Be careful with those who come as relatives and close friends, District Collector Ms. A. Suryakumari appeals.
Publish Date : 17/10/2022
బంధువులు, సన్నిహితులమంటూ వచ్చేవారి పట్ల అప్రమత్తంగా వుండండి
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి విజ్ఞప్తి
విజయనగరం, అక్టోబరు 14 :
జిల్లాలోనూ, ఇతర చోట్ల తన బంధువులు, సన్నిహితులమని చెప్పుకొంటూ ప్రభుత్వ అధికారులు, ఇతరుల నుండి కొందరు వ్యక్తులు వసూళ్లకు పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని అటువంటి వారి పట్ల అప్రమత్తంగా వుండాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి విజ్ఞప్తి చేశారు. ఆవిధంగా డబ్బు వసూళ్లకు పాల్పడే వారిని నమ్మవద్దని, తమకు వారి సమాచారం, వివరాలు అందజేయాలని కోరారు. కలెక్టర్ కార్యాలయంలో పనులు చేస్తామంటూ, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరు వచ్చినా వారిని నమ్మి డబ్బులు ముట్టజెప్పి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజల నుంచి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకొని చట్టప్రకారం వారిని శిక్షించడంలో అవసరమైన సమాచారం అందించడం ద్వారా సహకరించాలని కోరారు. అదేవిధంగా ఫోన్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా తన పేరు వినియోగించుకొని ఎవరైనా ధన సహాయం చేయాలని కోరినా చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. భూముల వ్యవహారాల్లోనూ తన పేరు వినియోగించుకొని లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వారిపట్ల కూడా అప్రమత్తంగా వుండాలని సూచించారు. ఇప్పటికే అటువంటి వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకొనేలోగా ఇతరులు మోసపోకుండా వుండే ఉద్దేశ్యంతో అప్రమత్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు.