Close

Achieve the goals of Nithiyogi, District Collector A. Suryakumari

Publish Date : 25/03/2022

నీతిఅయోగ్ ల‌క్ష్యాల‌ను సాధించాలి

జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి

విజ‌య‌న‌గ‌రం, మార్చి 16 ః నీతి అయోగ్ ల‌క్ష్యాల‌ను సాధించ‌డం ద్వారా, జిల్లా ర్యాంకుల‌ను మ‌రింత మెరుగుప‌ర్చేందుకు కృషి చేయాల‌ని, అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. నీతి అయోగ్ సూచిక‌ల‌పై త‌న ఛాంబ‌ర్‌లో బుధ‌వారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. వైద్యారోగ్య‌శాఖ‌, స్త్రీశిశు సంక్షేమం, విద్య, వ్య‌వ‌సాయం, ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ‌, మైక్రో ఇరిగేష‌న్‌, జ‌ల‌యాజ‌మాన్య సంస్థ‌, వ్య‌వ‌సాయ‌ మార్కెటింగ్‌, ఉద్యాన పంట‌లు, ముద్ర రుణాలు, నైపుణ్య శిక్ష‌ణ‌, పంచాయితీరాజ్‌, గృహ‌నిర్మాణం, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌ త‌దిత‌ర అంశాల‌వారీగా, శాఖ‌ల‌వారీగా స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, నీతి అయోగ్ అంశాల‌కు ప్రాధాన్య‌త‌నిచ్చి, వాటి ల‌క్ష్యాలను శ‌త‌శాతం సాధించేందుకు ప్ర‌ణాళికాబ‌ద్దంగా కృషి చేయాల‌న్నారు. తీసుకున్న ల‌క్ష్యాల‌ను సాధించ‌క‌పోతే, చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తీ బుధ‌వారం త‌ప్ప‌నిస‌రిగా వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు. క్షేత్ర‌స్థాయిలో ఎఎన్ఎంల ప‌నితీరు బాగులేద‌ని, శాఖాప‌ర‌మైన విధుల నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ముద్ర రుణాల మంజూరుపై స‌మీక్షిస్తూ, కొన్ని శాఖ‌లు ప‌నుల నిర్వ‌హ‌ణ‌లో ముందున్న‌ప్ప‌టికీ, ఆ ప్ర‌గ‌తిని ఎప్ప‌టిక‌ప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయ‌డంలో వెనుక‌బ‌డి ఉన్నాయ‌ని అన్నారు. పోష‌కాహారం పంపిణీలో అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్ల ప‌నితీరుప‌ట్ల సంతృప్తిని వ్య‌క్తం చేశారు. తుదిద‌శ‌లో ఉన్న 72 అంగ‌న్‌వాడీ కేంద్రాల భ‌వ‌నాల నిర్మాణాన్ని పూర్తి చేయ‌డంపై దృష్టి పెట్టాల‌ని ఆదేశించారు. గ్రామీణ ఉపాధిహామీ ప‌థ‌కం క్రింద ప్ర‌స్తుతం 5,216 చెరువుల అభివృద్ది జ‌రుగుతోంద‌ని, ఇవి కాకుండా మ‌రిన్ని చెరువుల‌ను అభివృద్ది చేయాల‌ని సూచించారు. కొద‌మ‌, దార‌ప‌ర్తి త‌దిత‌ర‌ గిరిశిఖ‌ర గ్రామాల‌కు ర‌హ‌దారుల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాల‌న్నారు. నిరుద్యోగ‌ యువ‌త‌కు నైపుణ్య శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను విరివిగా నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు.

ఈ స‌మీక్షా స‌మావేశంలో జిల్లా ముఖ్య ప్ర‌ణాళికాధికారి జె.విజ‌య‌ల‌క్ష్మి, జిల్లా వైద్యారోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వ‌రి, వ్య‌వ‌సాయ, ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ జెడిలు తార‌క‌రామారావు, వైవి ర‌మ‌ణ‌, డిఇఓ జ‌య‌శ్రీ‌, ఎపిసి స్వామినాయుడు, ఎల్‌డిఎం శ్రీ‌నివాస‌రావు, హౌసింగ్ పిడి కూర్మినాయుడు, మార్కెటింగ్ ఎడి శ్యామ్‌కుమార్‌, మైక్రో ఇరిగేష‌న్ పిడి ల‌క్ష్మీనారాయ‌ణ‌, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Achieve the goals of Nithiyogi, District Collector A. Suryakumari