District Collector A. Suryakumari ordered to ensure that the admissions in the educational institutions are not reduced at any level.
Publish Date : 10/08/2022
విద్యాసంస్థల్లో ప్రవేశాలు తగ్గకుండా చూడండి
ఇంటర్న్‌షిప్‌కు ఏర్పాట్లు చేయాలి
డిగ్రీ కళాశాలల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశాలు
విజయనగరం, ఆగస్టు 08 విద్యాసంస్థల్లో ఏ స్థాయిలో కూడా ప్రవేశాలు తగ్గకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ఎక్కడైనా ప్రవేశాలు తగ్గితే, దానికి తగిన కారణాలను అన్వేషించాలన్నారు. డ్రాపౌట్స్ ఎక్కడా ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో వివిధ విద్యాసంస్థల్లో చేపట్టిన ప్రవేశాలపై, తన ఛాంబర్‌లో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా సంస్థల వారీగా, ఇప్పటివరకు జరిగిన ప్రవేశాలపై ఆరా తీశారు. తరగతుల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డ్రాపౌట్స్‌ను ఎక్కడైనా గుర్తిస్తే, వారి చదువు ఏదోవిధంగా కొనసాగేలా చూడాలన్నారు. కనీసం వృత్తివిద్యలోనైనా వారిని చేర్చాలని సూచించారు. ఆడపిల్లలతో సహా ప్రతీఒక్కరూ డిగ్రీవరకు చదివిలా చూడాలన్నారు. విద్యార్థులందరికీ కోవిడ్ వేక్సినేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాసంస్థల్లో పారిశుధ్యం, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. త్వరలో విద్యార్థులందరికీ వైద్య పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులకు ఇంటర్నషిప్‌కు ఏర్పాట్లు చేయాలని, దీనికి అవసరమైన రిజిష్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రతీ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, బ్రిడ్జికోర్సులను నిర్వహించి, వారు ఉద్యోగాలకోసమే ఎదురు చూడకుండా, స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనపై అవగాహన కల్పించాలని కోరారు. దీనికోసం ఒక కేలండర్‌ను రూపొందించాలన్నారు. మహిళల ఉపాధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఎంఎస్ఎంఇ పార్కులో 90 శాతం సబ్సిడీతో యూనిట్లను స్థాపించుకొనే అరుదైన అవకాశం వచ్చిందని, దీనిని వినియోగించుకొనేలా పూర్వ విద్యార్థులను సైతం చైతన్యపరచాలని సూచించారు. ప్రతీ విద్యాసంస్థలో తిరంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ప్రతీ విద్యార్థిచేతా సెల్ఫీలను తీయించి, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయించాలని కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ విఏ స్వామినాయుడు, ఆర్ఐఓ మజ్జి ఆదినారాయణ, డివిఈఓ సురేష్‌కుమార్, ఐసిడిఎస్ పిడి బి.శాంతకుమారి, సోషల్ వెల్ఫేర్ డిడి రత్నం, గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయాధికారి చంద్రావతి, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
