Close

Covid vaccination should be intensified, villagers should be reached under family doctor system, district collector orders for medical officers

Publish Date : 24/08/2022

కోవిడ్ వ్యాక్సినేష‌న్ ముమ్మ‌రం చేయాలి

ఫ్యామిలీ డాక్ట‌ర్ విధానంలో  గ్రామీణుల‌కు చేరువ కావాలి

వైద్యాధికారుల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాలు

విజ‌య‌న‌గ‌రం, ఆగ‌ష్టు 12 :రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ ఆగ‌ష్టు 15 నుంచి ప్రారంభిస్తున్న ఫ్యామిలీ డాక్ట‌ర్ విధానం ద్వారా గ్రామీణుల‌కు చేరువై వారికి సేవ‌లందించే గొప్ప అవ‌కాశం వైద్యుల‌కు ల‌భించిందని, ఈ అవ‌కాశం వినియోగించుకొని వారికి సేవ‌లందించ‌డం ద్వారా గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల మెప్పుపొందేలా వైద్యాధికారులు ప్ర‌య‌త్నించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి పిలుపు నిచ్చారు. ఈ విధానంలో వైద్యులు ఉద‌యం వేళ‌ల్లో ప్రాథ‌మిక ఆరోగ్య‌కేంద్రంలో ఓ.పి.సేవ‌లు అందిస్తూ మ‌ధ్యాహ్నం వేళ‌ల్లో ఒక‌ గ్రామ స‌చివాల‌యంలో అందుబాటులో వుంటూ ఆయా గ్రామ‌స్థుల‌కు వైద్య సేవ‌లు అందించాల్సి వుంటుంద‌న్నారు. దీనికోసం ప్ర‌తి గ్రామ స‌చివాల‌యంలో ఒక గ‌దిని వైద్యుల కోసం కేటాయించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. గ్రామాల‌కు వెళ్లేట‌పుడు అంగ‌న్‌వాడీ కేంద్రాలు, పాఠ‌శాల‌లు, హాస్ట‌ళ్లు, రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌ను సంద‌ర్శించి విద్యార్ధుల‌కు ఆరోగ్య త‌నిఖీలు చేప‌ట్టాల్సి వుంటుంద‌న్నారు. వైద్యులు గ్రామ స‌చివాల‌య సంద‌ర్శ‌న‌కు సంబంధించి ఒక షెడ్యూల్ రూపొందించి విడుద‌ల చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఏ స‌చివాల‌యాన్ని ఏరోజు సంద‌ర్శించేదీ ఆయా గ్రామంలో వారంరోజుల ముందే తెలియ‌జేయాల్సి వుంటుంద‌న్నారు. జిల్లాలోని వైద్యాధికారుల‌తో క‌లెక్ట‌ర్ శుక్ర‌వారం ఆన్ లైన్ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఫ్యామిలీ డాక్ట‌ర్ విధానంపై వైద్యాధికారుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. జిల్లాలో నిర్మాణం పూర్త‌యిన వెల్ నెస్ కేంద్రాల‌ను ఆగ‌ష్టు 15వ తేదీ నాటికి అందుబాటులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని, ఇవి అందుబాటులోకి రానిచోట స‌చివాల‌యాల్లో ఒక గ‌దిని వైద్య‌సేవ‌ల కోసం ప్ర‌త్యేకంగా కేటాయించి అక్క‌డ వైద్య త‌నిఖీలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామ‌న్నారు.

జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ మ‌రింత ముమ్మ‌రం చేయాల‌ని వైద్యాధికారుల‌ను ఆదేశించారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కోవిడ్ టీకాలు వేయాల‌న్నారు. ప్ర‌తి పి.హెచ్‌.సి.లోనూ క‌నీసం 2 వేల డోసుల వ్యాక్సిన్ ఎల్ల‌ప్పుడూ అందుబాటులో వుండేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. వ్యాక్సినేష‌న్ విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకునేలా వైద్యాధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. ఈ స‌మావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ర‌మ‌ణ‌కుమారి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 30వేల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో వున్న‌ట్టు చెప్పారు.

Covid vaccination should be intensified, villagers should be reached under family doctor system, district collector orders for medical officers