Stamp Loans, Subsidies through YSR Baduguvikasam, District Collector A. Suryakumari
Publish Date : 13/05/2022
పరిశ్రమల స్థాపనకు సంపూర్ణ సహకారం
పిఎంఇజిపి, ముద్ర రుణాలతో ప్రోత్సాహం
వైఎస్ఆర్ బడుగు వికాశం ద్వారా రాయితీలు
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, మే 13 ః జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, జిల్లా యంత్రాంగం తరపున సంపూర్ణ సహకారాన్ని కూడా అందజేయడం జరుగుతుందని కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని, పరిశ్రమలను స్థాపించేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని ఒక ప్రకటనలో కోరారు. సబ్సిడీపై రుణాలను ఇవ్వడంతోపాటుగా, సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అన్నివిధాలా అనుమతులను త్వరిత గతిన ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ప్రధానమంత్రి ముద్ర యోజన(పిఎంఎంవై), ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం(పిఎంఇజిపి), స్టాండ్ అప్ ఇండియా (ఎస్‌యుఐ), వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాశం తదితర పథకాల ద్వారా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రుణాలను పొందే అవకాశం ఉందన్నారు. ముద్ర రుణాలు రూ.50వేలు నుంచి రూ.10లక్షలు వరకు, పిఎంఇజిపి క్రింద గరిష్టంగా రూ.25లక్షలు వరకు తక్కువ వడ్డీపై వ్యాపార, పారిశ్రామిక అవసరాల కోసం ఎటువంటి స్థిరాస్తి హామీ లేకుండా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పిఎంఇజిపి రుణాల్లో నిబంధనలకు అనుగుణంగా, గరిష్టంగా 35శాతం వరకు సబ్సిడీ లభిస్తుందన్నారు.
స్టాండప్ ఇండియా కార్యక్రమం క్రింద వెనుకబడిన తరగతులు, మహిళా పారిశ్రామిక వేత్తలకు రూ.10లక్షలు నుంచి రూ.కోటి వరకు, ఎటువంటి స్థిరాస్తి హామీ లేకుండా, వ్యాపార, పారిశ్రామిక పెట్టుబడి కోసం రుణం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ పెట్టుబడిలో 75శాతం వరకు, తక్కువ వడ్డీతో రుణం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానంలో భాగంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాశం పథకం ద్వారా, వ్యాపారం లేదా పరిశ్రమలను స్థాపించేందుకు పూర్తి సహకారాన్ని అందించడం జరుగుతోందని తెలిపారు. దీనిలో భాగంగా పెట్టుబడిలో రాయితీ, భూమి విలువలో రాయితీ, స్టాంపు డ్యూటీ మినహాయింపు, విద్యుత్ రుసుములు తిరిగి చెల్లింపు, అమ్మకం పన్నులో రాయితీ, వడ్డీ తిరిగి చెల్లింపు మొదలైన ప్రోత్సాహకాలను ఇవ్వడం జరుగుతోందని చెప్పారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా, ఆయా బ్యాంకులను సంప్రదించి రుణాలను పొందవచ్చని సూచించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, లేదా సంస్థలు, లేదా కంపెనీలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని, జిల్లాలో పరిశ్రలను స్థాపించేందుకు పెద్దసంఖ్యలో ముందుకు రావాలని కలెక్టర్ కోరారు.
