Be strategic in grain procurement, reviewed with officials and millers by JC Mayur Ashok
Publish Date : 26/09/2022
ధాన్యం కొనుగోలులో ప్రణాళికాయుతంగా వ్యవహరించండి
*అధికారులు, మిల్లర్లతో సమీక్ష నిర్వహించిన జేసీ మయూర్ అశోక్
విజయనగరం, సెప్టెంబర్ 22 ః ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో చేపట్టే ధాన్యం కొనుగోలులో అధికారులు, మిల్లర్లు ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని, ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆదేశించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి అన్ని విభాగాల అధికారులు సిద్ధంగా ఉండాలని, సంబంధిత చర్యలు ఇప్పటి నుంచే మొదలు పెట్టుకోవాలని చెప్పారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు సన్నద్ధతపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన అధికారులు, మిల్లర్లతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సారి ప్రభుత్వం జారీ చేసే నిబంధనలు కఠినంగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి పని చేయాల్సి ఉంటుందని జేసీ పేర్కొన్నారు. మిల్లర్లు అందరూ సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని, బ్లెండింగ్ మెషినరీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా సార్టెక్స్ ఫోర్టిఫైడ్ కేటగిరీలోకి వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని లేదంటే ధాన్యం సరఫరా చేయటం కుదరదని ఈ సందర్భంగా జేసీ హెచ్చరించారు. టెక్నికల్ సిబ్బందిని, రూట్ ఆఫీసర్లను సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా అందరూ సమన్వయంతో ముందుకెళ్లాలని జేసీ మయూర్ అశోక్ సూచించారు.
సమావేశంలో సివిల్ సప్లై డీఎం మీనా కుమారి, డీఎస్‌వో మధుసూధనరావు, జిల్లా వ్యవసాయ అధికారి వి.టి. రామారావు, ఎల్.డి.ఎం. శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ ఏడీ శ్యామ్‌కుమార్, జిల్లా మిల్లర్ల అసోషియేషన్ ప్రెసిడెంట్ కె. కొండబాబు, మిల్లర్లు, ఇతర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
