Prime Minister Modi’s interview with beneficiaries today, Virtual Conference as part of Azadi Ka Amrit Mahotsav, District Collector Suryakumari
Publish Date : 31/05/2022
లబ్దిదారులతో నేడు ప్రధాని మోడీ ముఖాముఖి
అజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా వర్చువల్ కాన్ఫరెన్స్
జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, మే 30 :
అజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా, మంగళవారం నిర్వహించే వర్చువల్ కాన్ఫరెన్స్‌లో, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖాముఖిగా మాట్లాడనున్నట్లు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా నుండి, ప్రధాని మోదీ ఈ జాతీయ స్థాయి వర్చువల్ కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తారని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్ ద్వార కేంద్ర ప్రభుత్వ పధకాల అమలు తీరుపై, లబ్దిదారులు, ప్రజా ప్రతినిధులు, పౌర సంస్థల సభ్యులు, స్వాతంత్య్ర సమర యోధులు లేదా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నట్లు తెలిపారు. ప్రధాని నిర్వహించే ముఖాముఖి కార్యక్రమానికి రాష్ట్రం నుంచి కేవలం మూడు జిల్లాలు మాత్రమే ఎంపిక కాగా, దానిలో మన జిల్లా కూడా ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. ఉదయం 11 గంటలనుంచి 12.30 గంటలు వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ కాన్ఫరెన్స్ కు, కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన, పోషణ్ అభియాన్, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, స్వచ్చ భారత్ మిషన్, జలజీవన్ మిషన్ మరియు అమృత్, ప్రధాన మంత్రి స్వనిధి , వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఆయుష్ భారత్ పి.ఎం.జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నస్ సెంటర్, ప్రధాన మంత్రి ముద్రా యోజన తదితర పధకాలకు సంబంధించిన లబ్ది దారులతో మాట్లాడనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
*జిల్లాలో అమలు జరుగుతున్న వివిధ కేంద్రప్రభుత్వ పథకాలు ః-*
*ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి*
రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తూ, రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి క్రింద ప్రతీఏటా రైతులకు రూ.6వేలు సాయాన్ని అందజేస్తోంది. ఇది ప్రతీ సంవత్సరం మే, అక్టోబరు, జనవరి నెలల్లో మూడు విడతలుగా రూ.2వేలు చొప్పున కేంద్రప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ పథకం క్రింద జిల్లాలోని 2లక్షలా, 15వేల మంది రైతులకు, సుమారు రూ.43.04కోట్ల రూపాయలు ఈ విడతలో విడుదల కానున్నాయి. ఈ మొత్తం 2022, మే 31వ తేదీన నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానుంది.
*ప్రధానమంత్రి ఆవాస్ యోజన*
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద అర్హత ఉన్న ప్రతీ పేద కుటుంబానికి ఇళ్లు మంజూరు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం క్రింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.లక్షా, 50వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం నుంచి మరో రూ.30వేలను అదనంగా అందిస్తోంది. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు, పిఎంఏవై క్రింద జిల్లాలో మొదటి దశలో 79వేల, 68 ఇళ్లను మంజూరు చేయగా, ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం జోరుగా జరుగుతోంది.
*జలజీవన్ మిషన్*
ప్రతీ ఇంటికీ సురక్షిత త్రాగునీటిని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం జలజీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది రూపాయల వ్యయంతో త్రాగునీటి సరఫరాకు కృషి జరుగుతోంది. ఈ పథకం క్రింద జిల్లాలో రూ.155.13 కోట్లతో 817 పనులను మంజూరు చేయడం జరిగింది. దీనిలో ఇప్పటికే రూ.6.77 కోట్ల విలువైన 285 పనులు పూర్తి అయ్యాయి. మరో 473 పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. మొదటి దశలో 4,43,083 ఇళ్లకు కొళాయి కనక్షన్లు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటివరకు సుమారు 2,19,129 ఇళ్లకు కొళాయి కనక్షన్లు ఇవ్వడం పూర్తి అయ్యింది. 2023 మార్చి నాటికి మొత్తం ఇళ్లకు కొళాయి కనక్షన్లు ఇవ్వాలన్న లక్ష్యంతో పనులు వేగంగా జరుగుతున్నాయి.
