Strict action will be taken if gender determination is done, District Collector A. Suryakumari
Publish Date : 07/09/2022
లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, సెప్టెంబరు 02 ః గర్భస్థ లింగ నిర్దారణ నేరమని, దీనికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అధికారులను జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. లింగ నిర్ధారణ చేయాలని అడగడం కూడా చట్టవ్యతిరేకమేనని స్పష్టం చేశారు. పిసి పిఎన్‌డిటి చట్టం-1994, మరియు ఎఆర్‌టి, సరోగసీ చట్టం అమలుపై తన ఛాంబర్‌లో శుక్రవారం సంబంధిత కమిటీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
జిల్లాలో జరుగుతున్న గర్భస్థ లింగనిర్దారణ పరీక్షలు, స్కానింగ్ సెంటర్ల పనితీరుపై కలెక్టర్ ఆరా తీశారు. స్కానింగ్ సెంటర్లపై నిరంతరం నిఘా ఉంచాలని, రికార్డులను తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ కారణాలవల్ల ఇటీవల కాలంలో సరోగసీ విధానం కూడా వ్యాప్తి చెందుతోందని, దీనిపైనా నిఘా ఉంచాలని సూచించారు. గర్భస్థ లింగ నిర్ధారణ జరగకుండా తగిన చర్యలు తీసుకుంటూనే, మరోవైపు తల్లితండ్రుల్లో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. దీనికోసం డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు సైతం అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని, పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, స్కానింగ్ సెంటర్లు ఇచ్చే రిపోర్టులు, బిల్లులపై *లింగ నిర్ధారణ చట్టప్రకారం నేరం* అని ముద్రించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, జిల్లా టిబి నియంత్రణాధికారి డాక్టర్ రాణీ సంయుక్త, విజయనగరం ఆర్‌డిఓ సూర్యకళ, ట్రైనీ డిప్యుటీ కలెక్టర్ శ్రీకర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివిఎన్ జయలక్ష్మి, దిశ సిఐ శేషు, ఐసిడిఎస్ లైజనింగ్ ఆఫీసర్ విద్య, నేచర్ ఎన్‌జిఓ నుంచి దుర్గ, రాష్ట్రస్థాయి సలహా కమిటీ సభ్యులు చదలవాడ ప్రసాద్, కళాజగతి ప్రాజెక్టు ఛైర్మన్ ఎం.సుభద్రాదేవి తదితరులు పాల్గొన్నారు.
