Action plan to create a pollution free city, actions with coordination of various departments, District Collector Mrs. A. Suryakumari
Publish Date : 12/09/2022
కాలుష్య రహిత నగరంగా రూపొందించేందుకు కార్యాచరణ ప్రణాళిక
వివిధ శాఖల సమన్వయంతో చర్యలు
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి
విజయనగరం, సెప్టెంబరు 07 :జిల్లా కేంద్ర నగర పాలక సంస్థను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించి అమలు చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి వెల్లడించారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం(నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం) కింద కాలుష్య రహిత నగరంగా విజయనగరాన్ని తీర్చిదిద్దేందుకు వివిధ శాఖల సమన్వయంతో కృషిచేయనున్నట్టు పేర్కొన్నారు. దీనిలో భాగంగా జిల్లా కేంద్రంలో వాయు కాలుష్యాన్ని తగ్గించి గాలి నాణ్యతను పెంపొందించేందుకు పలు చర్యలు చేపడతామన్నారు. దీనిపై చర్చించేందుకు ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం బుధవారం వర్చ్యువల్‌గా జరిగింది. జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వాయు నాణ్యతను మెరుగుపరచడంలో భాగంగా నగరపాలక సంస్థ, రవాణా, పోలీసు, కాలుష్య నియంత్రణ మండలి, వ్యవసాయ శాఖల భాగస్వామ్యంతో పలు చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై దుమ్ము, ధూళి కణాలు రేగి వాయు కలుష్యం కలగజేసే నగర రోడ్లను ట్రాఫిక్ పోలీసు విభాగం, మునిసిపల్ ఇంజనీరింగ్ శాఖలు గుర్తించాలన్నారు. అటువంటి రోడ్లను పూర్తిస్థాయి బి.టి.రోడ్లుగా మార్పుచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సూచించారు. కాలుష్య కారక వాహనాలను గుర్తించడంపై రవాణా శాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసి కార్యాచరణ సమర్పించాలన్నారు. అదే సమయంలో పర్యావరణ హితంగా వుండే గ్రీన్ వాహనాలు వినియోగించేలా ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ లేకుండా తిరుగుతున్న వాహనాలను గుర్తించి వాటిని నియంత్రించే చర్యలపై రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసు విభాగం సంయుక్తంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ క్షేత్రాల్లో పూర్తయిన పంటలకు నిప్పు పెట్టకుండా వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
సమావేశంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి బి.టి.రామారావు, జిల్లా రవాణా అధికారి ఆదినారాయణ, ట్రాఫిక్ డి.ఎస్.పి. ఎల్.మోహనరావు, పరిశ్రమల శాఖ జిల్లా అధికారి పాపారావు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు.
