100% e-crop should be done, e-crop registration in the name of the cultivators, government buildings should be completed soon, Joint Collector Mayur Ashok
Publish Date : 12/09/2022
శతశాతం ఇ-క్రాప్ జరగాలి
సాగుదారుల పేరుమీదే ఇ-క్రాప్ నమోదు
ప్రభుత్వ భవనాలను త్వరగా పూర్తి చేయాలి
జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్
విజయనగరం, సెప్టెంబరు 07 ః ఇ-క్రాప్ శతశాతం పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆదేశించారు. బొబ్బిలి రెవెన్యూ డివిజన్లో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో, ఆన్లైన్ ద్వారా బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, ఇకెవైసి, ఇ-క్రాప్, రీ సర్వే, గడప గడపకు మన ప్రభుత్వం తదితర కార్యక్రమాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జెసి మయూర్ అశోక్ మాట్లాడుతూ, సాగుదారులు, కౌలుదారుల పేరుమీదే ఇ-క్రాప్ జరగాలని స్పష్టం చేశారు. వెబ్‌ల్యాండ్ లో ఉన్న వివిధ రకాల భూముల్లో వేసిన అన్ని రకాల పంటలను ఇ-క్రాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. వేసిన ప్రతీ పంటా ఇ-క్రాప్‌లో నమోదు అవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని, నిబంధనలను పాటిస్తూ, ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలని సూచించారు. జిల్లాలో సగటున 51 శాతం ఇ-క్రాప్ జరగ్గా, బొబ్బిలి డివిజన్లో మాత్రం 49 శాతం మాత్రమే జరగడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. పిఎం కిసాన్, ఇకెవైసి రిజిష్ట్రేషన్లపై ఆరా తీశారు. ఎరువులు సరఫరాపై ప్రశ్నించారు. అన్ని రైతు భరోసా కేంద్రాల్లో సరిపడిన ఎరువుల నిల్వలను ఉంచాలని ఆదేశించారు. ఎరువుల షాపులను తనిఖీ చేయాలని, ప్రతీ షాపువద్ద వివరాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు తప్పనిసరి అని స్పష్టం చేశారు.
గృహనిర్మాణంపై సమీక్షిస్తూ, లబ్దిదారులకు అవగాహన కల్పించి, ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. చివరిదశకు చేరిన ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టి, వాటిని వెంటనే పూర్తి చేయాలని సూచించారు. వివిధ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై సమీక్షించారు. వీటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీటికి సంబంధించిన పెండింగ్ బిల్లులు వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉందన్నారు. స్పందన పిటిషన్లపై ఆరా తీశారు. వచ్చిన ప్రతీ ఫిర్యాదును పట్టించుకొని, సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా, వారితో మాట్లాడాలని, పిటిషనర్ల సంతృప్త స్థాయిని పెంచాలని సూచించారు.
ఈ సమావేశంలో బొబ్బిలి ఆర్డిఓ శేషశైలజ, జిల్లా గృహనిర్మాణ శాఖాధికారి ఎస్వి రమణమూర్తి, వ్యవసాయాధికారి వి.టి.రామారావు, సిపిఓ పి.బాలాజీ, పిఆర్ ఎస్ఇ బిఎస్ఆర్ గుప్త, మున్సిపల్ కమిషనర్లు, ఆయా శాఖల ఇఇలు, డిఇలు, ఎఈలు, డివిజన్ పరిధిలోని తాశీల్దార్లు, ఎంపిడిఓలు, మండల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
