Collector angry over mid-day meal quality, Satiwada Zilla Parishad school emergency inspection, Collector inspects CHC, PHC
Publish Date : 07/09/2022
మధ్యాహ్న భోజనం నాణ్యత పై కలెక్టర్ ఆగ్రహం
సతివాడ జిల్లా పరిషత్ పాఠశాల ఆకశ్మిక తనిఖీ
సి హెచ్ సి, పి హెచ్ సి లను తనిఖీ చేసిన కలెక్టర్
విజయనగరం, సెప్టెంబరు 02 : మధ్యాహ్న భోజనం నాణ్యంగా లేదని, పిల్లల సంఖ్య కు తగ్గట్టుగా వంట చేయలేదని సతివాడ జిల్లా పరిషత్ పాఠశాల యాజమాన్యం పై జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆగ్రహం వ్యక్తం చేసారు. వంట గదిలో వండి ఉన్న ఆహారాన్ని తనిఖీ చేసారు. విద్యార్ధుల సంఖ్య కన్నా గుడ్లు తక్కువగా ఉండడం గమనించి వెల్ఫేర్ అసిస్టెంట్ ను పిలిపించి ఎందుకు తనిఖీలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇదే పరిస్థితి ఉంటె చర్యలు తప్పవని హెచ్చరించారు. నెల్లిమర్ల మండలం లో నెల్లిమర్ల ఉన్నత ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, సతివాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర, జిల్లా పరిషత్ పాఠశాలలను శుక్రవారం కలెక్టర్ ఆకష్మిక తనిఖీ చేసారు. జిల్లా పరిషత్ పాఠశాల లో 10 వ తరగతి పిల్లలతో ముఖా ముఖి మాట్లాడారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియం విద్యార్ధుల తో టెక్స్ట్ పుస్తకాలలోని పాఠాలను చదివించారు. సోషల్ స్టడీస్ తో కూడా మంచి భవిస్యత్తు ఉంటుందని, బాగా చదువుకోవాలని పిల్లలకు హితవు చెప్పారు. అనంతరం కొంత మంది పిల్లలతో రహస్యంగా మాట్లాడి మధ్యాహ్న భోజనం ఎలా ఉంది అని ఆరా తీసారు. చిక్కీ గుడ్డు పెడుతున్నారా అని అడిగారు. బాగోలేదని కొందరు పిల్లలు చెప్పగా హెచ్ ఎం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. స్టోర్ కి వెళ్లి స్టాక్ ను తనిఖీ చేసారు. ఆర్.ఓ ప్లాంట్ మరమ్మతులో ఉన్నందున వెంటనే రిపేర్ చేయించాలని ఇంచార్జ్ హెచ్ ఎం కు సూచించారు.
సతివాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని, నెల్లిమర్ల ఉన్నత ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసారు. హాజరు పట్టీ ని పరిశీలించారు. ఓ.పి లో ఉన్న రోగులతో మాట్లాడారు. మందులు సక్రమంగా అందుతున్నాయా అని ప్రశ్నించారు. ఇండెంట్ రిజిస్టర్ ను, డ్రగ్ స్టోర్ ను తనిఖీ చేసారు. రోగులకు అందుతున్న ప్రాధమిక వసతుల పై ఆరా తీసారు. రోజుకు ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని, ఎంత మందికి కుటుంభ నియంత్రణ ఆపరేషన్ లు జరుగుతున్నాయని అడిగారు. కుటుంభ నియంత్రణ పై అవగాహన కల్పించాలని ఎ.ఎన్ .ఎం లకు సూచించారు. కోవిడ్ వాక్సినేషన్ శత శాతం జరగాలన్నారు. నెల్లిమర్ల లో ప్రసవానంతరం బెడ్ పై నున్న మహిళా తో మాట్లాడి ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి, వైద్యుల సేవలు ఎలా ఉన్నాయి అని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ కేసు లు ఎన్ని వస్తున్నాయి, ఎన్నెన్ని రెఫెర్ చేస్తున్నారు అని ఆరోగ్య మిత్ర ను అడిగారు. ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట నెల్లిమర్ల తహసిల్దార్ రమణ రాజు, ఎం.పి.డి.ఓ గిరిబాల, మున్సిపల్ కమీషనర్ బాలాజీ, వైద్యాధికారులు, డా.హరి కిషన్, పుల్మనాలజిస్ట్ తదితరులు ఉన్నారు.
