Inauguration of Sri Ramaraksha, State Education Minister Botsa Satyanarayana, Secretariat, RBK, Wellness Center for Secretariat System Society
Publish Date : 01/10/2022
సచివాలయ వ్యవస్థ సమాజానికి శ్రీరామరక్ష
రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ
సచివాలయం, ఆర్‌బికె, వెల్నెస్ సెంటర్ ప్రారంభం
మెరకముడిదాం (విజయనగరం), సెప్టెంబరు 30 ః రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి ఎంతో గొప్ప లక్ష్యంతో, దూరదృష్టితో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ, సమాజానికి శ్రీరామరక్ష లాంటిదని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ కొనియాడారు. మెరకముడిదాం మండలం గర్భాంలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం-2, రైతు భరోసా కేంద్రం, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం భవనాలను మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రజలముంగిటే ప్రభుత్వ సేవలను అందించేందుకు గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రజల బాగు కోసం గొప్ప ఆశయంతో, వినూత్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను చేపట్టిన ఇంతగొప్ప ముఖ్యమంత్రిని తన రాజకీయ జీవితంలో మునుపెన్నడూ చూడలేదని కొనియాడారు. ప్రజలకు ఏమి కావాలో తెలుసుకొని, అన్నిటినీ నెరవేరుస్తున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. ప్రజలంతా బాగుండాలని, వారు సంతోషంగా ఉండాలని అనునిత్యం కోరుకొనే ప్రభుత్వం తమదని ఆయన స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థ పనితీరును, సహాయకులు ద్వారా, వారు అందిస్తున్న సేవలను ప్రజలకు వివరింపజేశారు. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లంచాలకు తావులేకుండా, అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గ్రామానికి శ్రీరామరక్ష లాంటి సచివాలయ వ్యవస్థను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ క్రాప్ నమోదుపై మంత్రి బొత్స అసంతృప్తిని వ్యక్తం చేశారు. వ్యవసాయ సహాయకులు ఖచ్చితంగా, క్షేత్రస్థాయిలో పర్యటించి, పంటలను పరిశీలించిన తరువాతే, ఈ క్రాప్ నమోదు చేయాలని ఆదేశించారు. లేదంటే వ్యవసాయ సహాయకులతోపాటు, మండల ఏఓ, ఎడిలపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, అర్హులైన ప్రతీఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించడమే, సచివాలయ వ్యవస్థ లక్ష్యమని అన్నారు. అభివృద్ది, సంక్షేమ ఫలాలు ప్రతీఒక్కరికీ అందించాలన్నదే, ఈ వ్యవస్థ ఏర్పాటు వెనుక, ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ సహకారంతో, మెరకముడిదాం మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. జలజీవన్ మిషన్ ద్వారా రూ.3.87కోట్లతో ఇంటింటికీ త్రాగునీటిని అందించడంతోపాటు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా మండలానికి సాగునీటిని కూడా తేవడానికి కృషి జరుగుతోందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ, అతి తక్కువ కాలంలోనే సచివాలయ, ఆర్‌బికె, వెల్నెస్ సెంటర్ భవనాలను పూర్తి చేసినందుకు అభినందించారు. పంట పొలాలు ఒక గ్రామంలో, నివాసం వేరే ప్రాంతంలో ఉన్న రైతులు, తమ పంటను ఈ క్రాప్ చేయించుకోవడానికి, గ్రామ ప్రజాప్రతినిధులు, తోటి రైతులు సహకారం అందించాలని సూచించారు. పిల్లలందరినీ బడికి పంపించాలని, ఆడపిల్లలను కూడా డిగ్రీవరకు చదివించి, వారు తమ కాళ్లపై తాము నిలబడేలా తీర్చిదిద్దాలని కోరారు. డిసెంబరు 21న సామూహిక గృహప్రవేశాలకు ముహూర్తం నిర్ణయించడం జరిగిందని, ఆలోగా జగనన్న ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. రీసర్వే జరిగేటప్పుడు, భూ యజమానులు తప్పనిసరిగా దగ్గర ఉండాలని కోరారు.
ఎంపి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, అందరికీ సంక్షేమ ఫలాలను అందించేందుకు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. సచివాలయం, ఆర్‌బికె, వెల్నెస్ సెంటర్ నిర్మాణం కోసం, ఒక్కో గ్రామానికి ప్రభుత్వం సుమారు కోటి రూపాయలు ఖర్చు చేస్తోందంటే, ఈ వ్యవస్థ ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చని అన్నారు. అర్హతే ప్రమాణికంగా దాదాపు వందేళ్ల తరువాత ప్రభుత్వం రీసర్వే ప్రక్రియను చేప్టటిందని, దీనివల్ల చాలా వరకు భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
ఈ సమావేశంలో జెడ్పి సిఇఓ డాక్టర్ ఎం.అశోక్‌కుమార్, ఆర్డిఓ ఆర్.అప్పారావు, ఎంపిపి తాడ్డి కృష్ణవేణి, పలువురు మండల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
……………………………………………………………………………………………………..