Byjus training for JEE, NEET, training will start from 16th of this month, teaching of moral values will also be given priority, District Collector A. Suryakumari
Publish Date : 12/08/2022
జెఇఇ, నీట్‌కు బైజూస్ శిక్షణ
ఈనెల 16 నుంచి శిక్షణ ప్రారంభం
నైతిక విలువల బోధనకూ ప్రాధాన్యత
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, ఆగస్టు 11 ః జిల్లా విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం లభించింది. జిల్లాకు చెందిన 50 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి, వారికి జెఇఇ, నీట్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రముఖ అంతర్జాతీయ ఎడ్యుకేషనల్, టెక్నో కంపెనీ బైజూస్ ముందుకు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు బైజూస్ సంస్థ ఉచితంగా ట్యాబ్‌లను అందజేస్తుందన్నారు. నీతి అయోగ్ ఏస్పిరేషనల్ జిల్లా కావడంతో, విజయనగరం జిల్లా విద్యార్థులకు ఈ అరుదైన అవకాశం వచ్చిందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల ఎంపికను పూర్తిచేసి, ఈ నెల 16 నుంచి శిక్షణను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే మరో 5వేల మందికి ఉచితంగా పాఠ్యాంశాలను, కంటెంట్‌ను అందించేందుకు కూడా బైజూస్ ముందుకు వచ్చిందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలే కాకుండా, నైతిక విలువలను, సత్ప్రవర్తనను, జీవితానికి అవసరమైన ఇతర అంశాలను కూడా బోధించాలని సూచించినట్లు తెలిపారు. అందివచ్చిన ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
నీట్, జెఇఇ కి శిక్షణకు ఎంపికలు
ప్రభుత్వ విద్యాసంస్థల్లో పదోతరగతి, ఇంటర్ చదువుతున్న అత్యుత్తమ ప్రతిభగల విద్యార్థులను బైజూస్ శిక్షణకు ఎంపిక చేయనున్నారు. విద్యార్థులకు స్క్రీన్‌టెస్టు నిర్వహించి, 25 మంది బాలురు, మరో 25 మంది బాలికలను ఎంపిక చేయనున్నారు. బాలికల్లో కెజిబివి విద్యార్థినులకు ప్రాధాన్యత ఇస్తారు. సమగ్ర శిక్ష ఎపిసి, జిల్లా వృత్తివిద్యాశాఖాధికారి ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఎంపిక చేసిన విద్యార్థులకు బైజూస్ రెండేళ్లపాటు ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ విధానంలో ఉచితంగా శిక్షణ అందిస్తుంది. ప్రతీరోజూ సాధారణ తరగతుల అనంతరం వీరికి కనీసం రెండున్నర గంటలపాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. దీనికోసం బైజూస్ సంస్థ జిల్లాలో కేర్‌టేకర్లను నియమిస్తుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచితంగా బైజూస్ ట్యాబ్‌లను, పాఠ్యాంశాలను అందిస్తుంది. డిజిటల్ క్లాస్‌రూమ్‌లో తరగతులు నిర్వహిస్తారు. బాలికలు, బాలురకు వేర్వేరుగా రెండు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి, అన్ని వసతులనూ కల్పించనున్నారు. జిల్లాలో శిక్షణ పొందుతున్న స్పెషల్ డిప్యుటీ కలెక్టర్, ఈ శిక్షణా కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.
మరో 5వేల మందికి విద్యా సహకారం
అందరికీ విద్య కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని సుమారు 5వేల మంది విద్యార్థులకు పాఠ్యాంశాలను అందించేందుకు బైజూస్ ముందుకు వచ్చింది. ఎంపికైన విద్యార్థులు తమ సెల్‌ఫోన్ లేదా ట్యాబ్ లో బైజూస్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే, మూడేళ్లపాటు వారికి అవసరమైన పాఠ్యాంశాలను ఉచితంగా అందించనుంది. నాల్గవ తరగతి నుంచి ఇంటర్ మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులెవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ శిక్షణకు కూడా ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. సమగ్ర శిక్ష పిఓ, జిల్లా వృత్తివిద్యాశాఖాధికారి ద్వారా ఈ ఎంపికను పూర్తి చేసి, ఆగస్టు నెలాఖరు నాటికి వీరికి బైజూస్ ద్వారా పాఠ్యాంశాలను అందించనున్నారు.
