Ghanudu Gidugu, who expressed the importance of Telugu language, District Collector A. Suryakumari, who paid tributes, called for reply in Telugu only.
Publish Date : 07/09/2022
తెలుగు భాష ప్రాశస్త్యాన్ని చాటిచెప్పిన ఘనుడు గిడుగు
నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి
తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు చేద్దామని పిలుపు
విజయనగరం, ఆగస్టు 29 ః తెలుగు భాష ప్రాశస్త్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పటంలో.. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడటంలో విశేషమైన పాత్ర పోషించిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు అని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి అన్నారు. నిత్యం జీవితంలో వినియోగించే భాషను అందరికీ పరిచయం చేస్తూ సులభతర రీతిలో రచనలు సాగించిన ఘనుడు అని కీర్తించారు. తెలుగు భాషకు ఒక అందమైన భావాన్ని తీసుకొచ్చి ప్రాముఖ్యతను పెంచటంలో ఎనలేని కృషి చేశారని కొనియాడారు. తెలుగు వ్యవహారికా భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయింతిని పురస్కరించుకొని కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి కలెక్టర్, డీఆర్వో, ప్రత్యేక ఉపకలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడటంలో పోషించిన పాత్ర గురించి.. చేసిన కృషి గురించి వివరించారు. ఆయనకు స్పందించే గుణం ఎక్కువ అని అందుకే ప్రజలు వినియోగించే వాడుక పదాల ఆధారంగా ఎన్నో రచనలు చేశారని గుర్తు చేశారు. సవర భాషపై ప్రత్యేకమైన పరిశోధన చేసి దానికి ప్రత్యేక గుర్తింపును కల్పించారని చెప్పారు. రామ్మూర్తి పంతులు చేపట్టిన ఉద్యమం వల్ల కొందరికే పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చిందని వివరించారు. ఆయన జీవితమంతా ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే సాగిందని గుర్తు చేశారు. గిడుగు రామ్మూర్తి పంతులును ఆదర్శంగా తీసుకొని ఈ రోజు నుంచి మనందరం సాధ్యమైనంత మేరకు తెలుగు భాషలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుదామని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శన
గిడుగు రామ్మూర్తి పంతులును అభినయిస్తూ సంగీత కళాశాల విద్యార్థులు చేసిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. తెలుగు భాషకు గిడుగు చేసిన కృషిని తెలుపుతూ ప్రదర్శన సాగింది. చిన్నారులను కలెక్టర్ సూర్యకుమారి ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్వో గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు సూర్యనారాయణ రాజు, సుదర్శన దొర, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి రమేశ్, జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
