District Collector Suryakumari directs immediate action on Road Safety Committee decisions
Publish Date : 18/06/2022
రోడ్డు భద్రత కమిటీ నిర్ణయాలపై సత్వర చర్యలుండాలి, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆదేశాలు
విజయనగరం, జూన్ 17 :
జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సంబంధిత ప్రభుత్వ శాఖలు సత్వరమే చర్యలు చేపట్టాల్సి ఉందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి ఆదేశించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై కార్యాచరణ నివేదికను ఆ తదుపరి సమావేశంలో సమర్పించాలని జిల్లా రవాణా అధికారి శ్రీదేవికి సూచించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రహదారులపై తరచుగా ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలను గుర్తించడంతో పాటు ఆయా సమస్యలను త్వరగా పరిష్కరించడం కూడా ముఖ్యమని చెప్పారు. జిల్లాలో గత ఐదు నెలల కాలంలో నమోదైన రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే ద్విచక్ర వాహనాల ద్వారానే అధిక ప్రమాదాలు జరిగాయని, ఆ తర్వాత తేలికపాటి మోటారు వాహనాల ద్వారా అధిక ప్రమాదాలు జరిగాయన్నారు. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం శుక్రవారం ఆన్ లైన్ ద్వారా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి శ్రీదేవి మాట్లాడుతూ చెన్నై – కోల్‌కత్తా జాతీయ రహదారిపై పూసపాటిరేగ – పైడి భీమవరం మధ్య వాహనదారులకు విశ్రాంతి కోసం రెస్ట్ ఏరియా ఒకటి ఏర్పాటు చేయడం అవసరమని తెలుపగా జాతీయ రహదారుల సంస్థ ఈ దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
విజయనగరం – కొత్తవలస మార్గంలో వంతెనకు అత్యవసర మరమ్మత్తులు చేపట్టాలని కలెక్టర్ రోడ్లు భవనాల శాఖ ఎస్.ఇ. విజయశ్రీకి సూచించారు. ఈ మార్గంలో మరమ్మత్తులకు వీలుగా అవసరమైతే ట్రాఫిక్‌ను మళ్లించి చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు వెనువెంటనే కమిటీ సభ్యులకు సమాచారం అందించినట్లయితే ఆయా ప్రమాదాలపై అధ్యయనం చేసి కారణాలు కనుగొనేందుకు అవకాశం ఏర్పడుతుందని జిల్లా రవాణా అధికారి పేర్కొన్నారు. పోలీసు శాఖ ద్వారా తక్షణం సమాచారం ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో జిల్లా రవాణా శాఖాధికారి శ్రీదేవి, ట్రాఫిక్ డి.ఎస్.పి. మోహనరావు, నగర మునిసిపల్ కమిషనర్ శ్రీరాములు నాయుడు, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
