Tanguturi of Andhrakesari * Tribute by District Collector A. Suryakumari * Tanguturi 150th Anniversary Celebrations at Collectorate
Publish Date : 24/08/2022
బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఆంధ్రకేసరి టంగుటూరి
*నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి
*కలెక్టరేట్లో టంగుటూరి 150వ జయంతి వేడుకలు
విజయనగరం, ఆగస్టు 23 ః న్యాయవాదిగా… రచయితగా.. రాజకీయ వేత్తగా సమాజానికి ఎనలేని సేవలందించిన ఘనుడు.. ధైర్యశాలి.. ప్రజ్ఞాశాలి టంగుటూరి ప్రకాశం పంతులు అని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి కొనియాడారు. ఆయన చూపిన ప్రతిభా పాటవాలు, ధైర్య సాహసాలు నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన నిర్వర్తించిన కర్తవ్యాలు.. తీసుకున్న నిర్ణయాలు మనందరికీ మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ సూర్యకుమారి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను కొనియాడారు. స్వాతంత్య్ర సంగ్రామంలో విద్యార్థి నాయకుడిగా ధీరోదాత్తమైన పాత్ర పోషించారని కొనియాడారు. సైమన్ కమిషన్ పర్యటనకు వ్యతిరేకంగా చేపట్టిన ఊరేగింపునకు నాయకత్వం వహించి ఆయన చూపిన ధైర్య సహసాలు… దానికి గాను ఆంధ్రకేసరిగా కీర్తి గడించిన విషయం మనందరికీ తెలిసినదే అని పేర్కొన్నారు. తను రచించిన పుస్తకం ది జర్నీ ఆఫ్ మై లైఫ్ (ఆత్మకథ) అతని బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఇంత కీర్తికలిగిన వ్యక్తి కాబట్టే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రకాశం పంతులు జీవిత చరిత్రను దేశం నలుమూలలా చాటి చెప్పారని గుర్తు చేశారు.
కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు పద్మావతి, సూర్యనారాయణ, చీపురుపల్లి ఆర్డీవో అప్పారావు, వ్యవసాయ శాఖ జేడీ రామారావు, వయోజన విద్యా శాఖ డీడీ సుగుణాకర్ రావు, డీఆర్డీఏ పీడీ కల్యాణ చక్రవర్తి, మత్య్సశాఖ డీడీ నిర్మలా కుమారి, సర్వే శాఖ ఏడీ త్రివిక్రమరావు, కలెక్టరేట్ ఏవో దేవ్ ప్రసాద్, ఇతర జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొని ప్రకాశం పంతులుకు ఘన నివాళులర్పించారు.
