Close

Crop damage compensation to 8730 farmers in the district, benefit of Rs 3.91 crore to rose victims, District Collector A. Surya Kumari

Publish Date : 17/11/2021

జిల్లాలో 8730  మంది రైతులకు పంట నష్ట పరిహారం

గులాబ్ బాధితులకు 3.91 కోట్ల  రూపాయల లబ్ది

జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి

మా దేవుడు మీరు – మీ భక్తులం మేము – మహిళా రైతు  ముద్దాడ లక్ష్మి

విజయనగరం, నవంబర్ 16 :  సెప్టెంబర్ నెలలో సంభవించిన గులాబ్ తుఫాన్ కు జిల్లాలో  పంట నష్ట పోయిన  8730  మంది రైతులు   పంట నష్ట పరిహారంగా 3.91 కోట్ల రూపాయల లబ్ది పొందడం  జరిగిందని  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు.   రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి   గులాబ్ తుఫాన్ కు నష్ట బోయిన ఆరు కోస్తా జిల్లాల కు చెందిన రైతులకు పంట నష్ట పరిహారాన్ని  మంగళవారం   వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి జిల్లా నుండి కలెక్టర్ ఎ.సూర్య కుమారి తో పాటు సంయుక్త కలెక్టర్ రెవిన్యూ డా.జి.సి.కిషోర్ కుమార్ , వ్యవసాయ శాఖ జే.డి తారక రామారావు, మహిళా రైతు ముద్దాడ లక్ష్మి, ఇతర రైతులు హాజరైనారు.  ఈ సందర్భంగా కలెక్టర్  ముఖ్యమంత్రి తో మాట్లాడుతూ జిల్లాలో గులాబ్ తుఫాన్ కు   ప్రధానంగా 1603 ఎకరాల్లో  వరి, 1989 ఎకరాల్లో మొక్క జొన్న, 267 ఎకరాల్లో ప్రత్తి పంటలకు నష్టం    జరిగిందని వివరించారు.  ఉద్యాన పంటలు కూడా అరటి, బొప్పాయి, కూరగాయల పంటలు దెబ్బ తిన్నాయని వివరించారు.

          అనంతరం మీడియా తో మాట్లాడుతూ ఈ పంట ద్వారా నమోదు అయిన వారికీ నష్ట పరిహారం అందుతుందని, ప్రతి ఒక్కరు ఈ పంట నమోదు, ఈ,కే.వై.సి తప్పనిసరిగా నమోదు  చేసుకోవాలని అన్నారు.  కౌలు రైతులకు కూడా పరిహారం అందుతుందని, వారు కూడా ఆర్.బి.కే లలో నమోదు చేసుకోవాలన్నారు.  ఇంకో తుఫాన్ ఈ రెండు రోజుల్లో పొంచి ఉందని, రైతులంతా అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా ఈ క్రాప్ నమోదు చేసుకోవాలని కోరారు.  తుఫాన్ వలన నష్టాలు  సంభవిస్తే వెంటనే కంట్రోల్ రూమ్ కు లేదా టోల్ ఫ్రీ  నెంబర్ కు సమాచారాన్ని అందించాలని అన్నారు.   ఈ  సందర్భంగా కలెక్టర్, జే.సి చేతుల మీదుగా రైతులకు మెగా  చెక్కును అందజేశారు.

     సమావేశం  అనంతరం   పౌర సరఫరాలు , ఎ.పి.మార్క్ ఫెడ్  శాఖలు ఖరిఫ్ సీజన్ 2021 ధాన్యం కొనుగోలు పై ముద్రించిన కర పత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఇక రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందని, మద్దతు ధర,  నాణ్యతా ప్రమాణాల వివరాలు ,  ధాన్యం సేకరణ టోల్ ఫ్రీ నెంబర్ 1902 తెలిపే సమాచారాన్ని  ఈ కర పత్రం లో ముద్రించారు.

మా దేవుడు మీరు – మీ భక్తులం మేము:::ముఖ్యమంత్రి తో మహిళా రైతు  ముద్దాడ లక్ష్మి::

    గులాబ్ తుఫాన్  నష్ట పరిహారాన్ని అందుకున్న చీపురుపల్లి మండలం, నిమ్మలవలస గ్రామానికి చెందిన మహిళా రైతు  ముద్దాడ లక్ష్మి ముఖ్యమంత్రి తో మాట్లాడుతూ  గులాబ్ తుఫాన్  కు తాను  ఎకరం లో వేసిన మొక్క జొన్న పంట  నష్టం జరిగిందని, 45 రోజుల్లోనే పంట నష్టాన్ని అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.  గతం లో ఇళ్ళకు వచ్చి కాగితాలు రాసే వారు కాని, డబ్బులు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసే వారమని, ఊహించని విధంగా  ఆర్.బి.కే నుండి వ్యవసాయ అధికారి వచ్చి మీకు నష్ట పరిహారం వచ్చిందని చెప్పడం తో ఆనందం వేసిందని అన్నారు.  గతం  లో విత్తనాలు,  ఎరువులు, పురుగు మందుల కోసం వారం వరకూ తిరిగే వాళ్ళమని, వారం రోజుల కూలీ పోవడమే కాక, డబ్బులు ఖర్చేయ్యేవని,   ఇప్పుడు అన్ని వేళల్లో  రైతు భరోసా కేంద్రం లోనే నాణ్యమైన ఎరువులు విత్తనాలు అందుతున్నాయని, అంతే కాకుండా సబ్సిడీ పై యంత్రాలు కూడా ఇస్తున్నారని అన్నారు.   రైతు భరోసా కేంద్రాలు మాకు దేవాలయాలని, మీరే మాకు దేవుడని, మేము మీ భక్తులమని ముఖ్యమంత్రి తో భావోద్వేగం తో అన్నారు.  మీరిచ్చిన సున్నా వడ్డీ, అమ్మఒడి  పధకాలతో ఎంతో లబ్ది పొందామని, ఒక ఆవును కొనుక్కుని పాలను అమ్ముతున్నానని,  తన భర్తకు రైతు భరోసా అందిందని ఆనందంగా చెప్పారు.   గతం లో చదువుల కోసం గ్రామస్తులు  దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చేదని, నాడు-నేడు తో అన్ని సౌకర్యాలతో బడులు  అభివృద్ధి చెందాయని ,  గ్రామం లో  కంపూటర్లు, ఆన్లైన్ క్లాసు లు చూస్తుంటే ముచ్చట గా  ఉందని అభిప్రాయం వ్యక్తం చేసారు.  1 వ తారీఖున ఉదయాన్నే పించన్ అందిస్తూ అందరికీ పెద్ద కొడుకుగా నిలిచారని, అందరికీ ఆనందం పంచే మీతో మాట్లాడడం చాల సంతోషంగా ఉందని తెలిపారు.

Crop damage compensation to 8730 farmers in the district, benefit of Rs 3.91 crore to rose victims, District Collector A. Surya Kumari