*అమృత్*
పట్టణాల్లో ప్రతీ ఇంటికీ కొళాయి కనక్షన్లు ఇవ్వడానికి, త్రాగునీటి సరఫరాను మెరుగు పరచడానికి కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఫేజ్-1 క్రింద విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.5.85 కోట్లతో పనులు పూర్తిచేసి, 7,417 ఇళ్లకు త్రాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఫేజ్-2 క్రింద చంపావతి నది నుంచి విజయనగరం కార్పొరేషన్‌ను త్రాగునీటిని సరఫరా చేసేందుకు రూ.25.63 కోట్లతో పనులు ప్రతిపాదించడం జరిగింది. ఈ పనుల ద్వారా రోజుకు సుమారు 10 ఎంఎల్‌డిల నీటిని అదనంగా సరఫరా చేయాలన్న లక్ష్యాన్ని ఇటీవలే పూర్తి చేయడం జరిగింది. ఇది కాకుండా సుమారు 19.92 కోట్లతో, రోజుకు 5 ఎంఎల్‌డి సామర్ధ్యమున్న వేస్టేవాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటును నిర్మించడానికి చేపట్టిన పనులు దాదాపు 50శాతం పూర్తి అయ్యాయి.
*స్వచ్ఛభారత్ అభియాన్*
పరిశుభ్రమైన పరిశరాలను సృష్టించడం ద్వారా, ఆరోగ్యకరమైన, అహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం స్వచ్ఛభారత్ అభియాన్ లక్ష్యం. ఈ కార్యక్రమం క్రింద ప్రతీరోజూ ఉదయం గ్రీన్ అంబాసిడర్లు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. దీనికోసం ఇంటింటికి చెత్త బుట్టల పంపిణీ దాదాపు శతశాతం పూర్తి అయ్యింది. చెత్త సేకరణకు కోట్ల రూపాయల వ్యయంతో ట్రైసైకిళ్లు, ట్రాక్టర్లు తదితర వాహనాలను కొనుగోలు చేయడం జరిగింది. ఇలా సేకరించిన చెత్తను తడిచెత్త, పొడి చెత్తగా వేరుచేసి, తడి చెత్తనుంచి సేంద్రీయ ఎరువును ఉత్పత్తి చేస్తున్నారు. దీనికోసం ప్రతీ గ్రామంలో చెత్తనుండి సంపద సృష్టి కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి అయ్యింది. అవసరమైన చోట్ల సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోంది. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలను రూపొందించడానికి పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
*ప్రధానమంత్రి ముద్రా యోజన*
ప్రధానమంత్రి ముద్రా యోజన (మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ) పథకం ద్వారా ఎటువంటి ష్యూరిటీలు లేకుండానే, చిన్నచిన్న యూనిట్ల స్థాపనకు రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం. కేవలం వ్యక్తిగతంగానే కాకుండా, సూక్ష్మ పరిశ్రమలకు కూడా ముద్రా యోజన క్రింద రుణాలను అందజేస్తారు. ఈ పథకం క్రింద జిల్లాలో ప్రస్తుతం 15,411 మందికి ముద్రా పథకం క్రింద సుమారు రూ.93.17 కోట్లమేర లబ్ది చేకూరింది. గత ఆర్థిక సంవత్సరంలో 2,939 మందికి రూ.31.44కోట్ల రూపాయలను రుణంగా అందజేయడం జరిగింది. ఈ రుణాలను శిశు యోజన, కిశోర్ యోజన, తరుణ్ యోజన విభాగాలుగా ఇవ్వడం జరుగుతోంది.
*పిఎం స్వానిధి*
మున్సిపల్ ప్రాంతంలోని చిరు వర్తకులకు, వీధి వ్యాపారులకు ఇదొక వరంగా చెప్పవచ్చు. కోవిడ్ 19 కారణంగా చితికిపోయిన వీధి వర్తకుల సంక్షేమం కోసం, వారి వ్యాపారాన్ని పునః ప్రారంభించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడింది. పిఎం స్వానిధి (పిఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి ) పథకం క్రింద చిన్నచిన్న వ్యాపారాలు చేసుకొనేవారికి రూ.10వేలు రుణంగా మంజూరు చేయడం జరుగుతుంది. దీనిలో ఎటువంటి సబ్సిడీ ఉండదు. తీసుకున్న రుణాన్ని 12 వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వాయిదాలు సక్రమంగా, సకాలంలో చెల్లించినవారికి 7శాతం వడ్డీని వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా, సక్రమంగా రుణం చెల్లించినవారికి, రుణమొత్తాన్ని20వేలకు పెంచి మళ్లీ రుణం ఇవ్వడం జరుగుతుంది. పిఎం స్వానిధి పథకం క్రింద జిల్లాలోని విజయనగరం, రాజాం, నెల్లిమర్ల, బొబ్బిలి మున్సిపాల్టీల్లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3,615 మందికి, 2021-22 లో 2,254 మందికి రూ.10వేలు చొప్పున రుణం ఇవ్వడం జరిగింది. అలాగే వీరిలో రుణాన్ని సక్రమంగా తిరిగి చెల్లించిన 327 మందికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.20వేలు చొప్పున రుణాన్ని మంజూరు చేయగా, ఇప్పటివరకు 257 మందికి రుణాలను అందజేసి, ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చడం జరిగింది.
