The minister specially congratulated the government, state education minister Botsa Satyanarayana, the start of the free hearing test camp and the district collector for the health of the poor.
Publish Date : 26/09/2022
పేదల ఆరోగ్యానికి అండగా ప్రభుత్వం
రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ
ఉచిత వినికిడి పరీక్షల శిబిరం ప్రారంభం
జిల్లా కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి
విజయనగరం, సెప్టెంబరు 24 ః పేదలు, సామాన్య ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దీనిలో భాగంగానే ఆరోగ్య శ్రీ పథకం క్రింద సుమారు 3వేల వ్యాధులకు ఉచితంగా వైద్యాన్ని అందించడం జరుగుతోందని చెప్పారు. స్థానిక ఘోషా ఆసుపత్రిలో ఉచిత వినికిడి పరీక్షల వైద్య శిబిరాన్ని శనివారం మంత్రి బొత్స ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి చొరవతో, ఎబిసి వెల్ఫేర్ సొసైటీ, అనిల్ నీరుకొండ ఆసుపత్రి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో సుమారు 500 మందికి ఉచితంగా వినికిడి పరీక్షలను నిర్వహించారు. వారిలో అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్‌ను అభినందించారు. ఇలా శస్త్రచికిత్సను నిర్వహించి, మాట తెప్పించడం, వినికిడి సమస్యను లేకుండా చేయడం, వారికి ఒకరకంగా పునర్జన్మ లాంటిందని ప్రశంసించారు. ప్రతీ నియోజకవర్గంలో ఇలాంటి శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ముందుగా ఒక మోడల్ జిల్లాను ఎంపిక చేసి, ఆ జిల్లాలో ఇలాంటి శస్త్రచికిత్సా శిబిరాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం సుమారు రూ.30కోట్లు ఖర్చు చేసి, 500 మంది లోపాన్ని తొలగించేందుకు సంక్పలించిందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఒక చెవికి శస్త్రచికిత్స చేసేవారని, ప్రస్తుతం జగన్ మోహనరెడ్డి హాయంలో దాదాపు రూ.13లక్షలు ఖర్చుతో, రెండు చెవులకూ ఉచితంగా శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నారని చెప్పారు. ఐరన్ లోపం, మేనరిక వివాహాలు తదితర కారణాలతో ఇలాంటి లోపాలతో పిల్లలు పుడుతున్నారని, వీటిని నివారించేందుకు తల్లితండ్రుల్లో అవగాహన పెంచాల్సి ఉందని సూచించారు. ఇటువంటి లోపాలను ఐదేళ్ల లోపే గుర్తించి, చికిత్స చేయించగలిగితే, వారికి మెరుగైన ఫలితం ఉంటుందని మంత్రి అన్నారు.
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ, వినికిడి లోపం, దృష్టి లోపాలు, వికలాంగత్వం ఉన్న వారు జిల్లాలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వీటి నివారణకు ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందరి సహకారంతో, సంయుక్త కృషితోనే ఇలాంటి లోపాలన నివారించడం సాధ్యమౌతుందని ఆమె స్పష్టం చేశారు. దృష్టి లోపాలు రాకుండా గర్బిణిగా ఉన్నప్పుడే పోషకాహరం, పలు ఇతర జాగ్రత్తలను తీసుకోవడంతోపాటు, పిల్లలు పుట్టిన వెంటనే విటమిన్ ఎ చుక్కలను వేయడం జరుగుతోందని చెప్పారు. పిల్లల్లో ఎంత త్వరగా వినికిడి లోపాలను గుర్తించ గలిగితే, అంత త్వరగా వారికి చికిత్స చేయించి, లోపాలను తొలగించేందుకు వీలు పడుతుందని చెప్పారు. వైద్యారోగ్య శాఖ, స్త్రీశిశు సంక్షేమ శాఖల ద్వారా ఇలాంటి శిబిరాలను మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.
ఎంపి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, పుట్టుకతోనే మూగ, చెవుడు తదితర లోపాలతో పిల్లలు పుట్టినప్పటికీ, తగిన చికిత్సల ద్వారా ఆ లోపాలను తొలగించడం జరుగుతుందని అన్నారు. అయితే వీలైనంత త్వరగా ఇలాంటి లోపాలను తల్లితండ్రులు గుర్తించాల్సి ఉందన్నారు. వినికిడి లోపాలకు ఉచితంగా శస్త్రచికిత్సలను చేసే ప్రక్రియను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని, దానికి ఆయన తనయుడు జగన్ మోహనరెడ్డి మరింత ముందుకు తీసుకువెళ్లారని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యుటీ మేయర్ ఇసరపు రేవతీదేవి, జిల్లా వికలాంగులు, వయోవృధ్దుల సంక్షేమశాఖాధికారి జగదీష్, సమగ్ర శిక్ష ఎపిసి విఏ స్వామినాయుడు, డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు, డాక్టర్ కృష్ణ ప్రకాష్, పలువురు డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.