Secretariat funds for maximum benefit works, housing construction should be accelerated, Chittigurus should focus on the program, District Collector A. Suryakumari, review of development programs through online conference
Publish Date : 07/09/2022
గరిష్ట ప్రయోజన పనులకే సచివాలయ నిధులు
గృహనిర్మాణాన్ని వేగవంతం చేయాలి
చిట్టిగురువులు కార్యక్రమంపై దృష్టి పెట్టాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
ఆన్లైన్ కాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష
విజయనగరం, ఆగస్టు 26 ఃఎక్కువ మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పనులకే, సచివాలయ నిధులను కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ప్రతీ సచివాలయానికి ప్రభుత్వం రూ.20లక్షలు కేటాయించిందని, ఆ నిధులతో, గరిష్ట లబ్ది చేకూర్చే ప్రజోపయోగ పనులను చేపట్టాలని సూచించారు. జిల్లా అధికారులు, ఆర్డిఓలు, మండల ప్రత్యేకాధికారులు, ఎంపిడిఓలు, తాశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంఎల్ఓలు ఇతర మండల స్థాయి అధికారులతో, శుక్రవారం సాయంత్రం ఆన్లైన్ కాన్ఫరెన్స్ ద్వారా, వివిధ అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గడపగడపకు కార్యక్రమంపై ఆరా తీశారు.
సచివాలయాలకు వచ్చిన నిధులను, వ్యక్తిగత పనులకు కాకుండా, సామాజిక అవసరాలకు వినియోగించాలని స్పష్టం చేశారు. ఎంపిడిఓలు వలంటీర్ల అటెండెన్స్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లా అంతటా వలంటీర్లు హాజరు 50శాతం దాటకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. హాజరుశాతం పెంచేందుకు తగిన చర్యలను చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలల పరిస్థితిపై ఆరా తీశారు. ఐఆర్సిటిసి రిజిష్ట్రేషన్లను పరిశీలించారు. తక్షణమే రైల్వే టిక్కెట్ల బుకింగ్‌ను ప్రారంభించాలన్నారు. ఓటిఎస్ నగదు వసూళ్లపై ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిరోజూ తనిఖీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో 1783 పాఠశాలలు ఉన్నాయని, జిల్లావ్యాప్తంగా ఉన్న 597 వెల్ఫేర్, ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లు ప్రతిరోజూ పాఠశాలలకు వెళ్లి, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించాలని సూచించారు. గృహనిర్మాణ ప్రగతిలో ఈ వారం విజయనగరం డివిజన్ వెనుకబడి ఉందన్నారు. నిర్మాణ సామగ్రి, నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. గృహనిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు.
జిల్లాలో గత రెండుమూడు రోజులుగా సచివాలయాలు, ఆర్‌బికెలు, వెల్నెస్ సెంటర్ల భవనాల నిర్మాణం ఎక్కువ సంఖ్యలో ప్రారంభించినందుకు అభినందించారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని సూచించారు. ఎంపిడిఓలు క్షేత్రస్థాయిలో పర్యటనలకు ముమ్మరం చేసినందుకు అభినందించారు. చిట్టిగురువులు కార్యక్రమంలో ప్రతీఒక్కరూ భాగస్వాములు కావాలని, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఇప్పటివరకు జిల్లాలో జరుగుతున్న ఈ కార్యక్రమంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. లేఅవుట్లలో 5 శాతం స్థలాన్నిప్రభుత్వానికి కేటాయించాల్సి ఉందని, ఈ స్థలంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద పేదలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని ఆదేశించారు. ప్లాస్టిక్ నిషేదాన్ని సంపూర్ణంగా అమలు చేసేందుకు మున్సిపల్ కమిషనర్లు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పాల్గొన్నారు.