*పిఎం మాతృత్వ వందన*
స్త్రీ గర్భం దాల్చిన దగ్గరనుంచి మంచి పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడం, అవసరమైన మందులు, టీకాలు సరఫరా చేయడంతోపాటు ఆర్థిక సాయాన్ని కూడా అందజేసే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (తల్లీబిడ్డా చల్లగా). 2017 జనవరి 1న ప్రారంభించిన ఈ పథకం ద్వారా, తొలిసారిగా గర్భం దాల్చిన తల్లులకు మూడు విడతలుగా రూ.5వేలను నేరుగా వారి వ్యక్తిగత ఖాతాలో జమ చేస్తున్నారు. గర్భిణి తన పేరు రిజిష్టర్ చేసుకున్న తరువాత 150 రోజుల్లోపు రూ.1000, ఆరు నెలలలోపల తొలిసారి ఆరోగ్య పరీక్షలు చేసుకున్న తరువాత రూ.2,000, ప్రభుత్వ లేదా ప్రయివేటు ఆసుపత్రిలో ప్రసవానంతరం, బిడ్డకు వివిధ రకాల టీకాలను మూడు విడతలు వేయించిన తరువాత మిగిలిన రూ.2,000ను వారి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకం క్రింద ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 53,252 మందికి లబ్ది చేకూరింది. వీరికి ఇంతవరకు వివిధ దశల్లో రూ.23,88,00,000 జమ చేయడం జరిగింది. ఈ పథకానికి మరో 13వేల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
*పోషణ్ అభియాన్*
ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించడమే లక్ష్యంగా 2017-18లో పోషణ్ అభియాన్ పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. ఆరేళ్లలోపు పిల్లలు, కౌమార బాలికలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కుంగుబాటును నిరోదించి, ఆరోగ్యకరంగా ఎదిగేందుకు దోహదపడటం, రక్తహీనతను నివారించడం, పోషకాహార లోపాన్ని తొలగించడం, బరువు తక్కువగా ఉన్న పిల్లల్లో బరువును పెంచేందుకు చర్యలు చేపట్టడం తదితర కార్యక్రమాలను పోషణ్ అభియాన్ క్రింద చేపట్టారు. ఈ పథకం క్రింద జిల్లాలో ప్రస్తుతం 1,49,430 మందికి పోషకాహారాన్ని అందజేస్తున్నారు. వీరిలో బాలింతలు 15,619 మంది, గర్బిణులు 15,721 మంది కాగా మిగిలిన వారంతా పిల్లలు.
*ఆయుష్మాన్ భారత్*
ఆయుష్మాన్ భారత్ పథకం క్రింద వైద్యారోగ్య రంగంలో కోట్లాదిరూపాయల వ్యయంతో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతోంది. వైద్యరంగంలో ఒకవైపు భారీ ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించడం, ఆధునిక వసతులను సమకూర్చడంతో పాటుగా, అవసరమైన వైద్యులు, వైద్య నిపుణులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది నియామకాన్ని కూడా చేపట్టారు. పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, కొత్తగా జిల్లాలోని మున్సిపల్ ప్రాంతాల్లో 18 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటికోసం పది చోట్ల సొంత భవనాల నిర్మాణం ప్రస్తుతం జోరుగా జరుగుతోంది. ఈ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయడానికి 14 మంది స్పెషలిస్టు డాక్టర్ల నియామకం పూర్తయ్యింది. ఇవి కాకుండా జిల్లా వ్యాప్తంగా 413 హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ భవనాలు మంజూరుకాగా, ఇప్పటికే 64 భవనాల నిర్మాణం పూర్తికాగా, మరో 314 భవనాల నిర్మాణం జరుగుతోంది. 396 ఆరోగ్య కేంద్రాల్లో ఎంఎల్‌హెచ్‌పిలను ఏర్పాటు చేయడం జరిగింది.
*ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన*
దేశ ప్రజలు ఆకలితో అల్లాడిపోకుండా ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా, భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పథకమే ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎంజికెఏవై). కరోనా కష్టకాలంలో లాక్‌డౌన్ కారణంగా దేశం స్థంభించిపోగా, దేశవ్యాప్తంగా ఉన్న పేదలు ఆహార పదార్ధాల కోసం ఇబ్బంది పడకుండా ఉండాలన్న గొప్ప ఉద్దేశంతో, 2020 ఏప్రెల్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీనిక్రింద దేశంలోని అర్హులైన ప్రతీ పేదవారికీ, వారి ఆహారపు అలవాట్లను బట్టి నెలకు 5 కిలోల బియ్యం లేదా గోధుమలను అందించి ఆకలి తీర్చారు. దీంతో పాటుగా ఉచితంగా కిలో కందిపప్పు లేదా శనగలను అందజేశారు. ఇలా కోవిడ్ మూడు దశల్లో, పిఎంజికెఎవై పథకం క్రింద దేశవ్యాప్తంగా 81కోట్ల, 35లక్షల పేద కుటుంబాలు లబ్ది పొందగా, జిల్లాలోని 7 లక్షలకు పైగా పేద కుటుంబాలు ఉచితంగా బియ్యాన్ని అందజేశారు. వీరిలో 6,23,581 తెల్లరేషన్ కార్డుదారులు, 809 అన్నపూర్ణ కార్డుదారులు, 86,143 అంత్యోదయ అన్నయోజన కార్డుదారులు ఉన్నారు.
*ఒన్ నేషన్….ఒన్ రేషన్*
మన భారత దేశంలో, దేశ పౌరులు ఉపాధి, విద్య, ఉద్యోగాలు, ఇతరత్రా కారణాలవల్ల ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస వెళ్లి స్థిరపడటం పరిపాటిగా మారింది. ఇలా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే కుటుంబాలకు సైతం, వారు ఎక్కడ ఉన్నా ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకులను పొందేందుకు వీలుగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే *ఒన్ నేషన్…. ఒన్ రేషన్*. ఒకే రేషన్ కార్డుతో ఎక్కడైనా నిత్యావసరాలను పొందే పథకం ఇది. దీని క్రింద మన జిల్లాలో తెలంగాణా, బీహార్ రాష్ట్రాలకు చెందిన పలు కుటుంబాలు రేషన్ సరుకులను నెలనెలా తీసుకోగలుగుతున్నాయి.
*ప్రధానమంత్రి ఉజ్వల యోజన*
నిరుపేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనక్షన్ అందించడానికి ఉద్దేశించిన పథకమే ప్రధానమంత్రి ఉజ్వల యోజన. మహిళలు వంట చేయడంలో పడుతున్న కష్టాలను తొలగించడానికి 2016లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎటువంటి గ్యాస్ కనక్షన్ లేని, తెల్లరేషన్ కార్డు (రైస్ కార్డు) ఉన్న కుటుంబాలు ఉచితంగా ఈ పథకాన్ని పెందేందుకు అర్హులు. ఉజ్వల్ వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకొని, సమీపంలోని గ్యాస్ కంపెనీకి వెళ్లి పూర్తి ఉచితంగా గ్యాస్ కనక్షన్ పొందవచ్చు. దీనిలో భాగంగా గ్యాస్ సిలండర్, రెగ్యులేటర్, స్టవ్‌తోపాటు, మొదటిసారి ఉచితంగా గ్యాస్‌ను కూడా అందజేస్తారు. ఈ ఉజ్వల పథకం క్రింద జిల్లాలో సుమారు లక్షా,13వేల మందికి ఉచితంగా గ్యాస్ కనక్షన్లను అందజేశారు. ఉజ్వల పథకం క్రింద గ్యాస్ కనక్షన్ కలిగినవారికి, గ్యాస్ ధరలో రూ.200 రాయితీని తాజాగా కేంద్రప్రభుత్వం ప్రకటించడం విశేషం.
