Covid Rules Everybody has to abide by and wear a mask, says District Collector Smt. A.Suryakumari
Publish Date : 10/12/2021
కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే
మాస్కు ధరించాల్సిందే
మూడో దశ ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధం
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి
కోవిడ్ సన్నద్ధతపై సమావేశం
విజయనగరం, డిసెంబరు 09; మూడో దశ కోవిడ్ ముప్పును ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య యంత్రాంగం సన్నద్ధంగా వుండాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి ఆదేశించారు. ఒమిక్రాన్ రూపంలో కొత్త కోవిడ్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలంతా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపట్టాల్సి వుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రపరచుకోవడం వంటి నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు కూడా వుండాలన్నారు. కోవిడ్ ముప్పును ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ సూర్యకుమారి జాయింట్ కలెక్టర్ డా.మహేష్ కుమార్‌తో కలసి గురువారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
జిల్లాలో కోవిడ్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా, బెడ్లు, ఇతర మౌలిక సదుపాయాలన్నీ జిల్లాలోని ఆసుపత్రుల్లో అందుబాటులో వున్నట్టు జాయింట్ కలెక్టర్ డా.మహేష్ కుమార్ తెలిపారు. అవసరమైన సంఖ్యలో వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని కూడా నియమించామని మానవవనరుల కొరత కూడా లేదని పేర్కొన్నారు. అవసరమైన మేరకు మందులను సిద్ధంచేసుకోవడం, ఆసుపత్రులకు అవసరమైన సర్జికల్ పరికరాలు సమకూర్చుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. కోవిడ్ సన్నద్ధతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న అంశాలన్నీ అమలు చేస్తున్నట్టు చెప్పారు. పార్వతీపురంలోనూ ఆక్సిజన్ సరఫరా ప్లాంటు సిద్ధమవుతోందని, ఈనెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం వుందన్నారు.
కోవిడ్ వ్యాధిగ్రస్తుల కోసం గతంలో గ్రామ పంచాయతీ స్థాయిలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదించామని, జిల్లాలో 667 ప్రదేశాల్లో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు భవనాలు గుర్తించామని, వాటిని అవసరమైన సమయంలో వినియోగించేలా తగిన ఏర్పాట్లతో సిద్ధం చేసుకోవలసి వుందన్నారు. ఒక్కో కేంద్రంలో కనీసం 20 మంది వుండేలా చర్యలు చేపట్టామన్నారు.
దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చేవారిపై నిఘా వుంచాలని కలెక్టర్ సూచించారు. ఆయా గ్రామాలకు వచ్చే వారి సమాచారం సేకరించాలని కలెక్టర్ చెప్పారు.
అన్ని ప్రభుత్వ ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రులకు ఒక్కో జిల్లా అధికారిని నియమించేందుకు ప్రతిపాదనలు సిద్దంచేస్తామని జె.సి. తెలిపారు.
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోగులకు అందించే భోజనంలో నాణ్యత, నాణ్యమైన తాగునీరు, ఆసుపత్రుల్లో ఆరోగ్యకర వాతావరణం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు వుండేలా చర్యలు చేపట్టాల్సి వుందని కలెక్టర్ చెప్పారు.
జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల పరిస్థితి గురించి కలెక్టర్ ఆరా తీశారు. వాటిలో కల్పిస్తున్న సదుపాయాలు, అందిస్తున్న సేవలపై సమీక్షించాల్సి వుందని కలెక్టర్ పేర్కొన్నారు.
కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేస్తామని జాయింట్ కలెక్టర్ డా.మహేష్ కుమార్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో కోవిడ్‌పై త్వరలోనే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.
జిల్లాలో పిల్లలకు న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఏమేరకు వేస్తున్నదీ కలెక్టర్ తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణకుమారి, వైద్య ఆరోగ్య మౌలిక వసతుల సంస్థ ఇ.ఇ. సత్య ప్రభాకర్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.నారాయణ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
