A historic event in the redistricting of the district * The aspirations of the common people … the aspirations have been fulfilled * Minister of State for Municipal Affairs Botsa Satyanarayana
Publish Date : 04/04/2022
జిల్లాల పునర్విభజన ఓ చరిత్రాత్మక ఘట్టం
*సామాన్య ప్రజల ఆశలు… ఆకాంక్షలు నెరవేరాయి
*రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
*జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి వీసీలో పాల్గొన్న మంత్రి
*ప్రజలకు మరింత మంచి జరగాలనే జిల్లాల పునర్విభజన ః ముఖ్యమంత్రి
విజయనగరం, పార్వతీపురం ఏప్రిల్ 04 ః వికేంద్రీకరణే ప్రామాణికంగా.. సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఓ చరిత్రాత్మక ఘట్టం అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల ఆశలు… ఆకాంక్షలు నెరవేరాయని మంత్రి అన్నారు. వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని అనుసరించి రాష్ట్రంలో సమూల మార్పులకు ముఖ్యమంత్రి నాంది పలికారని ఉద్ధాటించారు.
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి బొత్స స్థానిక కలెక్టరేట్ వీసీ హాలు నుంచి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సామాన్య ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వ నడుచుకుంటోందని, వారి అభీష్టం మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. మన్యం ప్రజల కోరిక మేరకు ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లాగా ఆవిర్భవించిందని అన్నారు. అలాగే చీపురుపల్లి, బొబ్బిలి ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు విజయనగరం జిల్లాలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు కూడా వచ్చాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో మరింత పారదర్శకతతో కూడిన పాలన సామాన్య ప్రజలకు అందుతుందని మంత్రి అన్నారు.
*ప్రజలకు మంచి జరగాలని ః ముఖ్‌డమంత్రి
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రజలకు మంచి జరగాలని, మరింత మంచి పాలన అందాలనే ఉద్దేశంతోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు మరింత సులభంగా ప్రభుత్వ సేవలు అందుతాయని పేర్కొన్నారు. అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలను విభజించామని, పేర్లు పెట్టామని తెలిపారు. సగటున 19 లక్షల మందికి ఒక జిల్లా ఉండేలా పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని చెప్పారు. దీని వల్ల పాలనలో మరింత వేగం అవుతుందని, ప్రభుత్వ సేవలు సామాన్యులకు మరింత చేరువవుతాయన్నారు. అవినీతి లేని పూర్తి పారదర్శకతతో కూడిన వ్యవస్థను రూపొందించేందుకు రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని వివరించారు. రైతులకు, సామాన్య ప్రజలకు అన్ని వేళలా అధికార యంత్రాంగం అండగా ఉండేందుకు అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కొత్త జిల్లాల్లో అన్ని కార్యాలయాలూ ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా స్థలాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఈ క్రమంలో ఆయన వివిధ జిల్లాల కలెక్టర్లతో ఇంటరాక్ట్ అయ్యారు. సుస్థిరాభివృద్ధే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. ఎస్.డి.జి. లక్ష్యాలను చేరుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రణాళికాయుతంగా వ్యవహరించి లక్ష్యాలను చేరుకోవాలని నిర్దేశించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో విజయనగరం కలెక్టరేట్ వీసీ హాలు నుంచి మంత్రితో పాటు, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, ఎస్పీ ఎం. దీపిక, గజపతినగరం, ఎస్. కోట, రాజాం ఎమ్మెల్యేలు బొత్స అప్పల నరసయ్య, కడుబండి శ్రీనివాసరావు, కంబాల జోగులు, ఎమ్మెల్సీ సురేశ్ బాబు, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్వో ఎం. గణపతిరావు, ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
