Close

District Collector A. Suryakumari calls on children to live healthily and create a healthy society. Children’s Day celebrations

Publish Date : 15/11/2021

బాల్యం నిర్భ‌యంగా గ‌డ‌పాలి
ఆరోగ్య‌క‌ర స‌మాజాన్ని రూపొందించాలి
జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి పిలుపు
ఘ‌నంగా బాల‌ల దినోత్స‌వ వేడుక‌లు
విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 14 ః
           ఎటువంటి ఒత్తిడి, భ‌యాందోళ‌న‌లు లేకుండా బాల్యాన్ని నిర్భయంగా, స్వేచ్ఛాయుతంగా, సంతోష‌భ‌రితంగా గ‌డ‌పాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి కోరారు. కోవిడ్ కార‌ణంగా గ‌త రెండేళ్లుగా పిల్ల‌లు మ‌రిన్ని ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. జీవితంలో తిరిగిరాని బాల్యం, ప్ర‌తీఒక్క‌రికీ మ‌ధుర స్మృతుల‌ను మిగ‌ల్చాల‌ని ఆకాంక్షించారు.
            స‌మ‌గ్ర శిక్ష ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో ఆదివారం జ‌రిగిన బాల‌ల దినోత్స‌వానికి, జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ముందుగా పండింట్ నెహ్రూ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, ప‌లు కార‌ణాల‌తో నేటిత‌రం బాల్యంలోని మాధుర్యానికి దూర‌మ‌వుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బాల్యాన్ని ఆస్వాదించాల్సిన‌ అవ‌స‌రం ఉంద‌న్నారు. నేటి పిల్ల‌ల్లో ఎక్కువ‌మంది పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నార‌ని, ర‌క్తం స‌రిప‌డినంత ఉండ‌టం లేద‌న్నారు. పిల్ల‌ల‌కు పోష‌కాహారాన్ని అందించి, ఆరోగ్య‌క‌ర‌మైన స‌మాజాన్ని రూపొందించాల్సిన బాధ్య‌త ప్ర‌తీఒక్క‌రిపైనా ఉంద‌ని సూచించారు. ఎక్కువ‌గా గిరిజ‌న పిల్ల‌ల్లో పోష‌కాహార లోపాన్ని తాను గ‌మ‌నించిన‌ట్లు చెప్పారు.
          బాల్య వివాహాలు కూడా గిరిజ‌న ప్రాంతంలో ఎక్కువ‌గా జ‌రుగుతున్న‌ట్లు త‌న దృష్టికి వ‌చ్చింద‌న్నారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ త‌మ‌కు 18 ఏళ్లు నిండేవ‌ర‌కూ వివాహం చేసుకోవ‌ద్ద‌ని విద్యార్థినుల‌ను కోరారు. బాల్య వివాహాలు ఎక్క‌డైనా జ‌రుగుతున్న‌ట్లు తెలిస్తే, అధికారుల‌కు ఫిర్యాదు చేయాల‌ని సూచించారు. సినిమాలు, టివి, సోష‌ల్ మీడియా చూసి ప్రేర‌ణ పొంది త‌ప్పుడు మార్గాలు అవ‌లంబించ‌వ‌ద్ద‌ని, ఎవ‌రికైనా జీవితంలో స్థిర‌ప‌డేందుకు చ‌దువు ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. తాము చ‌దువుకోవ‌డ‌మే కాకుండా, త‌మ కుటుంబంలోని వారికి, తోటి వారికీ కూడా చ‌దువుకోవ‌డం నేర్పాల‌ని కోరారు. మ‌హిళ‌ల‌ను, బాలిక‌ల‌ను చిన్న‌త‌నం నుంచే గౌర‌వించ‌డం అల‌వ‌ర్చుకోవాల‌ని బాలుర‌కు సూచించారు. ప‌లు అంశాల్లో కెజిబివి విద్యార్థినులు చూపిన‌ ప్ర‌తిభ‌ను అభినందించారు. జాతీయ‌, రాష్ట్ర స్థాయిలో రాణించాల‌ని క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ఆకాంక్షించారు.
            బాల‌ల దినోత్స‌వ ప్రాధాన్య‌త‌ను, చాచా నెహ్రూ గొప్ప‌ద‌నాన్ని వివ‌రిస్తూ, విజ‌య‌న‌గ‌రం కెజిబివి విద్యార్థిని బి.కిన్ను, గంట్యాడ కెజిబివి విద్యార్థిని సిహెచ్ మాధురి, ఆంగ్లంలో చేసిన ప్ర‌సంగాలు ఆక‌ట్టుకున్నాయి. ఆడ‌పిల్ల‌ల‌ సంర‌క్ష‌ణ‌, మ‌హిళ‌ల ఔన్న‌త్యం, స్త్రీ ప్రాధాన్య‌త‌ల‌పై బొబ్బిలి మండ‌లం పెంట జెడ్‌పిహెచ్ఎస్ విద్యార్థిని సీతామ‌హ‌ల‌క్ష్మి అద్భుతంగా ప్ర‌సంగించింది. ఈ ముగ్గురు విద్యార్ధినుల‌ను క‌లెక్ట‌ర్ ప్ర‌త్యేకంగా పుష్ప‌గుచ్ఛాల‌తో అభినందించారు. కొత్త‌వ‌ల‌స‌, చీపురుప‌ల్లి, వియ్యంపేట‌, వేపాడ‌ కెజిబివిలు, చీపురుప‌ల్లి సాంఘిక సంక్షేమ పాఠ‌శాల విద్యార్థినుల సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు అల‌రించాయి. బాల‌ల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని నిర్వ‌హించిన వ్యాస‌ర‌చ‌న‌, వ‌క్తృత్వం, పోస్ట‌ర్ పెయింటింగ్‌, క్రీడా పోటీల విజేత‌ల‌కు క‌లెక్ట‌ర్ చేతుల‌మీదుగా బ‌హుమ‌తి ప్ర‌దానం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వ‌రి, ఇన్‌ఛార్జి డిఇఓ ల‌క్ష్మ‌ణ‌రావు, స‌మ‌గ్ర శిక్ష ఎపిసి డాక్ట‌ర్ విఏ స్వామినాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
District Collector A. Suryakumari calls on children to live healthily and create a healthy society. Children's Day celebrations