Secretariat services should be fully provided, IRCTC ticket booking should start immediately, identify six ideal villages for each mandal, grounding of houses and government buildings should be done by the end of the month, review by District Collector A. Suryakumari.
Publish Date : 24/08/2022
సచివాలయాల సేవలు సంపూర్ణంగా అందాలి
ఐఆర్‌సిటిసి టిక్కెట్ల బుకింగ్ వెంటనే ప్రారంభించండి
ప్రతీ మండలానికి ఆరు ఆదర్శ గ్రామాలను గుర్తించండి
నెలాఖరునాటికి ఇళ్లు, ప్రభుత్వ భవనాల గ్రౌండింగ్ జరగాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి సమీక్ష
విజయనగరం, ఆగస్టు 20 ః సచివాలయాలనుంచి సంపూర్ణంగా సేవలను అందించడం ద్వారా, వ్యవస్థ లక్ష్యాన్ని నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కోరారు. వెంటనే ఐఆర్‌సిటిసి ద్వారా రైలు టిక్కెట్ల బుకింగ్ సేవలను ప్రజలకు అందించాలని సూచించారు. ఇది మండల స్థాయిలో ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
ఎంపిడిఓలు, గృహనిర్మాణశాఖ, పంచాయితీరాజ్, డ్వామా అధికారులతో, కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సచివాలయాల సేవలు, ఓటిఎస్, గృహనిర్మాణ ప్రగతి, వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణం తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్నిరకాల సేవలను ప్రజల చెంతనే అందించేందుకే సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అందువల్ల పూర్తిస్థాయిలో సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రతీ సచివాలయానికి ప్రభుత్వం రూ.20లక్షలను కేటాయించిందని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు అత్యధిక ప్రయోజనాన్ని చేకూర్చే పనులకు ఆ నిధులను వినియోగించాలని సూచించారు. ప్రతీ మండలంలో ఐదారు ఆదర్శ గ్రామాలను గుర్తించాలని ఆదేశించారు. ఈ గ్రామాల్లో వెంటనే సేంద్రీయ ఎరువును తయారు చేయాలని చెప్పారు. ముఖ్యంగా మండల స్థాయి అధికారుల మధ్య సమన్వయం చాలా అవసరమని స్పష్టం చేశారు. ప్రతీరోజూ మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేయాలని, ఆ పథకాన్ని మరింత మెరుగ్గా నిర్వహించే విధంగా కృషి చేయాలని సూచించారు.
కోవిడ్ వేక్సినేషన్ నెమ్మదిగా జరుగుతోందని, దీనిని వేగవంతం చేయాలని కలెక్టర్ కోరారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వెల్‌నెస్ సెంటర్లు, పాల శీతలీకరణ కేంద్రాల నిర్మాణంపై సమీక్షిస్తూ, జాప్యం జరుగుతుండటం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు నాటికి అన్ని రకాలా ప్రభుత్వ భవనాలు, గృహనిర్మాణం శతశాతం గ్రౌండింగ్ కావాలని ఆదేశించారు. కేవలం మరో మూడురోజులు మాత్రమే ముహూర్తాలు ఉన్నందున, ఈలోగా శంకుస్థాపనలు ప్రారంభించి, నెలాఖరునాటికి సజావుగా నిర్మాణ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. స్థలాలు లభ్యంకాని చోట, ఒక సచివాలయం పరిధిలో ఒకే పంచాయితీ ఉన్న పక్షంలో, పాత పంచాయితీ భవనాలను డిజిటల్ లైబ్రరీలుగా మార్చుకోవాలని సూచించారు. శిధిలమైన భవనాల స్థానంలో కొత్త భవనాలను నిర్మించుకోవచ్చునని చెప్పారు. గృహనిర్మాణ లబ్దిదారులను చైతన్యపరిచి, పనులు వేగంగా జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు ప్రగతిని నమోదు చేయాలని సూచించారు. అవసరమైన లబ్దిదారులకు రూ.35వేలు రుణం అదనంగా మంజూరు చేయాలన్నారు. ఓటిఎస్ నగదు వసూళ్లుపై సమీక్షించారు.
ఈ సమీక్షా సమావేశంలో డ్వామా పిడి జి.ఉమాపరమేశ్వరి, పిఆర్ ఎస్ఇ బిఎస్ఆర్ గుప్త, జెడ్‌పి సిఇఓ ఎం.అశోక్‌కుమార్, సిపిఓ పి.బాలాజీ, డిపిఓ ఇందిరా రమణ, జిల్లా గృహనిర్మాణ శాఖాధికారి ఎస్‌వి రమణమూర్తి, మున్సిపల్ కమిషనర్ ఆర్.శ్రీరాములనాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.
