*Adopt modern techniques in agriculture * * Farmer should grow to the level of marketing his harvest * District Collector A. Suryakumari aspires for Kisan Mela
Publish Date : 23/11/2021
*వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంబించాలి*
*పండించిన పంటకు మార్కెటింగ్ చేసుకొనే స్థాయికి రైతు ఎదగాలి
*కిసాన్ మేళా సభలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆకాంక్ష
*జిల్లాలో మొక్కజొన్న ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన
విజయనగరం, నవంబర్ 23 ః పంటల సాగు చేసే విధానంలో రైతులు ఆధునిక పద్ధతులను అనుసరించాలని, నూతన ఒరవడిని కొనసాగించాలని కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. పండించిన పంటను వారే నేరుగా మార్కెటింగ్ చేసుకొనే స్థాయికి రైతులు ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. గాజులరేగలోని వ్యవసాయ పరిశోధన స్థానంలో మంగళవారం నిర్వహించిన కిసాన్ మేళాలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా వివిధ పరిశోధనా కేంద్రాలు, సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. రైతులకు ఉపయోగకరంగా ఉన్న పరికరాలను, పంటల నమూనాలను చూసి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు నూతన సాగు విధానాలను అవలంబించాలని, మెళకువలు పాటించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని, ముఖ్యంగా వాణిజ్య, ఆహార పంటలను సాగు చేయాలని చెప్పారు. పండించిన పంటలకు సొంతంగా మార్కెటింగ్ చేసుకోనే దిశగా ఆలోచన చేయాలని దీనికి కావాల్సిన సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళా రైతులు ముందుకు రావాలని మెళకువలు పాటించి లాభదాయక వ్యవసాయం చేయాలని హితవు పలికారు. ఇలాంటి కిసాన్ మేళాలు ఒక రోజు పాటు నిర్వహించి సరిపెట్టకుండా నిత్యకృత్యంలా సాగాలన్నారు. పరిశోధకులు, అధికారులు నేరుగా రైతుల వద్దకు ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించాలని చెప్పారు. మెరుగైన సేవలందించాలని సూచించారు. అప్పుడే ఆశాజనక ఫలితాలు వస్తాయని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఆహార పంటలను ప్రోత్సహించే విధంగా, రైతులకు ప్రయోజనం చేకూర్చే దిశగా పరిశ్రమలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
రైతుల్లో ఆత్మ విశ్వాసం నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.
వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డా. టి.ఎస్.ఎస్.కె. పాత్రో ఈ సందర్భంగా ప్రగతి నివేదికను వివరించారు. ఇటీవల కాలంలో జరిగిన పరిశోధనలు, వచ్చిన అవార్డుల గురించి ప్రస్తావించారు. సమీకృత వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ, పరిశోధన ఫలితాలు రైతులకు అందేలా పరిశోధన స్థానం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఏరువాక కేంద్ర సీనియర్ సైంటిస్ట్ కె. లక్ష్మణరావు, ఎన్.జి. రంగా విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టెన్సన్ పి. రాంబాబు, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఎన్. త్రిమూర్తులు, స్థానిక పరిశోధకులు సంధ్యారాణి, భరత లక్ష్మి, శ్రీనివాసరావు, వివిధ పరిశోధన కేంద్రం నుంచి వచ్చిన ప్రతినిధులు, రైతులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
