A comprehensive training plan should be formulated for skill development, workshop conducted on September 9, District Collector A. Suryakumari
Publish Date : 07/09/2022
నైపుణ్యాభివృద్దికి సంకల్పం
సమగ్ర శిక్షణా ప్రణాళికను రూపొందించాలి
సెప్టెంబరు 9న వర్క్‌షాప్ నిర్వహణ
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం ఆగస్టు 29 : నైపుణ్య శిక్షణా కార్యక్రమాల ద్వారా యువతకు ఉపాధి లేదా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు జిల్లా స్థాయిలో సమగ్ర నైపుణ్య శిక్షణా ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. వినూత్న ఆలోచనతో, విభిన్నమైన శిక్షణలు ఇవ్వాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. జిల్లా నైపుణ్యాభివృద్ది కమిటీ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం జరిగింది. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న స్కిల్ ఎక్విజేషన్ అండ్ నాలెడ్జి అవేర్నెస్ ఫర్ లైవ్లిహుడ్ ప్రమోషన్ (సంకల్ప్) కార్యక్రమం క్రింద వివిధ అంశాల్లో యువతకు ఏర్పాటు చేయనున్న నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. సంకల్ప్ కార్యక్రమాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, చిన్నచిన్న పరిశ్రమలను, వివిధ రకాల యూనిట్లను, లేదా సేవా సంస్థలను స్థాపించుకొని ఉపాధి పొందేందుకు, ఉత్సాహవంతులను గుర్తించి వారికి సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా మెరుగైన శిక్షణ అందించాలని సూచించారు. సృజనాత్మకంగా ఆలోచించాలని, ప్రజల వాస్తవ అవసరాలను గుర్తించి, దానికి అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలను రూపొందించాలని అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మద్య సమన్వయంతో, పరస్పర సహకారంతో ఈ కార్యక్రమాలను రూపొందించినప్పుడే, అవి విజయవంతం అవుతాయని స్పష్టం చేశారు. ఈ శిక్షణా కార్యక్రమాల నిర్వహణలో డిఆర్‌డిఏ, మెప్మా, పరిశ్రమల శాఖలది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ప్రస్తుతం వేర్వేరు శాఖలు, వేర్వేరు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని, వాటన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని చెప్పారు. దీనికోసం సెప్టెంబరు 9న వర్కషాప్ నిర్వహించాలని, దీనిలో ప్రభుత్వ శాఖలు, సంస్థలతోపాటు ఎన్‌జీఓలను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. మండల లేదా జిల్లా స్థాయి ప్రణాళికలతో ఈ వర్క్‌షాపుకు హాజరు కావాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ కమిటీ కన్వీనర్, డిఆర్‌డిఏ పిడి ఎ.కల్యాణ చక్రవర్తి, వివిధ శాఖల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
