Crop loans should be sanctioned, priority should be given to housing and education, setting up of ATMs in secretariats, Collector Suryakumari at a bankers’ meeting, Collector angry over negligent banks
Publish Date : 25/06/2022
పంట రుణాలు మంజూరు చేయాలి
గృహ, విద్యారుణాలకు ప్రాధాన్యత ఇవ్వండి
సచివాలయాల్లో ఎటిఎంలు ఏర్పాటు
బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ సూర్యకుమారి
నిర్లక్ష్యం చూపిన బ్యాంకులపై కలెక్టర్ ఆగ్రహం
విజయనగరం, జూన్ 24 ః అర్హత ఉన్న రైతులందరికీ పంట రుణాలను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ఇ-క్రాప్ ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. లక్ష్యాలను సాధించడంలో వెనుకబడిన బ్యాంకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారం రోజుల్లో లక్ష్యాలను సాధించకపోతే, చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. 2022 మార్చి నెలాఖరుకి బ్యాంకులు సాధించిన లక్ష్యాలపై, బ్యాంకుల వారీగా, పథకాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ఖరీఫ్ ప్రారంభం అవుతోందని, పంట రుణాలను తక్షణమే మంజూరు చేయడానికి ఇదే తగిన సమయమని అన్నారు. జిల్లాలో పాడి అభివృద్దికి బ్యాంకర్లు తమవంతు సహకారాన్ని అందించి, పాడిపశువుల కొనుగోలుకు రుణాలను మంజూరు చేయాలని కోరారు. సుమారు 60వేల పాడి పశువుల కొనుగోలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వివిధ పథకాల క్రింద స్వయం ఉపాధి యూనిట్ల మంజూరు పట్ల తీవ్ర అంతృప్తిని వ్యక్తం చేశారు. యూనిట్లను మంజూరు చేయడమే కాకుండా, అవి గ్రౌండింగ్ జరిగేటట్టు చూడాలన్నారు. జిల్లాలో 476 యువజన సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. బ్యాంకుల సహకారంతో కనీసం మండలానికి రెండు చొప్పున కూరగాయల నర్సరీలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జగనన్న గృహాల నిర్మాణానికి, విద్యా రుణాల మంజూరుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. వెరిఫికేషన్, ఇతరత్రా ఛార్జీల రూపంలో బ్యాంకులు లబ్దిదారులనుంచి అధికమొత్తంలో వసూలు చేస్తుండటం వల్ల, లబ్దిదారులు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ అన్నారు. పెండింగ్లో ఉన్న జగనన్న తోడు, పిఎం స్వానిధి ధరఖాస్తులను మూడు రోజుల్లోగా పరిశీలించి, రుణాలను మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రయివేటు బ్యాంకుల వ్యవహార శైలిపట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బ్యాంకులు మనుగడ సాగించాలంటే, రుణాలను మంజూరు చేయడం తప్పనిసరి అని, మరింత ఉదారంగా వ్యవహరించి రుణాలు మంజూరు చేయాలని సూచించారు. గ్రామ సచివాలయాల్లో ఎటిఎంలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే, అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఈ అవకాశాన్ని బ్యాంకులు వినియోగించుకోవాలని సూచించారు. ఎంఎస్ఎంఇ యూనిట్ల స్థాపనకు బ్యాంకులనుంచి తగిన సహకారం అందటం లేదని అన్నారు. జులై 10 న మరోసారి బ్యాంకర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తామని, అప్పటికల్లా ఇచ్చిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్డిఏ పిడి కల్యాణచక్రవర్తి, మెప్మా పిడి సుధాకరరావు, జెడిఏ తారకరామారావు, పిషరీస్, హార్టికల్చర్ డిప్యుటీ డైరెక్టర్లు నిర్మలాకుమారి, శ్రీనివాసరావు, సివిల్ సప్లయిస్ డిఎం మీనాకుమారి, సిపిఓ మురళి, డిపిఎం పద్మావతి, ఎల్డిఎం శ్రీనివాసరావు, నాబార్డు డిడిఎం నాగార్జున, ఆర్బిఐ ప్రతినిధి పూర్ణిమ, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
